సప్తముఖ..వీడ్కోలికా


Mon,September 24, 2018 01:23 AM

ఖైరతాబాద్: పదకొండు రోజుల పాటు ఘనంగా పూజలందుకున్న ఖైరతాబాద్ గణపయ్య ఆదివారం మధ్యాహ్నం 12.56 నిమిషాలకు గంగమ్మ ఒడికి చేరాడు. స్వామివారికి అశేష భక్తజనం జయజయధ్వానాలతో ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ ఏడాది 57 అడుగుల ఎత్తు 27 అడుగుల వెడల్పు, ఏడు శేషుల పడగ నీడలో శ్రీ సప్తముఖ కాలసర్ప మహాగణపతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. సుమారు 20 లక్షల మంది స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. శనివారం సాయంత్రం నుంచే క్యూలైన్లను నిలిపివేసిన గణేశ్ ఉత్సవ కమిటీ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లను ప్రారంభించింది. ఉదయం 7.05 నిమిషాలకు స్వామి వారి శోభాయాత్ర ప్రారంభమై ..మధ్యాహ్నం 12.56 గంటలకు నిమజ్జనంతో పరిసమాప్తమైంది. అంతకుముందు మహాగణపతికి ఎన్‌టీఆర్ మార్గ్ వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ , జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిశోర్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల పండగులకు సమానమైన ఆదరణ లభిస్తున్నదన్నారు. ప్రజలందరికీ ఆ వినాయకుడు విఘ్నాలను తొలిగించి ఆయూరారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గణేశ్ ఉత్సవ కమిటీ చైర్మన్ సింగారి సుదర్శన్, కన్వీనర్ సందీప్ రాజ్, ఉపాధ్యక్షుడు ఎం. మహేశ్ యాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సింగారి రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...