అసలైనవేనా?


Sun,September 23, 2018 02:12 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నకిలీ ఓట్ల నిగ్గుతేల్చేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా 50 కంటే ఎక్కువగా ఓట్లును ఇండ్లను జల్లెడపడుతున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో శనివారం నుంచే రంగంలోకి దిగిన అధికారులు హైదరాబాద్ జిల్లాలో వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఇందుకోసం నియోజకవర్గానికి ఒక పర్యవేక్షణ అధికారిని నియమించారు.డిప్యూటీ కలెక్టర్, ఇతర సీనియర్ అధికారులను పర్యవేక్షకులుగా నియమించి వెరిఫికేషన్‌ను కొనసాగిస్తున్నారు. ఎన్నికల సంఘం అధికారుల ఆదేశాల మేరకు తహసీల్దార్లు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మండలాల వారీగా ఓట్ల వెరిఫికేషన్‌ను చేపట్టారు. వీఆర్‌వోలను క్షేత్రస్థాయిలోకి పంపించి ఒకే ఇంటి నెంబర్‌లో 50 ఓట్లు ఉంటే వాటిని వెరిఫికేషన్‌ను చేయిస్తున్నారు. ఇంటి నెంబర్లు పొరపాటుగా పడడం, లేదంటే ఎక్కువ మంది నివాసం ఉన్న కారణంగా కొన్ని ఇండ్లల్లో 50కి మించి ఓట్లు ఉండడం జరుగుతున్నది. అపార్ట్‌మెంట్లు, నివాస సముదాయాల్లో ఒకే ప్రాంగణంలో 50కి మంచి ఓట్లుండే అవకాశముంటుంది. అయితే కొన్ని సార్లు ఒకే ఇంటి నెంబర్‌పై నకిలీ ఓట్లు సైతం నమోదైనట్లుగా అధికారుల పరిశీలనలో తెలింది. దీంతో ఆయా ఓట్లు అసలువేనా కాదా.. అన్న సందేహాలున్నాయి. ఈ విషయాలన్నింటిని పరిగణంలోకి తీసుకున్న అధికారులు సిబ్బందిని పురమాయించి వెరిఫికేషన్‌ను చేయిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తవ్వగానే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు తీసుకునేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.

ఫొటోలు అస్పష్టంగా ఉన్నవాటిపైనా..
ఓటరు జాబితాలో పేర్లు ఉండి ఫొటోలు అస్పష్టంగా ఉన్న వాటిని సైతం పరిశీలించనున్నారు. చాలా మంది ఓటరు నమోదు సమయంలో చిన్నసైజు ఫొటోలను అప్‌లోడ్ చేయడంతో అవి ఓటర్ల ఫొటోలు జాబితాలో సరిగ్గా కనిపించడం లేదు. ఇక కొన్ని సార్లు ఒకరిని బదులుగా మరొకరి చిత్రాలు జాబితాలో వస్తున్నాయి. వాటిని సరిచేసేందుకు తాజా వెరిఫికేషన్‌లో భాగంగా చర్యలు తీసుకుంటున్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...