సాగర్‌లో నేడు సప్తముఖుడి నిమజ్జనం


Sun,September 23, 2018 02:11 AM

ఖైరతాబాద్ గణేశుడి క్రేన్ మార్పు
ఖైరతాబాద్ గణేశుడిని నిమజ్జనోత్సవానికి వినియోగించే క్రేన్‌ను మార్చారు. గత కొన్ని సంవత్సరాలుగా రవి క్రేన్స్ సంస్థ ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనానికి వినియోగించే వారు. కాగా సాంకేతిక కారణాల వల్ల 50 టన్నులకు పైగా బరువుండే విగ్రహాన్ని ఎత్తే రవి క్రేన్ అందుబాటులోకి రాలేదు. దీంతో దాని స్థానంలో జపాన్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న టడానో క్రేన్ ఈ సారి గణేశుడిని నిమజ్జనానికి వినియోగిస్తున్నారు. ఈ క్రేన్‌లో అనేక విశిష్టతలు ఉన్నాయి. 400 టన్నుల బరువును అవలీలగా పైకి ఎత్తుతుంది. 12 టైర్లతో నడిచే ఈ క్రేన్ గంటకు 85 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. క్రేన్ 14 మీటర్ల పొడవు, 4మీటర్ల వెడల్పు ఉంటుంది. ఒక్క భూమ్ పొడవు 60 మీటర్ల వరకు సాగుతుంది. ఈ యంత్రాన్ని మ్యానువల్‌గా, రిమోట్ కంట్రోల్ సిస్టమ్‌తో ఆపరేట్ చేయవచ్చు తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లోనే మొదటి సారిగా మన నగరంలో దీనిని వినియోగిస్తున్నారు.

ఖైరతాబాద్ : పదకొండు రోజులపాటు భక్త జన కోటి నీరాజనాలందుకున్న ఖైరతాబాద్ శ్రీసప్తముఖ కాలసర్ప మహాగణపతి ఆదివారం జయ జయ ద్వానాల మధ్య సాగర్‌లో గంగమ్మ ఒడికి చేరుకుంటాడు. 57అడుగుల ఎత్తు, 27వెడల్పుతో ఏడు శేషుల పడగ నీడలో ఏడు ముఖాలు, 14 చేతులతో లక్ష్మీ, సరస్వతి సమేతుడై నిండైన రూపంలో దర్శనిమిచ్చిన ఖైరతాబాద్ గణేశుడిని చివరి రోజు కళ్లారా చూసేందుకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. ఖైరతాబాద్‌లో శనివారం ఇసుకేస్తే రాలనంత భక్తజనం బారులు తీరారు. సుమారు 60 టన్నుల బరువుండే గణపతిని తరలించేందుకు 26 చక్రాల ట్రాలీని సిద్ధం చేశారు. అధికారులు నిర్ణయించిన సమయం ప్రకారం ఉదయం 7గంటలకు ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. 9.30గంటలకు క్రేన్ వద్దకు చేరుకున్న అనంతరం 11.30గంటల నుంచి 12గంటల మధ్యన నిమజ్జనం చేయనున్నారు. బల్దియా తరఫున ఈ మహాఘట్టాన్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిశోర్, సెంట్రల్ జోన్ జోనల్ కమిషనర్ ఎండీ ముషరఫ్ అలీ ఫారూఖీ, డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ, ఏఎంఓహెచ్ భార్గవ నారాయణ, రవికాంత్‌లు పర్యవేక్షించనున్నారు.

ఆరో నంబర్ క్రేన్ ద్వారా నిమజ్జనం..
ప్రతి సంవత్సరం నాల్గవ నంబరు క్రేన్ వద్ద నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ ఏడాది నిమజ్జన ఘాట్‌లో స్వల్ప మార్పులు చేశారు. ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్ చుట్టూన సుమారు 37 క్రేన్‌లను జీహెచ్‌ఎంసీ ఏర్పాటుచేయగా, సీరియల్ నంబర్ల ప్రకారం ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడికి ఆరవ నంబరును కేటాయించారు. గత ఏడాది రవి క్రేన్స్ నిర్వాహకులు గణేశుడి నిమజ్జనానికి క్రేన్ అందిస్తుండగా, అందులోనూ మార్పు చోటుచేసుకున్నది. మోడ్రన్ క్రేన్‌ను ఈ నిమజ్జనానికి వినియోగిస్తున్నారు. గణేశుడితోపాటు ఈ సారి శ్రీనివాస్ కల్యాణ ఘట్టంతో రూపొందించిన ప్రతిమలను సైతం నిమజ్జనం చేయనున్నారు. శివపార్వతుల విగ్రహాలను మాత్రం వరంగల్‌కు చెందిన ఓ సంస్థ దేవాలయంలో ప్రతిష్ఠించేందుకు తరలించుకెళ్తుందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...