అపోహలకు తావులేకుండా..


Sun,September 23, 2018 02:11 AM

సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం పూర్తి పారదర్శకంగా సాగుతున్నట్లు, ఇందులో ఎటువంటి అపోహలకు తావులేదని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం. దానకిశోర్ భరోసా ఇచ్చారు. అవకతవకలకు తావులేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టంచేశారు. రాజకీయపార్టీల ప్రతినిధుల సందేహాలను నివృత్తిచేస్తూ, వారి సూచనలు, సలహాల ప్రకారం మరిన్ని జాగ్రత్త చర్యలు పాటిస్తామని చెప్పారు.ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై శనివారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో దానకిశోర్ అధ్యక్షతన వివిధ రాజకీయపార్టీల ప్రతినిధుల సమావేశం జరిగింది. కమిషనర్ కమిషనర్ మాట్లాడుతూ డూప్లికేట్ ఓట్లపై సమగ్ర విచారణ నిర్వహిస్తున్నట్లు, వాస్తవంగా డూప్లికేట్ అని నిర్థారించుకున్న తరువాతే అదనంగా ఉన్నవాటిని తొలిగిస్తామని చెప్పారు. అలాగే, చనిపోయినవారి ఓట్లను కూడా మరణాల నమోదు రికార్డుల ఆధారంగా గుర్తించి తొలిగింపు ప్రక్రియ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇటువంటి ఓటర్లందరికీ ముందస్తు నోటీసులు జారీచేసి వారిచ్చే సమాధానం ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త ఓటర్ల నమోదు, తప్పొప్పుల సవరణకు సంబంధించి గత శుక్రవారం(21వ తేదీ) వరకు 77622 దరఖాస్తులు వచ్చినట్లు, ఇందులో సగం దరఖాస్తులు ఆన్‌లైన్‌లో రాగా, మిగిలిన సగం మ్యాన్యువల్ దరఖాస్తులు వచ్చాయన్నారు.

వీటిపై విచారణ జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. దరఖాస్తులు చేసుకునేవారు ఈనెల 25వ తేదీలోగా చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ 8న ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తామన్నారు. మరణించిన వారి ఇండ్లకు అధికారులు వెళ్లి జాబితా నుంచి సదరు పేరు తొలిగింపునకు తగిన దరఖాస్తు(ఫామ్-7) సమర్పించాలని కోరుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు మరణించినవారి ఓట్లు 4000 గుర్తించినట్లు, అలాగే 60వేల ఓట్లు ఒకే ఫొటోతో కూడినవి ఉన్నట్లు(డూప్లికేట్ ఓట్లు) గుర్తించినట్లు చెప్పారు. దీంతో అధికారులు వాటిని పునర్‌పరిశీలన నిర్వహించేందుకు వారి ఇండ్లకు వెళ్తున్నట్లు చెప్పారు. డూప్లికేట్ ఓట్లని నిర్థారించుకున్నాకే వాటిని తొలిగిస్తారన్నారు. అవసరాలకు అనుగుణంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించుకొని నిర్థారిత షెడ్యూల్ ప్రకారం విధులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇచ్చిన సూచనలు, సలహాల ప్రకారం జాబితా సవరణలో మరిన్ని జాగ్రత్తలు పాటించి పారదర్శకంగా జాబితాను రూపొందిస్తామని దానకిశోర్ వివరించారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...