నిఘా నీడలో నిమజ్జనం


Fri,September 21, 2018 12:46 AM

-కమాండ్ కంట్రోల్‌కు కెమెరాలు అనుసంధానం
-30 వేల గణపతుల నిమజ్జనానికి ఏర్పాట్లు
-క్రేన్లకు ప్రత్యేక హుక్కులు
-23న ఉదయం 11.30 గంటలకే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం

ఏర్పాట్లు..
- నగరంలో మొత్తం 2.50 లక్షల సీసీ కెమెరాలు
- ట్యాంక్ బండ్ చుట్టూ 60
- 25 వేల మంది సిబ్బంది
- 18 కిలోమీటర్ల ప్రధాన ర్యాలీపై నిఘా నేత్రం
- 51 స్టాటిక్ క్రేన్లు
- 15 అంబులెన్స్‌లు
- 2 వైద్య బృందాలు
- 15 ఫైర్‌ఇంజన్లు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గణేష్ నవరాత్రులు ముగింపు సందర్భంగా 23న జరిగే నిమజ్జనోత్సవానికి హైదరాబాద్ పోలీసులు బందోబస్తు ఏర్పాట్లను పూర్తిచేశారు. సుమారు 15 లక్షల మంది భక్తులు హాజరవుతున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. దాదాపు 25 వేల మంది సిబ్బందితో బందోబస్తు కోసం మోహరిస్తున్నారు. ఈ ఏర్పాట్లపై గురువారం బషీర్‌బాగ్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ అంజనీకుమార్ ఏర్పాటు చేసిన సమావేశంలో బందోబస్తు వివరాలను వెల్లడించారు. నిమజ్జనోత్సవ ప్రధాన ర్యాలీ మొత్తం 18 కిలోమీటర్లు సాగుతుంది. కేశవగిరి నుంచి ప్రారంభమై చాంద్రాయణగుట్ట, ఛత్రినాక, లాల్‌దర్వాజ, నాగులచింత, శాలిబండ, మొఘల్‌పురా, చార్మినార్, గుల్జార్‌హౌస్, పత్తర్‌గట్టీ, అఫ్జల్‌గంజ్, సిద్ధిఅంబర్‌బజార్, ఎంజేమార్కెట్, అబిడ్స్, బషీర్‌బాగ్ మీదుగా హూసేన్‌సాగర్ వరకు కొనసాగుతుంది. బాలాపూర్, పహడీషరీఫ్, మహేశ్వరం, మహంకాళి ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలు కేశవగిరి వద్ద ప్రధాన ర్యాలీలో కలుస్తాయి. ప్రధాన ర్యాలీతో హైదరాబాద్ పరిసరాల్లో జరిగే నిమజ్జన ఊరేగింపు మొత్తం 120 కిలోమీటర్ల విస్తీర్ణంలో జరుగనున్నాయి. ప్రశాంత వాతావరణం కోసం హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధితో పాటు ఇతర రాష్ట్రాలు, జిల్లా నుంచి మొత్తం 25 వేల మంది పోలీసులు బందోబస్తులో ఉంటారు. మొత్తం 14500 మండపాల నిర్వాహకులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోగా, మరో 14,500 విగ్రహాలను అదనంగా ఏర్పాటు చేశారు. టెక్నాలజీతోపాటు సీసీ కెమెరాలతో మొత్తం ర్యాలీని పోలీసు అధికారులు వీక్షించనున్నారు.మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ బృందాలను రంగంలోకి దించుతున్నాం. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా 310 అతిసున్నిత, 605 సున్నితమైన ప్రాంతాలను గుర్తించి గస్తీని పెంచాం సీపీ వివరించారు. నిమజ్జన ర్యాలీకి వచ్చే భక్తులు, ప్రజలకు ఎలాంటి గందరగోళం లేకుండా ఈసారి సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు.

ఖైరతాబాద్ గణేష్ విగ్రహాం నిమజ్జనం 11.30 కల్లా పూర్తి...
ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ భారీ గణేష్ విగ్రహాన్ని 11.30 గంటల వరకు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఈ గణేష్ వెంట లక్షలాది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఆలస్యమైతే ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉండడంతో ఆ గణేష్ నిమజ్జనాన్ని త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఖైరతాబాద్ గణేష్ ర్యాలీని గమనించేందుకు మొత్తం 60 సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేస్తున్నారు.

మొత్తం 2.50 లక్షల కెమెరాలు : విగ్రహాల ప్రధానర్యాలీలో ప్రతి అంశాన్ని స్పష్టంగా వీక్షించేందుకు మొత్తం 400 సీసీ కెమెరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అంతే కాకుండా నగరంలో ఇప్పటికే 2.50 లక్షల కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో వాటిని కూడా ప్రధాన కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేయడంతో ప్రతి దృశ్యాన్ని పోలీసు అధికారులు వీక్షిస్తారు. అదే విధంగా నిమజ్జన కార్యక్రమాన్నికి సంబంధించి ప్రతి మూలను కూడా స్పష్టంగా చూసేలా మరో 8 వేల కెమెరాలను అదనంగా ఏర్పాటు చేశారు. చార్మినార్,ట్యాంక్‌బండ్ వద్ద ప్రత్యేక కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

25 వేల మందితో బందోబస్తు : నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు 25 వేల మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరిస్తున్నారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు చెందిన అడిషనల్ కమిషనర్లు-4, జాయింట్ సీపీ-1, డీసీపీలు-9, అదనపు డీసీపీలు-20, ఏసీపీలు-64, ఇన్‌స్పెక్టర్లు-244, సబ్ ఇన్‌స్పెక్టర్లు-618, ఏఎస్‌ఐలు-636, హెడ్ కానిస్టేబుళ్లు-1700,కానిస్టేబుళ్లు-7198, ఎస్‌పీఓలు-680, హోంగార్డులు-6000 మంది ఉంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఎైక్సె జ్, ఫారెస్టు,ఆర్‌పీఎఫ్, ఆర్‌ఏఎఫ్, టీఎస్‌ఎస్‌పీ, ఆర్మ్డ్ రిజర్వు విభాగాలకు కలిపి మరో 9 వేల మంది బందోబస్తులో పాల్గొంటున్నారు. సిటీ సెక్యురిటీ వింగ్ సారధ్యంలో 16 బాంబు టీమ్స్, 22 పోలీసు జాగిలాలతో అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. డిఎఫ్‌ఎమ్‌డీ, హెఎఫ్‌ఎమ్‌డీలతో కూడా అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులను తనిఖీ చేయనున్నారు.

డ్రోన్ కెమెరాలు, డిజెలు నిషేధం : భద్రత కారణాల దృష్ట్యా నిమజ్జనం సందర్భంగా డ్రోన్ కెమెరాల వాడకాన్ని నిషేధించారు. ఆ రోజు డ్రోన్ కెమెరాలు వాడొద్దని సీపీ అంజనీకుమార్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు పోలీసు కమిషనర్లు షికా గోయెల్, శివప్రసాద్, తరుణ్‌జోషి, డీఎస్ చౌహాన్, మురళి కృష్ణ, అనిల్‌కుమార్‌లు పాల్గొన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...