రూ.30 పెట్రోల్ బైక్‌ను ఇప్పించింది...


Fri,September 21, 2018 12:42 AM

-దమ్మాయిగూడ డెకాయిటీ యత్నం కేసులో ట్విస్టు
-పోలీసుల దృష్టి మళ్లించిన దుండుగులు
-ముఠాలో ఇరానీ గ్యాంగ్ సభ్యుడి పాత్ర ?
సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ : 30 రూపాయల పెట్రోల్...దోపిడీ దొంగలు ఎత్తుకెళ్లిన బైక్ దొరికేలా చేసింది. ఈ ఆసక్తికరమైన ఘటన కుషాయిగూడ, దమ్మాయిగూడ ఆర్‌ఎస్ రాథోడ్ బంగారం దుకాణం దోపిడీ ఘటనలో చోటుచేసుకుంది. ఈనెల 18న పట్టపగలే గుర్తు తెలియని ఆరుగురు దుండగులు దమ్మాయిగూడలోని ఆర్‌ఎస్ జువెల్లరీ దుకాణంలోకి ప్రవేశించి తుపాకీ చూపించి దోపిడీకి యత్నించిన విషయం తెలిసిందే. ఈ దోపిడీ చోటుచేసుకున్న సమయంలో దుకాణ యజమాని రూప్‌సింగ్, పక్క దుకాణం యజమాని తులసిదేవీలు కేకలు పెట్టడంతో దుండగులు భయాందోళనకు గురై రెండు ద్విచక్రవాహనాల మీద పారిపోయారు. ఈ సమయంలో స్థానికులు రాళ్లతో దాడిచేయగా వాటి నుంచి తప్పించుకునే యత్నంలో రోడ్డు ప్రమాదానికి గురై కింద పడిపోయారు. దీంతో ముగ్గురు దొంగలు ఓ బైక్‌ను అక్కడే వదిలేసి పరారవుతూ ఎదురుగా వస్తున్న కేబుల్ ఆపరేటర్ శ్రీకాంత్‌ను చితకబాది అతడి పల్సర్‌బైక్‌ను ఎత్తుకెళ్లారు. గురువారం ఈ బైక్ దోపిడీ జరిగిన ఘటన స్థలం నుంచి రెండు కిలోమీటర్లు దాటిన తర్వాత బండ్లగూడ అహ్మద్‌గూడ ప్రాంతంలో వదిలేసి వెళ్ళారు. శ్రీకాంత్ బండి నెంబర్(AP 29AC 0116)ను పోలీసులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంతో గురువారం స్థానికులు అహ్మద్‌గూడలోని నిర్మానుష్య ప్రాంతంలో గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత పోలీసులు చేసిన దర్యాప్తులో రూ.30 పెట్రోల్ విషయం బయటపడింది. శ్రీకాంత్ మంగళవారం తన ద్విచక్ర వాహనంలో పెట్రోల్ అయిపోవడంతో అక్కడే ఉన్న బంక్‌లో రూ.30 పెట్రోల్‌ను పోయించుకొని వస్తుండగా దోపిడీ దొంగలు బండి ఎత్తుకెళ్లారు. పారిపోయే క్రమంలో దోపిడీ దొంగలు పోలీసు దృష్టి మళ్లించేందుకు దమ్మాయిగూడ నుంచి నాగారం వైపు పోయారు. ఆ తర్వాత తిరిగి నాగారం నుంచి కీసర వైపు పోయేందుకు బండ్లగూడ నుంచి ప్రయాణించారు. ఇంతలో పెట్రోల్ అయిపోవడంతో ద్విచక్ర వాహనాన్ని అహ్మద్‌గూడ నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసి వెళ్లారు. దొంగలు చోరీ చేసిన రెండు బైక్‌లు పోలీసులకు దొరికిపోయాయి.

ముఠాలో ఇరానీ సభ్యుడు?
ప్రాథమిక దర్యాప్తు చేసిన పోలీసులకు ముఠాలో ఓ ఇరానీ గ్యాంగ్‌కు సంబంధించిన యువకుడు ఉన్నట్లు ఆనవాళ్లు దొరికాయి. అతని శరీర ఆకృతి, వేషధారణ బట్టి పోలీసులు ఈ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పారిపోయే సమయంలో వారు వదిలిన షూస్ అడిడాస్ కంపెనీకి సంబంధించినవి ఉండడంతో పక్కాగా ఇరానీ గ్యాంగ్ సభ్యులు ఉంటారని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా కేబుల్ ఆపరేటర్ బైక్‌ను అహ్మద్‌గూడ వద్ద వదిలేసిన దుండగులు ఆ తర్వాత ఒక్కొక్కరిగా విడిపోయి ఆటోల్లో వెళ్లి ఉంటారని అనుమానిస్తూ పోలీసులు నాగారం టూ కీసర, కీసర టూ నాగారం రాకపోకలు సాగించే ఆటోవాలాల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న నిందితుడి ఫొటోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తించి డయల్ 100 లేదా వాట్సాప్ నెంబరు 9490617111కు సమాచారమిస్తే రూ.50 వేల రివార్డు ఇస్తామని ప్రకటించారు. దోపిడీ దొంగల కోసం మొత్తం 10 ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

130
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...