ఈవీఎంలపై అనుమానాలొద్దు


Thu,September 20, 2018 02:23 AM

-ట్యాంపరింగ్‌కు ఆస్కారమే లేదు
-చాలెంజింగ్ ఓటుకు అవకాశమిస్తాం
-మేడ్చల్ జిల్లా ఎన్నికల అధికారి ఎంవీ రెడ్డి
-రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో..ఓటింగ్ యంత్రాల ప్రాథమిక పరిశీలన
మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి :ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఓటమి పాలైన అభ్యర్థులకు ఈవీఎంల వినియోగంపై ఎన్నో అనుమానాలు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని, చిప్‌లు మార్చారని, ఎవ్వరికి ఓటేసినా ఒకే అభ్యర్థికి పోలయ్యాయని ఇలా అనేక ఆరోపణలు చేసేవారు. ఇక నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు కానీ, ప్రజలకు గాని ఎలాంటి అనుమానాలక్కర్లేదని జిల్లా ఎన్నికల అధికారి డా.ఎంవీ రెడ్డి, ఈవీఎంల ఫస్ట్ లెవల్ చెకింగ్ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి, బీఈఎల్ ఇంజినీర్ కార్తీక్ అంటున్నారు. ప్రజాస్వామ్యంపై ప్రజలకు విశ్వాసం కల్పించాలనే లక్ష్యంతోనే భారత ఎన్నికల కమిషన్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈవీఎంలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో ప్రప్రథమంగా వీవీ ప్యాట్‌లను వినియోగించడం జరుగుతుందని తెలిపారు. భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బెంగళూరు) ఆధ్వర్యంలో తయారు చేసి రాష్ట్రంలో త్వరలోనే జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించేందుకు జిల్లాకు తీసుకువచ్చిన ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లపై బుధవారం శామీర్‌పేట్‌లో ఈవీఎంలను భద్రపర్చిన గోదాంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఫస్ట్ లెవల్ చెకింగ్ నిర్వహించారు. సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి, సాంకేతిక నిపుణులు కార్తీక్ నమస్తే తెలంగాణతో పలు ఆసక్తికర అంశాలను సంయుక్తంగా వెల్లడించారు. అవి వారి మాటల్లోనే...

వందల అభ్యర్థులున్నా ఒకే ఈవీఎం
దేశంలో ఈసీఐఎల్, బీఈఎల్ సంస్థలను ఈవీఎంలను తయారు చేస్తున్నాయి. అయితే గతంలో వినియోగించి ఈవీఎంలతో పోల్చితే ప్రస్తుతం వినియోగించే ఈవీఎంలకు సాంకేతికంగా ఎంతో తేడా ఉంటుంది. గతంలో ఒక ఈవీఎంలో కేవలం 64మంది అభ్యర్థులకు మాత్రమే ఓటింగ్ చేసేలా ఉండేవి. కానీ ప్రస్తుత ఈవీఎంలలో ఒక్కో నియోజకవర్గంలో వందల మంది అభ్యర్థులు పోటీ చేసినా ఒకే ఈవీఎంపై ఓటు వేసే వెసులుబాటు ఉంది.

మూడు అంచెలుగా..
ప్రస్తుత ఈవీఎంలలో ముడు అంచెలున్నాయి. ఇందులో మొదటిది సీయూ (కంట్రోల్ యూనిట్), రెండవది బీయూ (బ్యాలెట్ యూనిట్), మూడవది వీవీ ప్యాట్ (ఓటర్ వెరిఫికేషన్ పేపర్ ఆడిట్ ట్రెయిల్) ఉంటాయి. ఈ మూడు అంచెలు ఒకదానికి ఒకటి సాంకేతికంగా లింక్ చేసి ఉంటాయి. ఉదాహరణకు ఇందులో కంట్రోల్ యూనిట్ కంప్యూటర్ సీపీయూగా పని చేస్తే వీవీ ప్యాట్‌లు మానిటర్, ప్రింటర్‌గా, బ్యాలెట్ యూనిట్ ఓటు వేసేందుకు ఉపయోగపడుతాయి.

ఎఫ్‌ఎల్‌సీ సమయంలోనే గ్రీన్, రెడ్ లేబుల్స్..
ఈవీఎంలు జిల్లాకు వచ్చిన వెంటనే వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తరువాత ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఫస్ట్ లెవల్ చెకింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా ఈవీఎం మిషన్ అన్ని విధాలుగా కరెక్టుగా ఉన్నప్పుడు దానిపై గ్రీన్ కలర్ లేబుల్‌ను అతికిస్తారు. అంటే గ్రీన్ లేబుల్ ఉన్న ఈవీఎంను నిరభ్యంతరంగా ఓటింగ్‌కు వినియోగించవచ్చును. ఏదేని ఫిజకల్ డ్యామేజీ గానీ, సాంకేతికపరమైన ఇబ్బందులున్న వాటిపై రెడ్ లేబుల్‌ను అతికిస్తారు. రెడ్ లేబుల్ ఉన్న ఈవీఎంలు పని చేయనట్లు. అంటే వీటిని ఎన్నికలలో వినయోగించకూడదు.

జంబ్లింగ్ పద్దతిలో ఈవీఎంల కేటాయింపు
ఈవీఎంలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే సమయంలో అన్ని ఈవీఎంలను ర్యాండమైజేషన్ చేస్తారు. అలాగే జిల్లా నుంచి రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లే సమయంలో మళ్లీ ర్యాండమైజేషన్ చేస్తారు. అలాగే రిటర్నింగ్ అధికారి నుంచి పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లే సమయంలో మళ్లీ ర్యాండమైజేషన్ చేస్తారు. అంటే సుమారు మూడు దఫాలుగా ర్యాండమైజేషన్ జరిగిన తరువాత వాటిని పోలింగ్ బూత్‌లకు తరలిస్తారు. అంటే ఏ నియోజకవర్గంకు ఏ ఈవీఎంలు వెళ్తున్నాయి, ఏ పోలింగ్ బూత్‌కు ఏ ఈవీఎంలు వెళ్తున్నాయి అనే విషయం జిల్లా ఎన్నికల అధికారికి కూడా తెలియదు. వీటిని పూర్తిగా జంబ్లింగ్ పద్దతిలో కేటాయిస్తారు.

చాలెంజింగ్‌కు ఓటుకు చాన్స్
ఓటు నమోదు కాలేదని ఓటర్ అభ్యంతరం వ్యక్తం చేస్తే ఎన్నికల ప్రోసీడింగ్ అధికారుల సమక్షంలో చాలెంజింగ్ ఓటు వేసేందుకు ఈ విధానంలో వెసులుబాటు ఉంటుంది. అయితే ఓటరు ఉద్దేశపూర్వకంగా చాలెంజింగ్ ఓటింగ్ డిమాండ్ చేసినట్లు ప్రొసీడింగ్ అధికారి పరిశీలనలో తేలినైట్లెతే అతనికి ఆరు నెలల జైలుశిక్ష పడుతుంది. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఒక వ్యక్తికి శిక్ష పడిందని, వీటిపై ఓటర్లకు, రాజకీయ పార్టీలకు అవగాహన కల్పించడంతో పాటు అనుమానాలను నివృత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి డా.ఎంవీ రెడ్డి తెలిపారు.

అభ్యర్థులు కోరితే వీవీ ప్యాట్ రశీదులను లెక్కిస్తాం
ఎన్నికలలో పోటీ అభ్యర్థులు ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యంతరాలను వ్యక్తం చేస్తే వీవీ ప్యాట్ ద్వారా వచ్చిన రశీదులను లెక్కిస్తాము. ఇందులో ఎవ్వరికి ఎన్ని అనుమానాలున్నా క్షణాల్లో నివృత్తి చేసేందుకు సిద్ధం. అభ్యర్థులు, ప్రజలు ఎలాంటి అపోహలకు తావివ్వకుండ ఓటు హక్కు ప్రతి ఒక్కరు ఓటు వేసి ప్రజా స్వామ్యపరిరక్షణకు పాటుపడాలి.

వీవీ ప్యాట్‌లు ఇలా పనిచేస్తాయి..
గతంలో ఎన్నడు లేని విధంగా దేశంలోనే ప్రప్రథమంగా ఈ దఫా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో ఈవీఎంలతో పాటు ఓటు వేసినట్లు రషీదు ఇచ్చే పరికరం వీవీ ప్యాట్ (ఓటర్ వెరిఫికేషన్ పేపర్ ఆడిట్ ట్రెయిల్)ను వినియోగిస్తున్నారు. అయితే ఇది ఎలా పని చేస్తుంది, దీని వలన కలిగే ప్రయోజనాలపై జిల్లా ఎన్నికల అధికారి డా.ఎంవీ రెడ్డి నమస్తే తెలంగాణకు వివరించారు.

వీవీ ప్యాట్‌లలో ఓటర్లకు సరిపడ ప్రింటింగ్ పేపర్ మాత్రమే ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఓటు వేయడానికి వెళ్లి ఈవీఎం మిషన్‌పై తరనకు నచ్చిన అభ్యర్థికి సంబంధించిన పార్టీ గుర్తుపై ప్రెస్ చేయగానే సదరు ఓటరు ఏ గుర్తు అభ్యర్థికి ఓటు వేశాడో వీవీ ప్యాట్ మిషన్‌లో ఏడు సెకన్లపాటు రశీదు కన్పిస్తుంది. తదనంతరం వీవీ ప్యాట్ మిషన్ కింద ఉన్న బాక్సులో ఆ రశీదు పడిపోతుంది. దీని వలన ఓటరు ఏ పార్టీ అభ్యర్థికి ఓటు వేశాడో ఖచ్చితమైన నిర్ధారణ చేసుకునే వీలుంటుంది.

రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలపై ప్రాథమిక పరిశీలన
రెండు రోజుల కిందట జిల్లాకు వచ్చిన ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల వినియోగంపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి జిల్లా పరిధిలోని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో బుధవారం శామీర్‌పేట్‌లోని ఈవీఎంలను భద్రపర్చిన గోదాంలో ప్రాథమిక పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శాసన సభ ఎన్నికలు నిర్వహించేందుకు జాతీయ కమీషన్ అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని, దీనిలో భాగంగానే ఈ నెల 15న జిల్లాకు 2630 కంట్రోల్ యూనిట్లు, 3338 బ్యాలెట్ యూనిట్లు, 2850 వీవీ ప్యాట్లు వచ్చాయని తెలిపారు. ఈ క్రమంలోనే ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల వినియోగంపై రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలపై ప్రాథమిక పరిశీలన నిర్వహిస్తున్నామన్నారు. ఈవీఎంలను భారీ పోలిసు బందోబస్తుతో పాటు సీసీ కెమరాల నిఘాలో నిత్యం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఈవీఎంల ప్రాథమిక స్థాయి పరిశీలనలో వివిద పార్టీల ప్రతినిధులతో పాటు జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీఆర్వో మధుకర్ రెడ్డి, డీఆర్‌డీఓ కౌటిల్య, ఆర్డీవోలు మధు సూదన్, లచ్చిరెడ్డి, కాప్రా ఎమ్మార్వో గౌతమ్‌కుమార్, శామీర్‌పేట్ ఎమ్మార్వో యుగెందర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాంపరింగ్‌కు నో చాన్స్..
గ్రీన్ లేబుల్ ఉన్న ఈవీఎంలను ఒపెన్ చేసేందుకు వీలు లేకుండా ఈవీఎం మిషన్ స్క్రూలపై ప్రత్యేకంగా రూపొందించిన స్టాంపులను అతికిస్తారు. ఒకవేల ఒపెన్ చేస్తే అది చినిగిపోతుంది. సో సాంకేతికంగా దానిని ఓపెన్ చేసే ఆస్కారముండదు. అలాగే ప్రస్తుతం రూపొందించిన ఈవీఎంలలో కేవలం ఓటింగ్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను మాత్రమే అప్‌లోడ్ చేయడం జరిగింది. ఇందులో మరో సాఫ్ట్‌వేర్‌ను అప్‌లోడ్ చేసేందుకు ప్రయత్నం చేసినా, రిమోట్‌తో ఆపరేటింగ్ చేసినా అది వెంటనే తిరస్కరిస్తుంది. సో అధునాత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ప్రస్తుత ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశమే లేదు.

115
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...