ప్రచారంలో దూసుకుపోతున్నారు


Mon,September 17, 2018 12:26 AM

సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: 2019 మహా సంగ్రామానికి రంగం సిద్ధమైంది. పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు స్కెచ్‌లు వేస్తున్నాయి. ఎట్లయినా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు తంటాలు పడుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో టీఆర్‌ఎస్ ముందు వరుసలో ఉన్నది. చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నది. అలాగే ఎన్నికల మ్యానిఫెస్టో రూపకల్పనకు కమిటీని కూడా వేసింది. ఒకటిరెండు రోజుల్లో ప్రక్రియను పూర్తి చేసే అవకాశమున్నది. అయితే మిగతా పార్టీలు పొత్తులపై చర్చలు, మహాకూటమికి శిఖరాగ్ర సమావేశాలతోనే కాలం వెళ్లదీస్తున్నాయి. ఎన్నికల మ్యానిఫెస్టోల రూపకల్పనలో తలమునకలయ్యాయి. ప్రాథమికంగా తాము చేసే అంశాలివేనంటూ కాంగ్రెస్ విడుదల చేసిన పత్రాన్ని జనం విశ్వసించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

అమలుకు ఆస్కారం లేని, సాధ్యం కాని హామీలున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీల సీనియర్లు, నిపుణులతో గంటల కొద్దీ సమీక్షలు నిర్వహిస్తూ మేధోమథనం చేస్తున్నారు. ఏ రంగాన్ని వదిలినా కష్టకాలమే, ఏ వర్గాన్ని మరిచినా ఓటమి ఖాయం. ప్రతి అంశమూ ప్రధానమే. అన్నింటికి మించి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ అభివృద్ధి నమూనాను నాలుగున్నరేండ్లు ప్రత్యక్ష్యంగా చూసిన ఓటర్లను ప్రతిపక్షాలు తమవైపు తిప్పుకోవడం అంత ఈజీ కాదు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐలు ఇప్పటికీ పొత్తుల చర్చల్లోనే నిమగ్నమయ్యారు. అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు రెండు జాతీయ పార్టీల నేతలు ఢిల్లీకి వెళ్తున్నారు. టికెట్ల కోసం అక్కడ లైన్లు కడుతున్నారు. కానీ టీఆర్‌ఎస్ మాత్రం తమ అధిష్టానం ప్రజలేనంటూ చేసిన పనులను చెప్పుకుంటూ సభలు, సమావేశాలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు.

బీజేపీకి నమో జపమే?
గ్రేటర్ హైదరాబాద్‌లోనే బీజేపీకి బలం. ఇక్కడ వారికి ప్రధాని నరేంద్రమోదీ, ఆయన సత్తా, సమర్థత తప్ప మరే ఇతర అంశాలు టీఆర్‌ఎస్‌కు జవాబిచ్చే స్థాయిలో లేవు. పైగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారం వారికే అంతు చిక్కదు. మిగతా అంబర్‌పేట, ముషీరాబాద్, ఖైరతాబాద్, ఉప్పల్ నియోజకవర్గాల్లో ఈ సారి అధికార పక్షం దీటైన జవాబిచ్చేందుకు సిద్ధమవుతోన్నట్లు ప్రచారం సాగుతోంది. అందుకే ఉప్పల్ మినహా మిగతా నియోజకవర్గాలపై టీఆర్‌ఎస్ కసరత్తు చేస్తుందని సమాచారం.
అభివృద్ధి, సంక్షేమానికి నీరాజనాలు
ఇన్నాళ్ల నగర పాలనలో టీఆర్‌ఎస్‌ది విలక్షణ శైలి. సమస్యల శాశ్వత పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నది. మిగతా పార్టీలేమో అధికార పక్షంపై దుమ్మెత్తి పోయడం తప్ప జనానికి దిశానిర్దేశం చేసే స్థాయికి సిద్ధం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా అభివృద్ధి, సంక్షేమంపైనే జనం ఆసక్తి చూపిస్తున్నారు.

టీఆర్‌ఎస్‌కు చేతి నిండా అస్ర్తాలు
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, మున్సిపాలిటీల్లో రూపాయికే నల్లా కనెక్షన్లు, రైతు బజార్లు, నకిలీ, కల్తీలకు పాల్పడే వారిపై పీడీ యాక్టు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీల ఏర్పాటు, గ్రీన్ హౌస్ వ్యవసాయం, మార్కెట్లల్లో హమాలీలకు కూలీ రేట్ల పెంపు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్పులు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రాయితీలు (టీఎస్ ప్రైడ్), గ్రామ పంచాయతీలుగా తండాలు, మైనార్టీల కోసం గురుకులాలు, మైనార్టీ విద్యార్థుల కోసం ఓవర్సీస్ స్కాలర్‌షిప్పులు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల కోసం తీర్మానం, ఓన్ యువర్ ఆటో,ఇమాం/మౌజ్‌లకు రూ.వెయ్యి భృతి, ఉర్దూ పరిరక్షణ, కల్లు దుకాణాల పునరుద్ధరణ, డబుల్ బెడ్ రూం ఇండ్లు, నగరం చుట్టూ అటవీ మండళ్ల అభివృద్ధి, మెరుగైన నీటి వ్యవస్థ ఏర్పాటు, హైదరాబాద్‌లో పేదల విద్యుత్ బకాయిల మాఫీ, రూ.5కే కడుపు నిండా భోజనం, డెవలప్‌మెంట్ ప్లానింగ్ అండ్ మేనేజెమెంట్

సిస్టం(డీపీఎంఎస్), మై జీహెచ్‌ఎంసీ యాప్, నగరంలో ఎల్‌ఈడీ వెలుగులు, మోడల్ మార్కెట్ల నిర్మాణాలు, మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణాలు, హైదరాబాద్‌లో డ్రైవర్లకు సొంత కార్లు, బల్దియాలో కార్మికుల వేతనాలు పెంపు, రిజర్వాయర్లు, స్మార్ట్ హైదరాబాద్ నగరానికి శ్రీకారం-సిస్కోతో ఒప్పందం, మిషన్ కాకతీయ, అర్బన్ మిషన్ భగీరథ, హైదరాబాద్ శివార్లల్లో రీజినల్ రింగ్ రోడ్డుకు శ్రీకారం, కేసీఆర్ కిట్లు, ప్రభుత్వ దవాఖాల్లో మెరుగైన వైద్యం, నగరంలో ట్రాఫిక్ రహిత రవాణా వ్యవస్థ కోసం రూ.3 వేల కోట్లతో ఎస్సాఆర్డీపీ ప్రాజెక్టు.. ఇలా వందలు, వేలల్లో సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులను ప్రజలకు వివరించేందుకు టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే కరపత్రాలు, బ్రోచర్ల ముద్రించి ప్రచారం చేస్తున్నారు. ఔటర్ లోపలి గ్రామాలు, శివారు మున్సిపాలిటీలకూ కృష్ణా జలాలను అందించేందుకు సుమారు రూ.2600 కోట్లతో ప్రాజెక్టులను అమలు చేస్తోంది. యుద్ధప్రాతిపదికన ఈ ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి.

ప్రాజెక్టులను అడ్డుకునే టీడీపీ
రాష్ట్రంలో రెండోసారి టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న ఎన్నికల్లో టీడీపీ జనం ముందుకు వెళ్లేందుకు అపసోపాలు పడాల్సిందే. తెలంగాణ ప్రాజెక్టులను జాతీయ స్థాయిలో అడ్డుకునే టీడీపీ ఇక్కడి ఓటర్లకు ఏం చెబుతుందన్నది ప్రశ్నార్థకమే! పైగా నగరంలోనూ ఐటీ రంగాన్ని బలోపేతం చేసింది తామేనంటూ ఊదరగొట్టే చంద్రబాబునాయుడి కంటే ఈ నాలుగేండ్లల్లో ఐటీ, ఐటీ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులు రెట్టింపయ్యాయి. దాంతో పాటే గూగుల్ వంటి అనేక కంపెనీలు ఇక్కడికి వచ్చాయి. సెటిలర్లంతా తమ వైపేనంటూ చెప్పుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే బల్దియా ఎన్నికల్లో ఫలితాలు నిరూపించాయి. దానికి తోడు ప్రభుత్వం కూడా భేదాభిప్రాయాలు లేకుండా అందరినీ ఆదరిస్తోంది.

కాంగ్రెస్‌కు రిక్తహస్తమే
గతంలో బల్దియాలో ఏకఛత్రాధిపత్యం వహించిన కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్‌లో సమస్యలు పరిష్కరించడంలో విఫలమైంది. అందుకే వారి కాలంలో వర్షమొచ్చిందంటే ఏ బస్తీ, ఏ కాలనీ ముంపునకు గురవుతోందనని భయాందోళనల్లో జనం కాలం వెళ్లదీసేవారు. మంచినీటి సరఫరాలోనూ ఖాళీ బిందెల ప్రదర్శనలు, ప్రజాప్రతినిధుల నిలదీతలే నిర్లక్ష్యానికి అద్దం పట్టాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో వారికి ఏ అంశాలతో ప్రజల ముందుకెళ్లాలో తెలియక చర్చల్లో గడిపేస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు సీఎం కేసీఆర్ చేస్తున్న చేసిన, చేస్తో న్న పనుల గురించి చెప్పుకునే వెసులుబాటు ఉన్నది.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...