నిమజ్జనానికి నిరంతర విద్యుత్


Thu,September 13, 2018 12:12 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గణేష్ ఉత్సవాలకు విద్యుత్‌శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శోభాయాత్ర సజావుగా జరిగేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అన్నీ చర్య లు తీసుకున్నట్లు సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి. రఘుమారెడ్డి బుధవారం తెలిపారు. గణేష్ పండగ సందర్భంగా సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో రఘుమారెడ్డి మాట్లాడారు. నిమజ్జన ప్రదేశాల్లో ముఖ్యమైన హుస్సేన్‌సాగర్ వద్ద మూడు ట్రాన్స్‌ఫార్మర్లకు అదనంగా 20నం. 500కేవీఏ పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు సీఎండీ చెప్పారు. ట్యాంకు బండ్ దిగువన, ఎన్టీఆర్ మార్గ్ వద్ద 315 కేవీఏ కెపాపిటీ గల మూడు పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లను అత్యవసర సమయాలలో ఉపయోగించేందుకు వీలుగా అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో రెండు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయడంతో పాటు అందులో అవసరమైన స్థాయిలో మొబైల్ ఫోన్‌లు, వైర్‌లెస్ సెట్లను అందుబాటులో ఉంచనున్నామని సీఎండీ తెలిపారు. సంస్థ డైరెక్టర్లు నిమజ్జనం కార్యక్రమం పూర్తయ్యే వరకు గ్రేటర్ నగరంలోని నిమజ్జన ప్రాంతాల్లోని విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షిస్తారని చెప్పారు. నిమజ్జన ప్రాంతాలైన మీర్ ఆలం ట్యాంక్, రాజన్న బౌలి, సరూర్‌నగర్ ట్యాంక్, హస్మత్‌పేట ట్యాంక్, అల్వాల్ ట్యాంక్, దుర్గం చెరువు, సఫిల్‌గూడ చెరువు, కాప్రా ట్యాంక్, కూకట్‌పల్లి ట్యాంక్, ఏదులాబాద్ ట్యాంక్, రాంపల్లి ట్యాంక్, చర్లపల్లి ట్యాంక్‌ల వద్ద తగు సిబ్బంది, పరికరాలతో క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

అధికారులకు కార్యాచరణ ప్రణాళిక ఇదే
- సూపరింటెండింగ్ ఇంజనీర్లు తమ తమ ప్రాంతాల్లోని గణేష్ మండపాలను, నిమజ్జన ప్రదేశాలను స్వయంగా పర్యటించాలి.
- శోభాయాత్ర నిర్వహించే ప్రాంతాలలో పర్యటిస్తూ లైన్లపై నున్న చెట్ల కొమ్మలు కొట్టటం, వదులుగానున్న తీగలు సరిచేయటం, బ్రేకర్స్, రోడ్‌క్రాసింగ్ పనులను తనిఖీ చేయాలి.
- అన్ని సబ్‌స్టేషన్లలో సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా తగు చర్యలు చేపట్టాలి.

-డివిజన్ స్థాయిలో ఉండే లైన్ సిబ్బంది, సెంట్రల్ బ్రేక్ డౌన్ సిబ్బంది, ఆపరేషన్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి. సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతాల్లోని మండప నిర్వహకులకు తమ ఫోన్‌నంబర్‌లను తెలియజేయాలి.
-పది అడుగులుకు పైన ఎత్తు ఉన్న విగ్రహాలు చిన్న చిన్న గల్లీల నుండి ప్రధాన రహదారి మీదకు వచ్చేంత వరకు సంస్థ సిబ్బంది కనీసం ఒక కార్మికుడైనా విగ్రహం వద్ద అందుబాటులో ఉండాలి.
మండప నిర్వాహకులకు సూచనలు
- గణేష్ మండప నిర్వాహకులు తప్పనిసరిగా మండపానికి అధికారికంగా విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలి.
-లైన్ కింద కండల ద్వారా విద్యుత్ సరఫరా పొందడం అపాయకరం. దీని వల్ల విద్యుత్ ప్రమాదాలు జరిగి ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది.
-విద్యుత్ ఘాతానికి గురైన వ్యక్తులకు వెంటనే వైద్య సహాయ అందించాలి.
- తెగిపడిన విద్యుత్ వైర్లను ముట్టరాదు. వెంటనే విద్యుత్ సిబ్బందికి 1912 ఫోన్ ద్వారా తెలియజేయాలి

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...