ప్రచార హోరు


Wed,September 12, 2018 12:58 AM

టీఆర్‌ఎస్ అభ్యర్థులు మంగళవారం జోరుగా ప్రచారం కొనసాగించారు. గ్రేటర్‌లోని పలు నియోజకవర్గాల అభ్యర్థులు.. కార్పొరేటర్లు, నాయకులతో కలిసి ఓట్లు అభ్యర్థించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను వివిధ సంఘాల నేతలు కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎంపీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఎల్‌బీనగర్ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్ల మంత్రి కేటీఆర్‌ను కలిసి తాము ఐక్యంగా పని చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపిస్తామన్నారు. మహేశ్వరం అభ్యర్థి తీగల కృష్ణారెడ్డికి మార్వాడీలు సంఘీభావం తెలిపారు.

కృష్ణారావుకు మద్దతుగా..
బేగంపేట: కూకట్‌పల్లి నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు మద్దతుగా బేగంపేట డివిజన్‌లో ఎన్నికల ప్రచారం మంగళవారం కొనసాగింది. కూకట్‌పల్లి నియోజకవర్గం బేగంపేట డివిజన్ అధ్యక్షుడు తాళ్ల రాజయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల ప్రచారంలో కార్పొటర్ ఉప్పల తరుణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాయకులు ఇంటింటికి వెళ్లి టీఆర్‌ఎస్‌కు వేటు వేయాలని కోరారు.

ఐక్యంగా పనిచేయాలి: మంత్రి కేటీఆర్
ఎల్బీనగర్, నమస్తే తెలంగాణః ఎల్బీనగర్ నియోజకవర్గంలో కార్పొరేటర్లు కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. నియోజకవర్గానికి చెందిన 11 మంది కార్పొరేటర్లకు ఎంపీ మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ సమక్షంలో మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ మేరకు కేసీఆర్ నివాసానికి కార్పొరేటర్లను పిలిపించి మాట్లాడారు. కార్పొరేటర్లు చెరుకు సంగీత ప్రశాంత్‌గౌడ్, కొప్పుల విఠల్‌రెడ్డి, సామ తిరుమల్‌రెడ్డి, ముద్దగౌని లక్ష్మీప్రసన్న, జిట్టా రాజశేఖర్‌రెడ్డి, రమావత్ పద్మానాయక్, సామ రమణారెడ్డి, ముద్రబోయిన శ్రీనివాస్‌రావు, జీవీ సాగర్‌రెడ్డి, జిన్నారం విఠల్‌రెడ్డి, భవాని ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.

పొత్తులతో కాంగ్రెస్ చిత్తు
ఎల్బీనగర్, నమస్తే తెలంగాణ: తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు వికటించి చిత్తుగా ఓడిపోతారని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం మన్సూరాబాద్‌లోని కేబీఆర్ గార్డెన్స్‌లో ఎంపీ మల్లారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి రామ్మోహన్‌గౌడ్, 11 మంది కార్పొరేటర్లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతూ ఐక్యంగా పనిచేసి టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు అవకాశ వాదం కోసం పొత్తు పెట్టుకుంటున్నాయని, చాలా చోట్ల కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా దక్కవని ఆరోపించారు. టీఆర్‌ఎస్ పార్టీ ఎలాంటి పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసి అందరిని చిత్తు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్‌ల ఆదేశాల మేరకు ఎంపీ మల్లారెడ్డి సమక్షంలో కార్పొరేటర్లతో కలిసి మాట్లాడిన తర్వాతే ప్రచారానికి శ్రీకారం చుడుతున్నామన్నారు.

టీఆర్‌ఎస్ అభ్యర్థికే ఓటేస్తాం..
బడంగ్‌పేట: నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం సమగ్రాభివృద్ధి చేసిందని మహేశ్వరం నియోజక వర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి అన్నారు. బాలాపూర్ మండల పరిధిలోని అల్మాస్‌గూడలో ఐ మాత జయంతి ఉత్సవాలను మార్వాడీలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హజరై ప్రత్యేక పూజలు చేశారు. మార్వాడీలు టీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేస్తామని ప్రకటించారు.

సంక్షేమ కార్యక్రమాలు భేష్
60 ఏండ్లుగా రాష్ర్టాన్ని పాలించిన పాలకులు తమ గురించి తప్ప ప్రజల గురించి ఆలోచించిన పాపాన పోలేదు. ప్రజల సమస్యలు పట్టించుకున్నవారే కరువవడంతో వారి ఆకాంక్షలు నెరవేరలేదు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారి పోయింది. తెలంగాణ ఏర్పాటుతో కష్టాలు తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండటంతో నాలుగున్నరేండ్లలో తెలంగాణ సంక్షేమ రంగంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. ఇదే ఒరవడి కొనసాగాలని వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడతాం.
- మంజుల, గృహిణి, బాగ్‌అంబర్‌పేట

ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయి
గత నాలుగేండ్లలో తెలంగాణ సర్కార్ ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయి. ఎన్నికల మేనిపెస్టోలో లేని అంశాలను కూడా ఎవరూ అడగకున్నా వాటి అవసరం తానే గ్రహించి అమలు చేసిన సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు.
-చంద్రకళ, బాగ్‌అంబర్‌పేట

నూతన ఒరవడి సృష్టించారు
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా నూతన ఒరవడిని సృష్టించాయి. ఒకానొక సమయంలో ప్రతిపక్షాలు సైతం భేష్ అనుకొనే విధంగా ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ తక్కువ సమయంలో ఎక్కువ చేయూతనందించారు. రైతన్నల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలతో పాటు 24 గంటల నిరంతర విద్యుత్, కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, కల్యాణ లక్ష్మి వంటి పథకాలు దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచాయి.
-డి.నాగరాజు, ప్రైవేటు ఉద్యోగి

120
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...