ఉద్యోగం కోసం వచ్చి...నాలాలో పడి యువకుడు మృతి


Mon,September 10, 2018 12:33 AM

ఎల్బీనగర్, నమస్తే తెలంగాణ : ఉద్యోగం కోసం నగరానికి వచ్చి ప్రమాదవశాత్తు నాలాలో పడి యువకుడు మరణించిన సంఘటన సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడురుకు చెందిన హరీశ్(24) ఉద్యోగవేటలో నగరానికి వచ్చాడు. అతడి స్నేహితుడు నవీన్ శారదానగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి సమయంలో నవీన్ గది వద్దకు చేరుకున్న హరీశ్‌కు నవీన్ గదిలో లేకపోవడం తాళం వేసి ఉండటంతో ఫోన్ చేసి తాను వచ్చిన విషయాన్ని తెలిపాడు. నవీన్ తాను వస్తున్నానంటూ చెప్పిన మీదట సరూర్‌నగర్ ఈద్గా సమీపంలోని నాలా వద్ద హరీశ్ మూత్ర విసర్జన చేసేందుకు వెళ్లాడు. అయితే హరీశ్‌కు ఫిట్స్ వ్యాధి ఉన్న నేపథ్యంలో ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయాడు. ఈ విషయాన్ని సమీపంలోని టీ స్టాల్ వారు గమనించి అరిచి అక్కడికి వచ్చేలోపలే అతడు నాలాలో కొట్టుకుని పోయాడు. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే సరూర్‌నగర్ సీఐ రంగస్వామితో పాటుగా సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

వివిధ శాఖల ఆధ్వర్యంలో శోధన ...
సరూర్‌నగర్ ఈద్గా వద్ద నాలాలో పడిపోయిన హరీశ్ ఆచూకీ కోసం పోలీసులతో పాటు జీహెచ్‌ఎంసీ అధికారులు, ఫైర్‌సర్వీస్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు శనివారం రాత్రి నుండి ముమ్మరంగా నాలాను పరిశీలించారు. సరూర్‌నగర్ ఈద్గా నుండి చైతన్యపురి బస్టాప్ వరకు వరదనీటి కాలువ నాలాను క్షుణ్ణంగా పరిశీలించారు. పలు ప్రాంతాల్లో మ్యాన్‌హోల్స్‌ను తెరిపించి పరీక్షించారు. రాత్రాంతా వెదికినా అతడి ఆచూకీ తెలియలేదు. సరూర్‌నగర్ పోలీసులు వరదనీటి నాలా సాగే చైతన్యపురి హనుమాన్‌నగర్, మున్సిపల్‌కాలనీ ప్రాంతాల్లో ముందస్తుగానే నాలాలో ఓ యువకుడు పడిపోయాడని, నాలాలో కొట్టుకుని వస్తే సమాచారం ఇవ్వాలంటూ సూచించారు. ఆదివారం మధ్యాహ్నం హనుమాన్‌నగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి శవం ఉందంటూ స్థానికులు ఇచ్చిన సమాచారంతో సరూర్‌నగర్ పోలీసులు వెళ్లి పరిశీలించారు. శవాన్ని ఒడ్డుకు చేర్చి స్నేహితుడు నవీన్‌ను పిలిపించగా హరీశ్ మృతదేహమని తేల్చారు. ఈ మేరకు ఉస్మానియా దవాఖానకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...