మెట్రో కోసం బహుళ అంతస్తుల పార్కింగ్


Sun,September 9, 2018 12:40 AM

-తొమ్మిది నెలల్లో పూర్తి చేసేందుకు నిర్ణయం
- 2 వేల చదరపు మీటర్లలో 15 అంతస్తుల భవనం
-జర్మన్ టెక్నాలజీతో నిర్మాణం
-పార్కింగ్ ఫీజు చౌకే
-శంకుస్థాపన చేసిన సీఎస్ ఎస్‌కే జోషి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: దేశంలో ఏ ఇతర నగరాల్లో లేనటువంటి ఆటోమేటెడ్ మల్టీలెవెల్ పార్కింగ్ టవర్‌ను హైదరాబాద్‌లోని పాతనగర ప్రాంతమైన నాంపల్లిలో నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులకు నాంపల్లి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎమ్మెల్సీ పి.సుధాకర్‌రెడ్డితో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్ మెట్రోరైలు చైర్మన్ ఎస్‌కే. జోషి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎస్‌కే జోషి మాట్లాడుతూ నాంపల్లి అంటే పాత నగరమని, ఓల్డ్‌సిటీ అభివృద్ధిలో భాగంగా దేశంలోనే మోడ్రన్ సిటీగా మారనుందని తెలిపారు. మల్టీ లెవెల్ కార్ పార్కింగ్(ఎంఎల్‌పీ) నిర్మాణం తొమ్మిది నెలల్లో పూర్తవుతుందన్నారు. ఈ నిర్మాణంతో నాంపల్లి ఏరియాకు నయా లుక్ వస్తుందని అభిప్రాయపడ్డారు. పూర్తయ్యాక మళ్లీ వస్తానన్నారు. హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ జర్మనీ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ భవనం 2 వేల చదరపు మీటర్ల(అర ఎకరం) భూమిలో 15 అంతస్తుల్లో భవనం నిర్మిస్తున్నారని చెప్పారు.10 అంతస్తుల్లో పార్కింగ్ ఉంటుందని, మిగతా అంతస్తుల్లో కమర్షియల్‌గా వాడుకోవడం జరుగుతుందని చెప్పారు.

ధనవంతులు ఉండే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలకు చెందిన మహిళలు పాతబస్తీలో మాత్రమే దొరికే వస్తువులను కొనుగోలు చేసేందుకు వచ్చేలా పార్కింగ్ స్థలాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. పీపీపీ పద్ధతిలో చేపట్టే ఈ నిర్మాణానికి రూ.55 నుంచి 60 కోట్లు ఖర్చవుతుందన్నారు. మల్టీలెవెల్ పార్కింగ్ నిర్మాణంలో 250 కార్లు,100కు మించి ద్విచక్ర వాహనాలు పార్క్ చేసుకునే వీలుంటుందన్నారు. ఏసీ విత్ గ్లాస్‌తో నిర్మాణం ఉంటుందని, కార్ వదిలివెళ్లిపోతే చాలు ఆటోమేటిక్‌గా పార్కింగ్ చేసుకుని, అవసరమైనప్పుడు వాహనాన్ని అందచేస్తుందన్నారు. దీనికోసం ఒక స్మార్టుకార్డును వినియోగించాల్సి వస్తుందని, కారు నంబరు ఆధారంగా స్మార్ట్‌కార్డు పనిచేస్తుందని చెప్పారు. కారు రివర్స్‌డ్రైవింగ్ అవసరం లేకుండానే ప్రయాణానికి వీలుగా వాహనం ఉండేట్లు పార్కింగ్ ఏర్పాట్లు ఉంటాయని చెప్పారు. పార్కింగ్ రుసుంలు కూడా భరించగలిగేస్థాయిలో ఉంటాయన్నారు.

పార్కింగ్ చేసిన వ్యక్తి సమీపంలోని మెట్రోస్టేషన్‌కు చేరుకోవడానికి స్కైవాక్‌లతో అనుసంధానం చేస్తున్నట్లు చెప్పారు. ఈ నిర్మాణాన్ని జర్మనీలోని ప్యాలిస్ పార్కింగ్ సిస్టం టెక్నాలజీలో భారీ ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్, ఆర్‌సీఎం ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ లిమిటెడ్ సంయుక్త భాగస్వామ్యంతో నోవమ్ పేరుతో నిర్మిస్తున్నామని చెప్పారు. 50 సంవత్సరాలపాటు సంబంధిత సంస్థలు నిర్వహిస్తాయన్నారు. నగరంలో 40 మెట్రో లెవెల్ పార్కింగ్స్ నిర్మిస్తున్నామని, ఇది మొదటిదని, మిగతా వాటికి స్థలాల సేకరణ జరుగుతున్నదన్నారు. మెట్రో, హెచ్‌ఎండీఏ, ఆర్టీసీ, తదితర ప్రభుత్వ స్థలాలను గుర్తిస్తామని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని ఆధునిక, ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని నగరానికి తేవాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, మంత్రి కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. పార్కింగ్ ఫీజును ఇంకా నిర్ణయించాల్సి ఉందని, ఇతర ప్రాంతాల్లో ఉన్న పార్కింగ్ ఫీజుతో పోలిస్తే పెద్దగా తేడా ఉండదని అన్నారు.

ఎమ్మెల్సీ పి. సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ గత పాలకులు పాతనగర అభివృద్ధిపై దృష్టిసారించలేదని, సీఎం చంద్రశేఖర్‌రావు ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారన్నారు. మెట్రోప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం జరుగుతున్నదన్న ప్రచారం నిజం కాదని, అత్యంత తక్కువ సమయంలో నిర్మించిన మెట్రోప్రాజెక్టు ఇది మాత్రమేనన్నారు. ఇది కేవలం మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వల్లనే సాధ్యమవుతుందని అన్నారు. కార్యక్రమంలో నిర్మాణ సంస్థ భారీ ఇన్‌ఫ్రా సీఈవో హరికిషన్‌రెడ్డి, డైరెక్టర్ భావనరెడ్డితోపాటు మెట్రోరైలు ఇంజినీర్లు సాయినాథ్, డీసీపీ బాలక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...