డబుల్‌ బెడ్‌రూం నిర్మాణాలను..వేగవంతం చేయాలి


Fri,December 13, 2019 11:22 PM

-నిర్ధిష్ట సమయంలోగా ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి
-రామాయిపల్లి, కోనాయిపల్లి పీటీ, మనోహరాబాద్‌, తూప్రాన్‌ పట్టణంతో పాటు చేగుంటలో పర్యటించిన కలెక్టర్‌
-అర్హులైన నిరుపేదలందరికీ డబుల్‌బెడ్రూం ఇండ్లు..
-సకల హంగులు, మౌలిక వసతులతో నిర్మించాలన్నదే ప్రభుత్వ ధ్యేయం: కలెక్టర్‌ ధర్మారెడ్డి

తూప్రాన్‌ రూరల్‌ :జిల్లాలో అర్హులైన నిరుపేదలందరికీ డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్‌ ధర్మారెడ్డి అన్నారు. డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలకు నిధుల కొరత లేదన్నారు. జిల్లాలో 3,177 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. తూప్రాన్‌ పట్టణంలో నిర్మాణం జరుగుతున్న 500 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం పనులు తూప్రాన్‌ ఆర్డీవో శ్యామ్‌ ప్రకాశ్‌, పంచాయతీరాజ్‌శాఖ ఎక్జిక్యూటీవ్‌ ఇంజినీర్‌ వెంకటేశ్వర్లు, డీఈ నర్సింహులుతో కలిసి శుక్రవారం నిర్మాణాలు పూర్తైన ఇండ్లలోకి వెళ్లి ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో 3,177 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణాల్లో 150 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, మరో 800 ఇండ్లు స్లాబ్‌లెవల్‌ స్థాయిలో ఉన్నాయన్నారు. అయితే డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణం పనుల్లో ఇసుక, నీటి కొరత ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అయితే ఇసుక కొరత ఉన్నందున రోబో సాండ్‌ వాడేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి ఉందన్నారు. మిషన్‌ భగీరథ పథకం ద్వారా తాగునీటి సరఫరా జరుగుతుందని, అయితే ప్రతి నల్లాకు ఫ్లోకంట్రోల్‌ వాల్వ్‌ సిస్టమ్‌ను అమర్చుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీదేవి, ఆర్‌ఐ సంతోష్‌ కుమార్‌, పీఆర్‌ ఏఈలు విజయ్‌ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

చేగుంటలో..
చేగుంట : ఫిబ్రవరి నెల చివరి వరకు చేగుంటలో నిర్మాణమవుతున్న డబుల్‌ బెడ్‌ రూం నిర్మాణాలు పూర్తవుతాయని కలెక్టర్‌ ధర్మారెడి ్డపేర్కొన్నారు. చేగుంటలో నిర్మాణమవుతున్న డబుల్‌ బెడ్‌ రూం నిర్మాణాలను శుక్రవారం కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్‌ బెడ్‌రూం నిర్మాణాల్లో జాప్యం జరుగకుండా సంబంధిత కంట్రాక్టర్ల కృషి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 150 ఇండ్లు పూర్తి అయినట్లు తెలిపారు. మిగితా 8వందల ఇండ్లు వివిధ కారణాలతో నిర్మాణాల్లో జాప్యం జరుగుతుందన్నారు. డబుల్‌ బెడ్‌ రూంలకు సంబంధించి విద్యుత్‌ లైన్లు, మిషన్‌భగీరథ ద్వారా తాగునీటి సౌకర్యం, రోడ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత ఏఈ, దుర్గాప్రసాద్‌, వెంకటేశ్‌లకు సూచించారు. కార్యక్రమంలో తూప్రాన్‌ ఆర్డీవో శ్యామ్‌ ప్రకాశ్‌, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్‌, స్థానిక ఎంపీటీసీ వెంకటలక్ష్మి, తహసీల్దార్‌ విజయలక్ష్మి, ఎంపీడీవో ఉమాదేవి, ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ నర్సింహులు, ఏఈ సుబ్బారావు, కాంట్రాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

మనోహరాబాద్‌లో..
మనోహరాబాద్‌ : డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ధర్మారెడ్డి అన్నారు. మనోహరాబాద్‌ మండలం రామాయిపల్లి, కోనాయిపల్లి పీటీ, మనోహరాబాద్‌ గ్రామాల్లో జరుగుతున్న డబుల్‌ బెడ్‌రూం నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఇండ్ల నిర్మాణాలకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. పనుల్లో ఎందుకు జాప్యం జరుగుతుందని కాంట్రాక్టర్లు, అధికారులను ప్రశ్నించారు. దీంతో ఇసుక వల్ల ఆలస్యం జరుగుతుందని తెలుపడంతో ఇసుక అందుబాటులోకి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తానన్నారు. జనవరి 30లోగా వినియోగంలోకి వచ్చేలా త్వరగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 5515 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరవ్వగా, 3115 ఇండ్లకు టెండర్ల ప్రక్రియ ద్వారా నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఇందులో 2వేల ఇండ్ల నిర్మాణాలు పూర్తి దశకు చేరుకున్నాయన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్యామ్‌ప్రకాశ్‌, తహసీల్దార్‌ నజీబ్‌ అహ్మద్‌, పీఆర్‌ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ నర్సింహులు, ఏఈ విజయప్రకాశ్‌, మిషన్‌భగీరథ ఈఈ కమలాకర్‌, ఆర్‌ఐ లక్ష్మణ్‌రావు, కాంట్రాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, నాయకులు చంద్రశేఖర్‌ ముదిరాజ్‌, దశరథ తదితరులు పాల్గొన్నారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...