దేశంలోనే ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు


Wed,December 11, 2019 04:28 AM

మెదక్, నమస్తే తెలంగాణ : దేశంలోనే ఎక్కడ లేని విధంగా పేద, మధ్య తరగతి కుటుంబాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, పేదింటి ఆడబిడ్డల పెండిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఎంతో భరోసానిస్తున్నాయని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మాయాగార్డెన్‌లో మెదక్, హవేళిఘనపూర్ మండలాలతో పాటు మెదక్ పట్టణానికి చెందిన 343 లబ్ధిదారులకు రూ. 3.43 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను కలెక్టర్ ధర్మారెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పథకం ప్రారంభంలో రూ.51 వేలు, అనంతరం రూ.75,116, ప్రస్తుతం రూ.1,00,116కు పెంచడంతో ఆడబిడ్డల తల్లిదండ్రులకు ఎంతో ఆసరా అవుతుందన్నారు. ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.

ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి
30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాలు ఎంతో పురోగతి చెందాయన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే అందరూ ఆరోగ్యవంతంగా ఉంటారన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే పల్లెలు అభివృద్ధి చెందుతాయన్నారు. పల్లె ప్రణాళికను నిరంతరం కొసాగించాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడవద్దని సూచించారు.
రాబోయే రోజుల్లో జిల్లాకు కాళేశ్వరం జలాలు
రాబోయే రోజుల్లో జిల్లాకు కాళేశ్వరం జలాలు వస్తాయని పద్మాదేవేందర్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణను సస్యశ్యామలం చేయడానికే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించడం జరిగిందన్నారు. కాళేశ్వరం జలాలతో సింగూరు ప్రాజెక్ట్ నింపుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కృషి చేస్తున్నదన్నారు.
బాల్య వివాహాలు చేయొద్దు..
-కలెక్టర్ ధర్మారెడ్డి
బాల్య వివాహాలు చేయొద్దని కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఆడబిడ్డకు 18 సంవత్సరాలు దాటిన తరువాతే పెండ్లి చేయాలన్నారు. ఈ రోజు ప్రతి వెయ్యి మందిలో 37 బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయన్నారు. బాల్య వివాహాలను ఆరికట్టడానికి సర్పంచులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్ లావణ్యరెడ్డి, మెదక్, హవేళిఘనపూర్ ఎంపీపీలు నారాయణరెడ్డి, యమున, ఆర్డీవో సాయిరాం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హవేళిఘనపూర్ జెడ్పీటీసీ సుజాత, ఎంపీటీసీలు, మెదక్, హవేళిఘనపూర్ తహసీల్దార్లు రవికుమార్, వెంకటేశం, ఆయా గ్రామాల సర్పంచులు రాజేందర్‌రెడ్డి, శ్రీహరి, ప్రభాకర్, మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ చల్ల నరేందర్, మాజీ వైస్ చైర్‌పర్సన్ రాగి అశోక్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు మల్లేశం, మున్నా, గౌష్‌ఖురేషి, చంద్రకళ, సులోచన, టీఆర్‌ఎస్ నాయకులు లింగారెడ్డి, ఉమర్, జయరాంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శివరామకృష్ణ, సాయిమోహన్, సాంబశివరావు, ఎలక్షన్‌రెడ్డి, గోవింద్, రాజు తదితరులు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...