డంపు యార్డు నిర్వహణ తీరు బాగాలేదని అధికారులపై కలెక్టర్ ఆగ్రహం


Wed,December 11, 2019 04:28 AM

-నిర్లక్ష్యం వహించే అధికారులకు చార్జి మెమో జారీ చేయాలని ఆదేశం
మెదక్ మున్సిపాలిటీ : ప్రజా ఆరోగ్యంపై మున్సిపల్ అధికారులకు పట్టింపు లేదని, అందుకే విధుల నిర్వహణలో అలసత్వం వహిస్తున్నారని కలెక్టర్ ధర్మారెడ్డి మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ డంప్‌యార్డును పరిశీలించారు. అక్కడ నిర్వహిస్తున్న తడి పొడి చెత్త నిర్వహణ, ప్లాస్టిక్ వ్యర్థాలను పరిశీలించారు. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను చూసి కమిషనర్, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలని, ఇండ్లు వ్యాపార సముదాయాల నుంచి సేకరించేటప్పుడు దానిని వేరు చేయాలని, లేకుంటే దానిని తిరిగి వేరు చేయాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయక పోవడంతోనే డంప్‌యార్డులో అన్ని రకాల వ్యర్థాలు గుట్టలు గుట్టలుగా పేరుకు పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 6 నెలలుగా ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేయాలని ఆదేశాలు ఇస్తున్నా ఎందుకు అమలు చేయడం లేదన్నారు. పారిశుద్ధ్య కార్మికులు చెత్తను వేరు చేయకుండా నేరుగా డంప్ యార్డుకు తీసుకురావడం జరుగుతుందని, అలాంటి వారిని గుర్తించి నోటీసులు జారీ చేయాలన్నారు. అలాగే వీధి వ్యాపారం, వర్తక సముదాయాలకు సంబంధించిన వ్యర్థాలు రోడ్డుపై వేసే వారికి జరిమానాలను విధించాలని ఆదేశించారు. హాస్టల్స్ ఇతర ఇండస్ట్రీస్‌కి నిరంతరం వెళ్లి సేకరించాలని సూచించారు. బద్దకాన్ని వీడి ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని, ఉద్యోగంలో ఉంటావా లేదో తెలుసుకోవాలని హెల్త్ ఇన్‌స్పెక్టర్‌ను కమిషనర్ హెచ్చరించారు. ప్రతిసారి ఆదేశాలను విస్మరించి నాకు నచ్చినట్లు వ్యవహరించడం నాకు అలవాటు అయిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి పర్యవేక్షణ లేకపోవడంతో డంప్‌యార్డు ఇలా తయారు అయిందన్నారు. తక్షణం చార్జి మెమో జారీ చేయాలని కమిషనర్ శ్రీహరిని ఆదేశించారు. అలాగే వర్మి కంపోస్టు చేసే తొట్టిల్లో నీటిని సరిగా పట్టడం లేదని, ఇలా అయితే వానపాములు ఎలా బతుకుతాయన్నారు. చేసే పని మీద శ్రద్ధ లేకపోతే ఎలా అని కంపోస్టు సెంటర్ ఇన్‌చార్జి శ్యామలను ప్రశ్నించారు. మనం చేసే పని ఫలితం కోసం చేయాలని ఉద్యోగం అంటే టైమ్ పాస్ చేసేది కాదన్నారు. వర్మి కంపోస్ట్ నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఆమెకు సైతం చార్జి మెమో జారీ చేయాలని ఆదేశించారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...