తూప్రాన్‌ రూపురేఖలు మారుస్తాం..


Sat,December 7, 2019 11:09 PM

-అభివృద్ధిలో గజ్వేల్‌ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా నిలుపుతాం...
-తూప్రాన్‌లో ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణం చేపడుతాం
-పట్టణంలోని అన్ని వీధుల్లో అండర్‌డ్రైనేజీలు నిర్మించాలి
-రూ.5కోట్ల 40లక్షల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు చేసిన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

తూప్రాన్‌ రూరల్‌ : రాష్ట్రంలోనే గజ్వేల్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవ చూపిస్తున్నారని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం తూప్రాన్‌ పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో రూ.5 కోట్ల 40 లక్షలతో పలు అభివృద్ధి పనులకు జెడ్పీ చైర్‌ పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌ భూపతిరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, మాజీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌లతో కలిసి ఎంపీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కొరత ఉండబోదన్నారు. తూప్రాన్‌, మనోహరాబాద్‌ మండలాల అభివృద్ధికి ప్రభుత్వ యంత్రాంగం నిర్విరామంగా కృషి చేస్తుందన్నారు. గత సమైక్య పాలకుల హయాంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కోట్లాది రూపాయలతో తూప్రాన్‌లో ఆధునిక సౌకర్యాలు, అన్ని హంగులతో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్‌, మహిళా భవనం, రిటైర్డ్‌ ఉద్యోగుల భవనాలు, గుండ్రెడ్డిపల్లిలో అదనపు పాఠశాల గదుల భవనాలకు ప్రారంభోత్సవాలు చేయడం జరిగిందన్నారు.

సమైక్య పాలకులు పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్‌ హయాంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి చూపిస్తున్నారన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, వితంతువులకు రెట్టింపు పింఛన్లను ఇస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతాంగానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. రైతుబంధు, రైతు బీమా పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, తూప్రాన్‌ ఆర్డీవో శ్యాంప్రకాశ్‌, పీఆర్‌ డీఈ నర్సింహులు, తహసీల్దార్‌ శ్రీదేవి, తూప్రాన్‌ మాజీ ఎంపీపీ గుమ్మడి శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌ కమ్మరి సత్యనారాయణ, మాజీ ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు రవీందర్‌గౌడ్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ శ్రీశైలంగౌడ్‌, జెడ్పీటీసీ రాణిసత్యనారాయణగౌడ్‌, వెంకటాయపల్లి సర్పంచ్‌ లంబవెంకటమ్మ, టీఆర్‌ఎస్‌ తూప్రాన్‌ మండల అధ్యక్షుడు బాబుల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు జయరాం, కనకయ్య, బురాన్‌, సత్తార్‌, ఉపేందర్‌, దీపక్‌రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

తూప్రాన్‌ మున్సిపాలిటీ అభివృద్ధి సాధించాలి
తూప్రాన్‌ పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందాలని ఎంపీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ శివారులో బాహ్య రహదారి అవసరముందని, సర్వే చేపట్టి మ్యాప్‌ను రూపొందించాలన్నారు. బాహ్య రహదారి నిర్మిస్తే జనాభా, వాహనాల రద్దీ తగ్గుతుందన్నారు. పట్టణంలోని పలు వీధుల్లో అండర్‌ డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఇప్పటికే కొన్ని వీధుల్లో అండర్‌డ్రైనేజీ నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. ప్రతి వీధిలో అండర్‌గ్రౌండ్‌ నిర్మాణాలు జరుగాలన్నారు. తూప్రాన్‌ పట్టణంలోని రోడ్లు ఇరుకుగా ఉన్నందున 15 నుంచి 20 ఫీట్ల మేరకు వెడల్పు చేయాలని సూచించారు. కాలనీల్లో 30 నుంచి 40 ఫీట్ల మేరకు రోడ్లు వెడల్పు ఉండేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించాలన్నారు.

అన్ని వర్గాలకు సముచిత స్థానం..
అన్ని వర్గాలకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యత కల్పిస్తుందని ఎంపీ అన్నారు. తూప్రాన్‌ మండలం వెంకటాయపల్లిలో రూ.10 లక్షలతో పంచాయతీ భవనం, రూ.5లక్షలతో యాదవ కమ్యూనిటీ భవన నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. యాదవులు ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే సీఎం కేసీఆర్‌ అభిమతమన్నారు.

విద్యార్థులకు స్వెట్టర్ల పంపిణీ..
చలి తీవ్రతను తట్టుకోవడం కోసంగానూ తూప్రాన్‌ మండలం వెంకటాయపల్లి విద్యార్థులకు స్వెటర్లను ఎంపీ పంపిణీ చేశారు. విద్యాకమిటీ చైర్మన్‌ కనకయ్య తన సొంత ఖర్చులతో కొనుగోలు చేసిన స్వెట్టర్లను 109 మంది విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌ పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌, కార్పొరేషన్‌ చైర్మన్‌లు భూపతిరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, సర్పంచ్‌ లంబ వెంకటమ్మ, ఉప సర్పంచ్‌ హరీశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు రమేశ్‌, ముత్యంరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...