సందడి షురూ


Thu,December 5, 2019 12:38 AM

-జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు
-75 వార్డులు, 150 పోలింగ్‌ కేంద్రాలు, 82,270 మంది ఓటర్లు
-త్వరలోనే మున్సిపల్‌ ఎన్నికలు
-ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు
-ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
-వార్డుల విభజన షెడ్యూల్‌తో మున్సిపాలిటీల్లో ఎన్నికల వేడి
-9వ తేదీ వరకు అభిప్రాయాల సేకరణ
-17వ తేదీ పునర్విభజనతుది జాబితా విడుదల
-వెనువెంటనే వార్డులరిజర్వేషన్ల ఖరారు
-మున్సిపల్‌ ఎన్నికలకులైన్‌ క్లియర్‌
-మోగనున్న ఎన్నికల నగారా..

మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికలకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. వార్డుల పునర్విభజనకు షెడ్యూల్‌ వెలువడటంతో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి నెలకొన్నది. మెదక్‌, నర్సాపూర్‌, తూప్రాన్‌, రామాయంపేట మున్సిపాలిటీల్లో వార్డుల విభజన తదితర సమస్యలపై ఫిర్యాదులు తీసుకుంటున్నారు. మున్సిపాలిటీల్లోని వార్డుల పునర్విభజన ముసాయిదాపై ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5గంటల వరకు అభిప్రాయాలు, సూచనలు స్వీకరించనున్నారు. 17వ తేదీన ఆయా మున్సిపాలిటీలకు సంబంధించి వార్డుల పునర్విభజనపై తుది నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఈ మేరకు కలెక్టర్‌ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఓటరు నమోదు, వార్డుల విభజన, కుల గణన, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు అభ్యంతరాల స్వీకరణతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు పూర్తయ్యాయి. పోలింగ్‌ అధికారులకు తొలి విడుత శిక్షణ కూడా ఇచ్చారు. త్వరలోనే నోటిఫికేషన్‌ వచ్చే అవకాశాలు ఉండటంతో ఆశావహులు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు.


కొనసాగనున్న గులాబీ హవా..
జిల్లాలోని గతంలో పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్‌ వరకు జిల్లాలో గులాబీ పార్టీ హవా కొనసాగింది. 20 మండలాలకు 18 మండలాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులు జెడ్పీటీసీలుగా గెలుపొంది జిల్లా పరిషత్‌ పీఠాన్ని దక్కించుకోవడంతో జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా రెపరెపలాడింది. మున్సిపల్‌ ఎన్నికల్లో సైతం గులాబీ పార్టీదే హవా కొనసాగనున్నదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మెదక్‌, రామాయంపేట రెండు మున్సిపాలిటీల పరిధిలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా, నర్సాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలో తూప్రాన్‌ మున్సిపాలిటీ ఉంది. దీంతో అభ్యర్థుల ఎంపికలు మొదలుకొని గెలిపించే వరకు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఇతర రాష్ట్రస్థాయి నాయకులకు బాధ్యతలు అప్పజెప్పేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తున్నది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో దిశానిర్ధేశం చేసేందుకు త్వరలోనే పార్టీ నాయకులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు హాజరుకానున్నట్లు సమాచారం. ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్‌, బీజీపీలు ఎన్నికల్లో పోటీ చేయడానికి సమాయాత్తమవుతున్నాయి.

కొత్తగా మున్సిపాలిటీలు..
జిల్లాలో గతంలో ఒకటే మున్సిపాలిటీ ఉండగా కొత్తగా మూడు మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పడిన నర్సాపూర్‌, తూప్రాన్‌ రెవెన్యూ డివిజన్‌ కేంద్రాలు మున్సిపాలిటీలుగా ఏర్పడ్డాయి. అలాగే రామాయంపేటను సైతం మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. 2019 జూలై 2న మెదక్‌ మున్సిపాలిటీ పాలక వర్గం గడువు ముగిసింది. అదే రోజు నుంచి ప్రత్యేకాధికారి పాలన ప్రారంభమైంది.

75 వార్డులు,
82,270 మంది ఓటర్లు..
మున్సిపాలిటీల వారీగా ఇప్పటికే వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తైంది. వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గణన కూడా పూర్తి చేశారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 75 వార్డులు ఉండగా, 82,270 మంది ఓటర్లు ఉన్నారు. మెదక్‌ మున్సిపాలిటీలో గతంలో 27 వార్డులు ఉండగా, అవుసులపల్లి, ఔరంగాబాద్‌, పిల్లికొట్యాల్‌లను విలీనం చేసి 32 వార్డులను చేశారు. ఇందులో 33,465 మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగా ఏర్పడిన తూప్రాన్‌లో 16 వార్డులకు 17,173 మంది ఓటర్లు ఉన్నారు. నర్సాపూర్‌ మున్సిపాలిటీలో 15 వార్డులకు 13,772 మంది ఓటర్లు, రామాయంపేట మున్సిపాలిటీలో 12 వార్డులకు 17,860 మంది ఓటర్లు ఉన్నారు. ఆయా మున్సిపాలిటీల్లోని ఒక్కో వార్డుకు రెండు చొప్పున పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఆశావహుల ప్రయత్నాలు...
మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొన్నది. తాజా మాజీ కౌన్సిలర్లతోపాటు గత ఎన్నికల్లో ఓడిపోయిన వారు, కొత్తగా టికెట్లు ఆశిస్తున్నవారు ఎమ్మెల్యే చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అలాగే కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో పట్టుకోసం ఆశావహులు, గతంలో సర్పంచులు, ఎంపీటీసీలుగా చేసిన వారు మున్సిపల్‌ ఎన్నికల్లో టికెట్ల కోసం ఇప్పటి నుంచే ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఓటర్లనూ మచ్చికచేసుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...