సీఎం కేసీఆర్ కల కోమటి చెరువు అభివృద్ధి


Mon,December 2, 2019 12:30 AM

-సంక్షేమం, అభివృద్ధి రెండు కండ్లుగా ముందుకు..
-అన్నార్థుల ఆకలి తీర్చేందుకు ‘ఫీడ్ ద నీడ్’ కేంద్రాలు
-లక్నవరం తరహాలో చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జి
-చెరువులను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే
-ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
-చరిత్ర సృష్టించిన గడ్డ.. సిద్దిపేట
-ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : కోమటి చెరువు దినదినాభివృద్ధి చెంది నేడు పట్టణంలో పర్యాటక స్థలంగా విరాజిల్లుతుంది. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రారంభించిన ప్రయత్నం నేడు సఫలమవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం.. సీఎంగా కేసీఆర్ ఉండడంతో కోమటి చెరువు అభివృద్ధి సాధ్యమైంది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు తెలంగాణ చెరువులు, సంస్కృతి, సాంప్రదాయాలను పట్టించుకోలేదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

ఆదివారం సిద్దిపేట కోమటి చెరువు వద్ద సుమారు రూ.6 కోట్లతో నిర్మించిన సస్పెన్షన్ బ్రిడ్జి, అడ్వంచర్ పార్కులోని పార్కింగ్, ఫ్లాపీ బ్యారియర్, పాత బస్టాండ్, ప్రభుత్వ మెడికల్ కళాశాల బోధన దవా ఖాన వద్ద ఆపిల్ హోం ఆధ్వర్యంలో ఫీడ్ ద నీడ్ కేంద్రాలను ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు ఫారూఖ్‌హుస్సేన్, రఘోత్తండ్డి, కార్పొరేషన్ చైర్మన్లు భూపతిడ్డి, రాజేశంగౌడ్, జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజాశర్మ, టూరిజం ఎండీ మనోహర్, జేసీ పద్మాకర్‌తో కలిసి ప్రారంభించారు.


ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కోమటి చెరువు అభివృద్ధి అనేది సీఎం కేసీఆర్ కల.. లక్నవరం తరువాత సిద్దిపేటలోనే సస్పెన్షన్ బ్రిడ్జిని ఏర్పాటు చేసుకున్నామన్నారు. కోమటి చెరువుపై నిత్యం వందలాది మంది వాకర్లు వాకింగ్ చేస్తున్నారని, సెలవు రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారని తెలిపారు. ఆహ్లాదకరమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి, ప్రకృతిలో ఎక్కువసేపు ఉంటే పిల్లలతోపాటు ప్రతి ఒక్కరికీ మంచి ఆరోగ్యం లభిస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన చెరువులను బాగు చేసేందుకు మిషన్ కాకతీయ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గ కేంద్రంలోని చెరువును మినీ ట్యాంకుబండ్‌లుగా అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. తెలంగాణలో బతుకమ్మ గొప్ప పండుగ అని, పుష్పాలను పూజించే పండుగకు ఆడబిడ్డలు చెరువుల వద్దకు వస్తారని, అందుకే చెరువులను అభివృద్ధి చేశామన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే చెరువులకు పూర్వవైభవం వచ్చిందన్నారు.
అభివృద్ధి, సంక్షేమమే రెండు కళ్లుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆకు పచ్చ, ఆరోగ్య, పరిశుభ్ర సిద్దిపేట నిర్మాణంలో ముందుకు రావాలని కోరారు.

* అన్నార్థుల ఆకలి తీర్చడానికి..
ఆకలితో ఉన్న వారికి అన్నం పెడితే వచ్చే పుణ్యం.. ఏం చేసినా రాదు. అన్నదానం మించిన దానం లేదు. మన జీవితం పదిమందికి ఉపయోగపడే విధంగా ఉండాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. సిద్దిపేట పాత బస్టాండ్, గవర్నమెంట్ దవా ఖాన వద్ద ఆపిల్ హోమ్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫీడ్ ద నీడ్ కేంద్రాలను ప్రారంభించారు. ఆకలితో ఉన్న వారి ఆకలి తీర్చేందుకే కేంద్రాలను ఏర్పాటు చేశామనితెలిపారు.

ఫీడ్ ద నీడ్ కేంద్రాల్లో ఇండ్లలో మిగిలిన అన్నం, పండ్లు, బ్రెడ్లు, రొట్టెలు తదితర వాటిని హోంలోని ఫ్రిజ్‌లో పెడితే ఆకలితో ఉన్నవారికి ఉపయోగపడుతాయన్నారు. తినగా మిగిలిన మంచి ఆహారం మాత్రమే ఫీడ్ ద నీడ్ కేంద్రాల్లో పెట్టాలని ప్రజలకు సూచించారు. ఫీడ్ ద నీడ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన డా.నీలిమ, లయన్స్‌క్లబ్ ప్రతినిధి శ్రీనివాస్‌డ్డిను మంత్రి అభినందించారు. అనంతరం ఆహార పదార్థాలను అందజేశారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...