ప్రజారవాణా.. యథాతథం


Sat,November 16, 2019 11:53 PM

-జిల్లాలో యథావిధిగా తిరిగిన 81 బస్సులు
-బస్సు డిపో వద్ద పోలీసుల బందోబస్తు
-కనిపించని ఆర్టీసీ సమ్మె ప్రభావం
-బస్సు డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల బైఠాయింపు...
- అదుపులోకి తీసుకున్న పోలీసులు
-మెదక్ డిపోకు శుక్రవారం వచ్చిన ఆదాయం రూ.7,73,000లు
మెదక్ అర్బన్: ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నప్పటికీ మెదక్ డిపో బస్సులు మాత్రం వివిధ రూట్లలో నిర్వీరామంగా తిరుగుతున్నాయి. ఆర్టీసీ అధికారులు మెదక్ బస్టాండ్‌లో ప్రయాణికులకు ఇబ్బందులేకుండా వివిధ రూట్లలో బస్సులను సమయానుకూలంగా అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో పాటు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలకు ప్రత్యేకంగా బస్సులను నడిపించి ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ అధికారులు, డీటీవో, పోలీసులు సమన్వయంతో జిల్లాలో బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. శుక్రవారం వివిధ రూట్లలో తిరిగిన బస్సుల ద్వారా మెదక్ డిపోకు రూ. 7,73,000 ఆదాయం వచ్చినట్టు మెదక్ డిపో డీఎం జాకీర్‌హుస్సేన్ తెలిపారు. సమ్మె కంటే ముందుగా ఏవిధంగా అయితే ఆదాయం వచ్చేదో అదే విధంగా ప్రస్తుతం కూడా వస్తుందని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. మెదక్ బస్ డిపో వద్ద పట్టణ సీఐ వెంకటేశం, రూరల్ సీఐ రాజశేఖర్‌లు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు.

అన్ని రూట్లలో బస్సు సర్వీసులు
జిల్లాలోని అన్ని రూట్లలో బస్సు సర్వీసులను ప్రయాణికుల రద్దీకనుగుణంగా అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. శనివారం మెదక్ డిపో నుంచి వివిధ రూట్లలో 81 బస్సులు యథావిధిగా తిరిగాయి. ఇందులో మెదక్ డిపోలోని 47 బస్సులు, అద్దెబస్సులు 34 బస్సులు ఉదయం నుంచే వివిధ రూట్లలోని 4000 మంది ప్రయాణికులకు సేవలను అందించాయి. మెదక్ డిపో నుంచి చేగుంట మీదుగా తూప్రాన్, సికింద్రాబాద్ వరకు, రామాయంపేట మీదుగా దుబ్బాక, సిద్దిపేట వరకు, కొల్చారం మీదుగా బాలనగర్, ఎంజీబీఎస్ వరకు, రంగంపేట మీదుగా సంగారెడ్డి, పటాన్ చెరువు వరకు, గోపాల్‌పేట, ఎల్లారెడ్డి, బాన్స్‌వాడ, బోధన్ రూట్లలో బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. దీంతో పాటు దూర ప్రాంతాలకు సంబంధించిన అమలాపురం, కాకినాడ, తిరుపతి బస్సులను సైతం మెదక్ డిపో నుంచి నడిపిస్తున్నారు.
జిల్లాలో కన్పించని ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం
గత 43 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్న జిల్లాలో బస్సులు మాత్రం వివిధ రూట్లలో కొనసాగుతుండటంతో జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం పెద్దగా కన్పించడంలేదు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించి వివిధ రూట్లలో బస్సులను ప్రజలకు అందుబాటులు ఉంచుతున్నారు.
బస్సు డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల నిరసన
మెదక్ బస్సు డిపో వద్ద ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో డిపో వద్ద బస్సులను బయటకు రాకుండా అడ్డుకుంటుండటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో వివిధ రూట్లలో వెళ్లే బస్సులు యథావిధిగా కొనసాగాయి. ఆర్టీసీ కార్మికులు బస్సు డిపో వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుపకుండా పోలీసులు బస్ డిపో వద్ద గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles