డిసెంబర్ కల్లా గోదావరి జలాలు


Fri,November 15, 2019 12:00 AM

-ఆలోపు ప్రాజెక్టుల పనులన్నీ పూర్తికావాలి
-రైతులకు సాగు నీరందించడమే సీఎం కేసీఆర్ సంకల్పం
-సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్
-మల్లన్న, రంగనాయకసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల సందర్శన
-ఎలక్ట్రికల్ పనులు, పంప్‌హౌస్, సర్జిపూల్, బండ్, టన్నెల్ పరిశీలన
-10,11 ప్యాకేజీ పనులపై సంతృప్తి

తొగుట/చిన్నకోడూరు/మర్కూక్ : డిసెంబర్ 15 కల్లా మల్లన్నసాగర్‌లో గోదావరి నీళ్లు ఉరుకలు వేయాలని సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గురువారం మల్లన్న సాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులను ఆమె సందర్శించారు. ప్రాజెక్టుల సందర్శనకు వచ్చిన ఆమెకు కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, ఇరిగేషన్ అధికారులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. మల్లన్న సాగర్ పంప్‌హౌస్‌ను పరిశీలించిన ఆమె, విద్యుత్ కనెక్షన్ పనుల గురించి సీమన్స్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. పంపులకు విద్యుత్ కనెక్షన్ పనులు వేగవంతం చేయాలని ఆమె ఆదేశించారు. 10,11వ ప్యాకేజీ పనులు పూర్తికావస్తున్నాయని ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు డిసెంబర్ 1 వరకల్లా రంగనాయక సాగర్‌కు నీళ్లు వస్తాయని, డిసెంబర్ 15 వరకల్లా మల్లన్నసాగర్‌లోకి నీళ్లు వస్తాయన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి కాకపోవడంతో ఇప్పటికే నిర్మించిన కాలువ ద్వారా కొండ పోచమ్మ ప్రాజెక్టుకు నీళ్లను తరలిస్తున్నారన్నారు.

కాలువ పనులు అక్కడక్కడ పెండింగ్‌లో ఉన్నాయని, డిసెంబర్ 1వరకల్లా పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. ఈసందర్భంగా పంప్‌హౌజ్ పనులను పరిశీలించారు. 8 పంపులు రెడీగా ఉన్నాయని అధికారులు ఆమెకు వివరించారు. పనుల పురోగతిపై అధికారులతో కొద్ది సేపు సమీక్షా సమావేశం నిర్వహించారు. స్మితా సబర్వాల్ వెంట నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ సీ మురళీధర్, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీ బీ హరిరామ్, ఎస్‌ఈ కేఎన్ ఆనంద్, ఈఈ రవీందర్‌రెడ్డి, నీటిపారుదల శాఖ లిఫ్ట్ ఇరిగేషన్ అడ్వైజర్ పెంటారెడ్డి, ట్రాన్స్‌కో లిఫ్ట్ ఇరిగేషన్ డైరెక్టర్ సూర్యప్రకాశ్, మెగా ప్రెసిడెంట్ గోవర్ధన్‌రెడ్డి, మెగా డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డీఈ శ్రీనివాస్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

రంగనాయకసాగర్‌లో..
చిన్నకోడూరు మండలం చంద్లాపూర్-పెద్దకోడూరు శివారులో నిర్మిస్తున్న రంగనాయకసాగర్ కట్ట, ఇంటెక్‌వెల్, పంపుహౌస్, బండ్, టన్నెల్‌తో పాటు పల్లగుట్ట పై నిర్మిస్తున్న ఫోర్‌సూట్ గెస్ట్ హౌస్ పనులను స్మితాసబర్వాల్ సందర్శించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధిని కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రంగనాయకపురం టన్నెల్ పనులు పరిశీలించుకుంటూ సర్జిపుల్ పంపుహౌస్ వద్దకు చేరుకున్నారు. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో ప్రాజెక్టు పురోగతిపై చర్చించారు.

మిడ్‌మానేరుకు కాళేశ్వరం జలాలు వస్తున్నాయని, అక్కడి నుంచి నేరుగా అనంతగిరి రిజర్వాయర్‌ను నింపుకొని, రంగనాయకపురం నీళ్లు వస్తాయని పనులు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. డిసెంబర్ 15 నాటికి కాళేశ్వరం నీళ్లు రంగనాయకపురంలో పడేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని అధికారులకు వివరించారు. ఏజెన్సీ ప్రతినిధులు మాట్లాడుతూ 3 మోటార్లు డ్రైరన్‌కు సిద్ధంగా ఉన్నాయని, మరో మోటారు 15 రోజుల్లో సిద్ధం చేస్తామని, సబ్‌స్టేషన్ సైతం రీచార్జి చేసి సిద్ధం చేశామని వివరించారు. అనంతరం అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. స్మితా సబర్వాల్ ప్రాజెక్టుల పర్యటన సందర్భంగా సీపీ జోయల్ డెవిస్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

కొండపోచమ్మ ప్రాజెక్టు వద్ద..
మర్కూక్ మండల కేంద్రంలోని కొండపోచమ్మ జలాశయ నిర్మాణ సంప్ హౌస్ పనులను స్వితా సబర్వాల్ పరిశీలించారు. 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న జలాశయ పనులను అధికారులతో ఆమె స్వయంగా ప్రాజెక్టు పైకి వెళ్లి పనులను పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్, అధికారులతో మాట్లాడారు. ప్రాజెక్టుపనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. కొత్త సంవత్సరానికి కొండపోచమ్మ ప్రాజెక్టులోకి నీరువచ్చే అవకాశం ఉందని, పనుల్లో అలసత్వం వహించొద్దని అధికారులకు తెలిపారు.

124
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...