ప్రయాణం..సురక్షితం


Wed,November 13, 2019 01:53 AM

మెదక్‌ అర్బన్‌ : జిల్లాలో ఆర్టీసీ బస్సులు సాఫీగా సాగాయి. ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరవేశాయి. పట్టణాలకు సూపర్‌ లగ్జరీ, పల్లెలకు పల్లెవెలుగు బస్సులు నడవడంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులు యథావిదిగా నడిచాయి. మంగళవారం కార్తిక పౌర్ణమి సందర్భంగా ప్రయాణికుల రద్దీ కనిపించింది. ఏడుపాయలకు వచ్చే భక్తుల కోసం మెదక్‌ డిపో అధికారులు, పోలీసులు, డీటీవోలు సమన్వయంతో ప్రత్యేక బస్సులతో సేవలను అందించారు. 39 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ ఆర్టీసీ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. దీంతో జిల్లాలో ఎక్కడా సమ్మె ప్రభావం కనిపించలేదు. మెదక్‌ బస్‌ డిపో వద్ద పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.

సేవలందించిన 76 ఆర్టీసీ బస్సులు
ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా మంగళవారం జిల్లాలో 76 బస్సులు సేవలను అందించాయి. మెదక్‌ బస్సు డిపోకు చెందిన బస్సులు 62 ఉండగా 40 బస్సులు, అద్దెబస్సులు 36 ఉండగా 36 బస్సులు ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేశాయి.

ప్రయాణికులతో కిటకిటలాడిన మెదక్‌ బస్టాండ్‌..
మంగళవారం కార్తిక పౌర్ణమి కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు వెళ్లే ప్రయాణికులతో మెదక్‌ బస్టాండ్‌ కిటకిటలాడింది. దీంతో ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల రద్దీకనుగుణంగా బస్సు సర్వీసులను పెంచారు. మెదక్‌ డిపో నుంచి ఏడుపాయలకు ప్రతి గంటకు ఒక బస్సు వెళ్లింది.

ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మె
జిల్లాలో ఆర్టీసీ కార్మికులు మంగళవారం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో బస్టాండ్‌ వద్ద రోడ్డుపై నిరవధిక సమ్మెను ప్రారంభించారు. ఈ సమ్మెకు పలు రాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఇదిలావుండగా ఆర్టీసీ కార్మికులకు టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కాముని రమేశ్‌ ఆధ్వర్యంలో 150 మంది ఆర్టీసీ కార్మికులకు 10 కేజీల చొప్పున బియ్యాన్ని అందజేశారు. సిటిజన్‌ ఫోరం జిల్లా అధ్యక్షుడు కొండల్‌రెడ్డి ఆధ్వర్యంలో 150 మంది ఆర్టీసీ కార్మికులకు ఒక కేజీ చొప్పున కంది పప్పును కార్మికులకు అందజేశారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...