ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా


Fri,November 8, 2019 12:25 AM

-రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
వెల్దుర్తి : మండలంలోని మాసాయిపేటలో జాతీయ రహదారి పక్కన ఉన్న సాయిబాబా దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర దేవాదాయ, అటవీ-పర్యావరణ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆలయ నాలుగో వార్షికోత్సవం గురువారం ప్రారంభం కాగా మంత్రి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వెనుకభాగంలో ఉన్న అన్నదాన కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 44వ నంబర్ జాతీయ రహదారి పక్కన సువిశాలమైన స్థలంలో అద్భుతంగా సాయిబాబా మందిరాన్ని నిర్మించారన్నారు. నిత్యం వేద మంత్రోచ్ఛరణల మధ్య దేవుడికి పూజలు నిర్వహించడంతోపాటు సాయినాథుడికి ఇష్టమైన గురువారం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

దేవుడి సేవ ఎంతో గొప్పదని, సేవలో ఉన్న వారందరిని అభినందించారు. ఆలయ నిర్మాణాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి మంత్రి హరీశ్‌రావు సహకారంతో ప్రభుత్వం నుంచి నిధుల మంజూరు కోసం కృషి చేస్తానన్నారు. గ్రామస్తులు కలిసికట్టుగా ఆలయ నిర్మాణంతో పాటు అభివృద్ధికి కృషి చేయడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా గ్రామసర్పంచ్, ఆలయ కమిటీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి మంత్రిని పూలమాల, శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న మంత్రిని వేద పండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. మంత్రి వెంట ఉప సర్పంచ్ నాగరాజు, నాయకులు కైలాస్‌శ్రీను, నారాయణచారి, సంతోష్, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.

ఘనంగా వార్షికోత్సవాలు..
సాయిబాబా ఆలయ నాలుగో వార్షికోత్సవాల్లో భాగంగా మొదటిరోజు గురువారం ప్రత్యేక పూజలు చేశారు. అంతేకాకుండా స్వామివారి కీర్తనలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. నేడు జరిగే ఉత్సవాలకు మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డిలు రానున్నట్లు సర్పంచ్ మధుసూదన్‌రెడ్డి తెలిపారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...