సాఫీగా ప్రయాణం..


Wed,November 6, 2019 01:28 AM

సంగారెడ్డి టౌన్‌ : సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ పరిరక్షణ కోసం కార్మికులందరూ మంగళవారం అర్ధరాత్రి వరకు విధుల్లో చేరాలని గడువు విధించిన విషయం తెలిసిందే. మంగళవారంతో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన గడువు ముగిసింది. చివరి రోజు ఐదుగురు ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరారు. ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత ఉమ్మడి జిల్లాలో 3వ తేదీన ఒకరు, 4వ తేదీన 6 మంది, 5వ తేదీన 6 మంది విధుల్లో చేరుతున్నట్లు అంగీకార పత్రాలను అందజేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 13 మంది గడువు ముగిసిన నాటికి విధుల్లో చేరారు. సిద్దిపేట డిపోలో 7గురు, మెదక్‌ డిపోలో ముగ్గురు, నారాయణఖేడ్‌ డిపోలో ఇద్దరు, జహీరాబాద్‌ డిపోలో ఒకరు విధుల్లో చేరుతున్నట్లు అంగీకార పత్రాలను ఆయా డిపోల మేనేజర్లకు అందజేశారు. మంగళవారం నాటికి ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసింది. అర్ధరాత్రి 12 గంటల వరకు విధుల్లో చేరని వారిని ఎట్టి పరిస్థితుల్లో విధుల్లోకి తీసుకోబోమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో గడువు ముగియడంతో ఆర్టీసీ కార్మికుల్లో ఆందోళన నెలకొన్నది. బుధవారం ఆర్టీసీ అధికారులు, సర్కారు ప్రకటనకై కార్మికులు ఎదురు చూస్తున్నారు.

కాగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మంగళవారం వరకు 13 మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం రాత్రి 12గంటల వరకు గడువు విధించడంతో ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు 13 మంది కార్మికులు విధుల్లో చేరుతున్నట్లు ఆయా డిపోల మేనేజర్లకు అంగీకార పత్రాలను అందజేశారు. సిద్దిపేట డిపోలో ఒక డ్రైవర్‌, కండక్టర్‌ అంగీకారపత్రాన్ని అందజేశారు. ఈ నెల 3వ తేదీన సిద్దిపేట డిపోలో కండక్టర్‌ పి.బాలవిశ్వేశ్వర్‌రావు విధుల్లో చేరగా 4వ తేదీన సిద్దిపేట డిపోలో కండక్టర్లు కె. నర్సింలు, సంతోష్‌గౌడ్‌, డ్రైవర్‌ పి.మల్లేశం, మెదక్‌ డిపోలో కండక్టర్‌ కృష్ణమూర్తి, నారాయణఖేడ్‌ డిపోలో డ్రైవర్‌ రమేశ్‌, జహీరాబాద్‌ డిపోలో సురేందర్‌లు చేరిన విషయం విధితమే. కాగా 5వ తేదీ మంగళవారం రోజు మెదక్‌ డిపోలో ఎండీ చాంద్‌మియా, సిద్దిపేట డిపోలో సీహెచ్‌ ఆర్‌బీ రెడ్డి, డ్రైవర్‌ వి.బాల్‌రెడ్డి, కండక్టర్‌ కేఎస్‌ రెడ్డి, మెదక్‌ డిపోలో కండక్టర్‌ బి.ప్రభాకర్‌, నారాయణఖేడ్‌ డిపోలో డ్రైవర్‌ ఖలీమ్‌బేగ్‌లు విధుల్లో చేరుతామని అంగీకారపత్రాలు అందజేశారు.

ఉమ్మడి జిల్లాలో తిరిగిన 550 బస్సులు..
మెదక్‌ రీజియన్‌ పరిధిలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లోని 8 డిపోల పరిధిలో మంగళవారం 550 బస్సులు ప్రయాణికులకు సేవలందించాయి. ఉమ్మడి జిల్లాలో 638 బస్సులు ఉండగా 386 ఆర్టీసీ, 164 ప్రైవేటు బస్సులు ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చాయి. మెదక్‌ డిపోలో మొత్తం 98 బస్సులు ఉండగా అందులో 52 ఆర్టీసీ, 36 ప్రైవేటు బస్సులు వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేశాయి. నారాయణఖేడ్‌ డిపో పరిధిలో 57 బస్సులు ఉండగా 43 ఆర్టీసీ, 8 ప్రైవేటు బస్సులు ప్రజలను వారి గమ్యస్థానాలకు చేర్చాయి. సంగారెడ్డి డిపో పరిధిలో 108 బస్సులు ఉండగా అందులో 73 ఆర్టీసీ, 24 ప్రైవేటు బస్సులు ప్రయాణికులను సురక్షితంగా చేరవేశాయి. జహీరాబాద్‌ డిపో పరిధిలో 93 బస్సులు ఉండగా 50 ఆర్టీసీ, 22 ప్రైవేటు, సిద్దిపేట డిపో పరిధిలో 118 బస్సులు ఉండగా అందులో 63 ఆర్టీసీ, 38 ప్రైవేటు, గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ డిపో పరిధిలో 69 బస్సులు ఉండగా 43 ఆర్టీసీ, 20 ప్రైవేటు బస్సులు ప్రజలకు సేవలందించాయి. దుబ్బాక డిపో పరిధిలో 40 బస్సులు ఉండగా 22 ఆర్టీసీ, 4 ప్రైవేటు బస్సుల ద్వారా ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు తరలించారు. హుస్నాబాద్‌ డిపోలో 55 బస్సులు ఉండగా 40 ఆర్టీసీ, 12 ప్రైవేటు బస్సులు ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు తరలించాయి.

కొనసాగుతున్న ఆందోళనలు..
ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మెలో భాగంగా మంగళవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా డిపోల పరిధిలో ధర్నా నిర్వహించి వంటావార్పు కార్యక్రమాలు చేశారు. సంగారెడ్డి డిపోకు చెందిన కండక్టర్‌ సాయిబాబా శాంతియుతంగా సమ్మె చేస్తున్న మమ్మల్ని ప్రభుత్వం సమస్యలను పరిష్కరించేందుకు ఆహ్వానించాలని కోరుతూ గాంధీ వేషధారణలో నిరసన తెలిపారు. కార్మికులు నిర్వహిస్తున్న ధర్నాకు మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌ ధర్నా వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...