పల్లెల్లో ఆర్టీసీ సేవలు


Sun,November 3, 2019 11:35 PM

-జిల్లాలో తిరిగిన 80 శాతం బస్సులు
-పల్లెపల్లెకు వెళ్తున్న మెదక్ డిపో బస్సులు
-జిల్లాలో కనిపించని ఆర్టీసీ కార్మికుల సమ్మె
-అన్ని రూట్లలో నడిచిన బస్సులు

సంగారెడ్డి టౌన్ : ఆర్టీసీ బస్సులు పల్లెలకు సేవలందిస్తున్నాయి. మెదక్ రీజియన్‌లోని 8 డిపోల పరిధిలో 524 బస్సులు ఆదివారం ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేశాయి. ఆర్టీసీ 361, ప్రైవేట్ 163 బస్సులు ఉమ్మడి జిల్లాలో తిరిగాయి. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, జహీరాబాద్, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, నారాయణఖేడ్ డిపోల పరిధిలో గ్రామాల్లోకి యథేచ్ఛగా బస్సులు తిరిగాయి. తాత్కాలిక సిబ్బంది మూడు జిల్లాల పరిధిలో బస్సులు నడిపారు.

కార్మికులకు మరో అవకాశం..
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం కార్మికులకు మరో అవకాశం కల్పించింది. ఆర్టీసీ కార్మికులకు ఎలాంటి నష్టం లేకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ మరో అవకాశం కల్పించారు. మంగళవారం అర్ధరాత్రి లోపు విధుల్లో చేరాలని సూచించారు. సీఎం పిలుపుతో ఉమ్మడి జిల్లా లో సమ్మె చేస్తున్న కార్మికుల్లో ఆలోచలనలు ప్రారంభమయ్యాయి. విధుల్లో చేరేందుకు ఆర్టీసీ అధికారులతో చర్చలు జరిపినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ అవకాశం కల్పించడంతో విధుల్లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని అధికారులు తెలిపారు. సిద్దిపేట డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న బాల విశ్వేశ్వర్‌రావు ఆదివారం డీఎంకు తాను విధుల్లో చేరుతానని అంగీకార పత్రాన్ని అందజేశారు. మరింత మంది విధులకు హాజరయ్యేందుకు సిద్ధ్దంగా ఉన్నారని, నేడో, రేపో కొందరు విధులకు చేరుతారని అధికారులు పేర్కొన్నారు. కొందరు ఉద్యోగులు విధులకు హాజరవుతామని సంప్రదింపులు జరుపుతున్నారన్నారు.

యథేచ్ఛగా తిరిగిన బస్సులు..
ఆర్టీసీ బస్సులు మెదక్ రీజియన్ పరిధిలోని మూడు జిల్లాల్లో యథేచ్ఛగా తిరిగాయి. మూడు జిల్లాల పరిధిలో 638 ఆర్టీసీ బస్సులు ఉండగా ఆదివారం 524 బస్సులు తిరిగాయి. 361 ఆర్టీసీ, 163 ప్రైవేట్ బస్సులు ప్రయాణికులకు సేవలందించాయి. నారాయణఖేడ్ డిపోలో 57 బస్సులు ఉండగా 37 ఆర్టీసీ, 8 ప్రైవేట్, సంగారెడ్డి డిపోలో 108 బస్సులు ఉండగా 67 ఆర్టీసీ, 26 ప్రైవేట్, జహీరాబాద్ డిపోలో 93 బస్సులు ఉండగా 52 ఆర్టీసీ, 23 ప్రైవేట్ బస్సులు తిరిగాయి. సిద్దిపేట డిపోలో 118 బస్సులు ఉండగా 65 ఆర్టీసీ, 34 ప్రైవేట్, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపోలో 69 బస్సులు ఉండగా 43 ఆర్టీసీ, 20 ప్రైవేట్ బస్సులు తిరిగాయి. దుబ్బాక డిపోలో 40 బస్సులు ఉండగా 16 ఆర్టీసీ, 4 ప్రైవేట్, హుస్నాబాద్ డిపోలో 55 బస్సులు ఉండగా 37 ఆర్టీసీ, 12 ప్రైవేట్ బస్సులు ప్రయాణికులకు సేవలందించాయి.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...