మద్దతు ధరతో రైతుల ఆర్థికాభ్యున్నతి


Sat,November 2, 2019 12:17 AM

- గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
వెల్దుర్తి: ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల ద్వారా అందుతున్న మద్దతు ధరతో రైతులు ఆర్థికాభ్యున్నతి చెందుతారని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని చర్లపల్లి, దామరంచ గ్రామాల్లో ప్రాథమిక సహకార సంఘం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను దోచుకునేవారన్నారు.

రైతు సంక్షేమ ప్రభుత్వమైన టీఆర్‌ఎస్ సర్కార్ రైతుల కష్టాలను గుర్తించి పెద్ద సంఖ్యలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరను అందించి, దళారుల బారినుంచి రైతులను ఆదుకుంటుందన్నారు. రైతులు ధాన్యం విక్రయించిన 72 గంటలలోపు వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వ్యవసాయాధారిత మండలమైన వెల్దుర్తి మండలంలో ఉన్న హల్దీవాగులో త్వరలోనే కాళేశ్వరం నీళ్లు ప్రవహిస్తున్నాయని, దీంతో మండలం సస్యశ్యామలం అవుతుందన్నారు. సాగునీటితో పాటు తాగునీటికి శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. నాణ్యమైన ధాన్యానికి రూ. 1835 ధర ప్రభుత్వం అందిస్తుందని, కావున రైతులు ఎండబెట్టిన, నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలని ఆయన రైతులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు అశోక్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్ మండల కోఆర్డినేటర్ వేణుగోపాల్‌రెడ్డి, నాయకులు నరేందర్‌రెడ్డి, అశోక్‌గౌడ్, కృష్ణాగౌడ్, నర్సింహారెడ్డి, గోపాల్‌రెడ్డి, అనంతరెడ్డి, మహిపాల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, శివ్వంపేట ఎంపీపీ హరికృష్ణ, రైతులు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...