అమరుల త్యాగాలు మరువలేనివి


Tue,October 22, 2019 02:05 AM

-అమర వీరుల స్తూపానికి నివాళులర్పించిన కలెక్టర్, ఎస్పీ
-పోలీసు అమరుల త్యాగాలు చిరస్మరణీయం... : ఎస్పీ చందనదీప్తి
-వ్యాసరచన పోటీలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు

మెదక్ మున్సిపాలిటీ :శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు రక్షణ కల్పించేందుకు 24 గంటలు పోలీసులు సేవలను అందిస్తారని కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. సోమవారం పోలీసు అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా జిల్లా పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమర వీరుల స్తూపానికి కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందనదీప్తిలు నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ సమాజ రక్షణ నిమిత్తం విధులు నిర్వర్తించే పోలీసులకు ప్రతి ఒక్కరూ తమ సహకారాన్ని అందించాల్సిన అవసరం ఉందన్నారు. అమరుల త్యాగాల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రజల సేవ కోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీసులు మహానుభావులని, పోలీసు అమరవీరులు చూపిన మార్గదర్శకాన్ని అనుసరిస్తూ ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడాలని పేర్కొన్నారు. అనంతరం ఎస్పీ చందనదీప్తి మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజల్లో మంచి పేరు రావాలంటే చిత్తశుద్ధి, నీతి, నిజాయితీతో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు.

దేశ వ్యాప్తంగా సంఘ విద్రోహ శక్తుల ఆగడాలపై నిరంతరం అలుపెరుగని పోరాటం చేస్తూ శాంతి భద్రతలను కాపాడుతూ సమాజ శ్రేయస్సు కోసం పరితపించే వారే పోలీసులని అన్నారు. ప్రజలతో స్నేహ పూర్వకంగా మెలుగుతూ వారి సమస్యల పరిష్కారానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారన్నారు. పోలీసులు చేస్తున్న సేవలను, త్యాగాలను ప్రజలు గుర్తు పెట్టుకోవాలన్నారు. ఎంతో మంది పోలీసు అధికారుల ప్రాణ త్యాగాల వల్ల మనం ఇప్పుడు ప్రశాంత వాతావరణంలో జీవించగలుగుతున్నామని, వారి ఆశయాలు, ఆదర్శాలను కొనసాగిస్తామన్నారు. పోలీసు అమరుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. పోలీసు అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారు మన మధ్య లేకున్నా మనం వారిని స్మరిస్తూనే ఉంటామని, అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వారికి ఎలాంటి సమస్య ఉన్న పోలీసు విభాగం తరఫున పూర్తి సహకారం అందజేయడం జరుగుతుందన్నారు.

అమరవీరుల కుటుంబాలను..పరామర్శించిన కలెక్టర్, ఎస్పీ
జిల్లాలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 14 మంది అమరవీరుల కుటుంబాలను కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందనదీప్తిలు పరామర్శించారు. అమరవీరుల కుటుంబాలకు పోలీసు వ్యవస్థ తరఫున పూర్తి సహకా రం అందిస్తామన్నారు. అమరుల కుటుంబాలను ఘ నంగా సన్మానించారు. అనంతరం వారికి కానుకలను అందజేశారు. ఇన్‌హోం కార్యక్రమంలో భాగంగా పోలీ సు అమరవీరుల కుటుంబాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో అమరవీరుల కుటుంబ సభ్యుల సమస్యలను ఎస్పీ చందనదీప్తి అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం సంబంధిత పోలీసు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.

పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు..బహుమతుల ప్రదానం
అమరవీరుల సంస్మరణ రోజును పురస్కరించుకుని ఈ నెల 17న జిల్లా పరిధిలో ఆన్‌లైన్‌లో (నేను పోలీసును అయితే) వ్యాసరచన పోటీల్లో జిల్లా వ్యాప్తంగా మంచి స్పందన లభించిందన్నారు. వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందనదీప్తి చేతుల మీదుగా జ్ఞాపికలతో పాటు సర్టిఫికేట్లను అందజేశారు. అమరవీరుల సంస్మరణ రోజు సందర్భంగా రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి, తూప్రాన్ డీఎస్పీ కిరణ్‌కుమార్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, జిల్లాలోని సీఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఐ, ఆర్‌ఎస్‌ఐ, పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు, ఇతర పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...