గ్రామాలకు మహర్దశ


Sun,October 20, 2019 03:14 AM

-జనాభా ప్రాతిపదికన నిధులు
-జిల్లాకు రూ.11 కోట్లు విడుదల
-హర్షం వ్యక్తం చేస్తున్న సర్పంచులు
-గ్రామాల జనాభాను బట్టి నిధుల కేటాయింపు
-నేరుగా గ్రామపంచాయతీ ఖాతాల్లో జమ
-ప్రభుత్వ మార్గ దర్శకాలకు అనుగుణంగా నిధులిస్తామన్న అధికారులు
-మారనున్న గ్రామాల రూపురేఖలు
మెదక్ మున్సిపాలిటీ : రాష్ర్టంలోని గ్రామపంచాయతీలకు ఇక పండుగే... ప్రతి సంవత్సరం 500ల జనాభా కలిగిన పంచాయతీకి రూ.8లక్షల అభివృద్ధి నిధులను అందజేస్తామని సీఎం ప్రకటించారు. ఇప్పటికే గ్రామాలాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పిన సీఎం కేసీఆర్ ఆ దిశగా పంచాయతీలకు నిధుల కేటాయించారు. స్థానిక సంస్థల పనితీరును పునర్విభజిస్తూ నూతన పంచాయతీ రాజ్ చట్టానికి రూపకల్పన చేశామన్నారు. ఈ చట్టం వెలుగులో పంచాయతీ రాజ్ సంస్థలకు నిర్ధిష్టమైన విధులను, బాధ్యతలను నిర్ధేశిస్తూ కావాల్సిన నిధులను క్రమం తప్పకుండా ప్రభుత్వం సమకూరుస్తుందని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక సంఘం తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.1229 కోట్లను కేటాయించింది. కేంద్రం నిధులతో సరిసమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరో రూ.1229 కోట్లను కేటాయిస్తుంది. అంటే గ్రామీణ స్థానిక పరిపాలన సంస్థకు ఏటా మొత్తం రూ.2458 కోట్ల చొప్పున నిధులు అందనున్నాయి. 500 జనాభా కలిగిన చిన్న గ్రామపంచాయతీకి కూడా ఏడాదికి రూ.8 లక్షల అభివృద్ధి నిధులు అందనున్నాయి. వీటికి తోడుగా గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు కూడా స్థానిక సంస్థలకు అందుబాటులో ఉండనున్నాయి. భవిష్యత్‌లో గ్రామపంచాయతీలకు నిధుల కొరత ఉండకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన నిధుల కేటాయిస్తున్నది. గ్రామ పరిపాలనలో అవినీతికి ఆస్కారం ఉండకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు తమ విధి నిర్వహణలో విఫలమైతే వారిని పదవి నుంచి తొలగించేందుకు కూడా వెనకాడబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి నెలా పంచాయతీలకు రూ.339 కోట్లను విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో జిల్లాకు రూ.11 కోట్లను విడుదల చేసి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లా పంచాయతీ అధికారులు వచ్చిన నిధులను ఆయా గ్రామపంచాయతీలకు కేటాయిస్తున్నారు. పంచాయతీలో నివసిస్తున్న జనాభాకు అనుగుణంగా లెక్కలు వేసి వాటికి నిధులను మంజూరు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో డీపీవోలతో పాటు డీఎల్‌పీవోలు, కార్యాలయ సిబ్బంది వచ్చిన నిధులపై కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో ఉన్న అన్ని సబ్ ట్రెజరరీ కార్యాలయాలకు నివేదికలను సమర్పిస్తున్నారు. అనంతరం నేరుగా ఆయా గ్రామపంచాయతీల ఖాతాల్లో ప్రభుత్వ సొమ్ము జమ కానున్నది. జమ అయిన డబ్బును పంచాయతీ సర్పంచ్, పాలకమండలి సభ్యులు, కార్యదర్శులు ఖర్చు చేయనున్నారు.

జిల్లావ్యాప్తంగా 20 మండలాల పరిధిలో 469 గ్రామపంచాయతీల్లో 7 లక్షలకు పై చిలుకు మంది జనాభా ఉన్నారు. వారిలో ప్రతి వ్యక్తికి రూ.165.69 చొప్పున డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో 14వ ఆర్థిక సంఘం నిధులే ఎక్కువ. ఈ నిధులతో పంచాయతీల దశ మారనున్నదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 30 రోజుల ప్రణాళికతో సమగ్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండటంతో గ్రామాల రూపురేఖలు మారనున్నాయి.

మెరుగుపడనున్న మౌలిక వసతులు...
గ్రామపంచాయతీలకు ప్రతి నెలా రూ.339 కోట్లను ప్రభుత్వం కేటాయిస్తుండటంతో ఇక పల్లెల్లో మౌలిక వసతులు మారనున్నాయి. అంతేకాకుండా ఏడాదిన్నర నుంచి పంచాయతీల డబ్బుపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ఖాతాల్లోనే నిధులు ఉండిపోయాయి. ఇప్పుడు సర్పంచ్, ఉప సర్పంచులకు చెక్ పవర్ ఇవ్వడంతో పంచాయతీల్లో పాలకవర్గం సభ్యులు పలు రకాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. వాటికి తోడు ప్రత్యేక ప్రణాళిక పేరుతో ప్రతినెలా నిధులు రానుండటంతో పనులను కొనసాగించనున్నారు. ప్రధానంగా గ్రామ పంచాయతీల్లో పరిశుభ్రత, తాగునీరు, వీధి దీపాలు, మురుగు కాలువలు, రహదారులు, సిబ్బంది వేతనాలు, విద్యుత్, మొక్కల పెంపకం, డంపింగ్‌యార్డు నిర్వహణ తదితర వాటిపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.

102
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...