ఉమ్మడి జిల్లాలో 87శాతం బస్సులు


Thu,October 17, 2019 11:36 PM

సంగారెడ్డి టౌన్ : మెదక్ రీజియన్ పరిధిలో ఆర్టీసీ అధికారులు 87శాతం బస్సులను నడిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 617 ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు ఉండగా అందులో 542 బస్సులు ప్రజలకు సేవలందించాయి. 371 ఆర్టీసీ, 171 ప్రైవేట్ బస్సులు ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని రూట్లలో సేవలందించాయి. బస్సులను పర్యవేక్షించేందుకు అన్ని డిపోలకు జిల్లాస్థాయి అధికారులను నోడల్ అధికారులుగా కలెక్టర్ హనుమంతారావు నియమించారు. అదే విధంగా తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న కండక్టర్లు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు బస్సులను తనిఖీ చేసి ప్రయాణికులతో వివరాలు తెలుసుకున్నారు.

ప్రజలకు సరిపోను బస్సులు..
ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రీజియన్ పరిధిలో రికార్డు స్థాయిలో గురువారం 542 బస్సులతో ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చారు. 371 ఆర్టీసీ బస్సులు, 171 ప్రైవేట్ బస్సులు తిరిగాయి. మెదక్ రీజియన్ పరిధిలోని అన్ని మారుమూల ప్రాంతాలకు సైతం అధికారులు బస్సులను నడిపారు. రీజియన్‌లోని 8 డిపోల పరిధిలో మెదక్ డిపోలో 98 బస్సులు ఉండగా ఆర్టీసీ 49, ప్రైవేట్ 36 బస్సులు తిరిగాయి. నారాయణఖేడ్ డిపోలో 57 బస్సులు ఉండగా అందులో ఆర్టీసీ 36, 12 ప్రైవేట్ బస్సులను తిప్పారు. సంగారెడ్డి డిపోలో 100 బస్సులు ఉండగా అందులో ఆర్టీసీ 71, ప్రైవేట్ 24 బస్సులు ప్రజలను వారి గమ్యస్థానాలకు చేర్చాయి. సిద్దిపేట డిపోలో 105 బస్సులు ఉండగా అందులో ఆర్టీసీ 55, ప్రైవేట్ 40 బస్సులు తిరిగాయి. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపోలో 69 బస్సులు ఉండగా అందులో ఆర్టీసీ 45, ప్రైవేట్ 20 బస్సులు ప్రజలకు సేవలందించాయి. జహీరాబాద్ డిపోలో 93 బస్సులు ఉండగా అందులో ఆర్టీసీ 50, 25ప్రైవేట్ బస్సులతో ప్రజలను వారి గమ్య స్థానాలకు చేర్చారు. దుబ్బాక డిపోలో 40 బస్సులు ఉండగా అందులో ఆర్టీసీ 30, ప్రైవేట్ 4 బస్సులు తిరిగాయి. హుస్నాబాద్ డిపోలో 55 బస్సులు ఉండగా అందులో ఆర్టీసీ 35, ప్రైవేట్ 12 బస్సులు ప్రయాణికులకు సేవలు అందించాయి.

కొనసాగుతున్న ఆందోళనలు..
సమ్మెలో భాగంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు ఉమ్మడి జిల్లాలోని 8 డిపోల ముందు ఆందోళనలు కొనసాగుతున్నాయి. గురువారం ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని డిపోల ముందు కార్మికులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ధూంధాం కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రాల్లో ఐక్య ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో రాజీవ్‌పార్క్ నుంచి ర్యాలీ నిర్వహించి ఆర్టీసీ కార్మికులకు మద్దతు ప్రకటించారు. అదే విధంగా కలెక్టరేట్ ముందు సీపీఎం నాయకులు ఒక్క రోజు నిరాహార దీక్షలు చేపట్టారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపారు. పలు సంఘాలు, పార్టీల నాయకులు వారికి సంఘీభావం తెలిపారు. సమ్మెకు పూర్తి మద్దతు ఇస్తున్నామని సమస్యలు పరిష్కరించాలని కోరారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles