ప్రయాణం.. ప్రశాంతం


Wed,October 16, 2019 12:31 AM

-జిల్లాలో పదకొండవ రోజు యథావిధిగా తిరిగిన 72 బస్సులు
-మారుమూల గ్రామాలకు సైతం తిరుగుతున్న మెదక్ డిపో బస్సులు
-టిం మిషన్లపై కండక్టర్లకు అవగాహన
-టికెట్ చార్జీల కంటే ఎక్కువ వసూలు చేస్తే క్రిమినల్ చర్యలు
-మెదక్ డిపో డీఎం జాకీర్ హుస్సేన్
మెదక్ అర్బన్ :మెదక్ డిపో ఆర్టీసీ బస్సులు అన్ని రూట్లలో సజావుగా నడిచాయి. పదకొండవ రోజు మంగళవారం ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో జిల్లాలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుని బస్సులను యథావిధిగా నడుపడంతో జిల్లా కేంద్రమైన మెదక్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం కన్పించలేదు. ఆర్టీసీ అధికారులు వివిధ రూట్లలో రద్దీగా ఉన్న ప్రాంతాలకు ఎక్కువగా బస్సులను నడిచేలా చర్యలు తీసుకోవడంతో మెదక్ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ కన్పించలేదు. మెదక్ బస్సుడిపో నుంచి వివిధ రూట్లలో యథావిధిగా బస్సులు నడుస్తున్నాయి. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా బస్సులను నడిపించడంతో వివిధ ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. మెదక్ బస్సు డిపోలో 100శాతం బస్సులు నడిచేలా ఆర్టీసీ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీచేయడంతో ఆర్టీసీ అధికారులు బస్సులను నడిపించడానికి కావాల్సిన డ్రైవర్లను, కండక్టర్లను, మెకానిక్‌లను, కంప్యూటర్ ఆపరేటర్లను తాత్కాలిక పద్ధతిన నియామకాలు జరుపుతున్నారు. ఇంకా అర్హులైన వారు ఉంటే విధుల్లోకి తీసుకుంటామని మెదక్ డిపో డీఎం జాకీర్ హుస్సేన్ తెలిపారు. మంగళవారం మెదక్ డిపో నుంచి 72 బస్సులు వివిధ రూట్లలో నడిచాయని ఇందులో ఆర్టీసీ సంస్థకు చెందిన 39 బస్సులతో పాటు 33 అద్దె బస్సులు నడిపినట్లు డీఎం తెలిపారు. చేగుంట, తూప్రాన్, సికింద్రాబాద్ వరకు, కొల్చారం, నర్సాపూర్ మీదుగా జేబీఎస్ వరకు బస్సులు నడిచాయి. రామాయంపేట నుంచి సిద్దిపేట వరకు, రంగంపేట, కొల్చారం నుంచి సంగారెడ్డి, పటాన్‌చెరువు వరకు బస్సులు యథావిధిగా నడిచాయి. అదేవిధంగా మెదక్ నుంచి సికింద్రాబాద్, మెదక్ వయా నర్సాపూర్ నుంచి ఎంజీబీఎస్ వరకు బస్సులు నడిచాయి. ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్, సంగారెడ్డి, జోగిపేట, రంగంపేట మీదుగా మెదక్‌కు ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడిచాయి.మారుమూల గ్రామాలైన కొడపాక, క్యాటీరాల, బ్యాతోల్, తిమ్మాయిపల్లి, బుర్గూపల్లి, పోల్కంపేట గ్రామాలకు సైతం బస్సులు నడుస్తున్నాయి. దీంతో పాటు అన్ని బస్సులల్లో ప్రయాణికులకు టికెట్లు ఇస్తున్నారు. మెదక్ బస్సు డిపో వద్ద పట్టణ సీఐ వెంకటేశం ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు చర్యలు చేపట్టారు.

కండక్టర్లకు టీం మిషన్లపై అవగాహన..
తాత్కాలిక కండక్టర్లకు టీం మిషన్లపై అవగాహన కార్యక్రమం మెదక్ డిపో ఆర్టీసీ అధికారులు నిర్వహిస్తున్నారు. తాత్కాలిక డ్రైవర్లు ఇప్పటి వరకు టికెట్లు లేకుండా ప్రయాణికుల వద్ద నుంచి చార్జీలు వసూలు చేశారు. ఇప్పుడు టిం మిషన్ల్ గురించి వారికి అవగాహన కల్పించి ప్రయాణికులకు టిం మిషన్లతో టికెట్లు జారీ చేయాలని చూస్తున్నారు.

బస్టాండ్‌లో కన్పించని ప్రయాణికుల రద్దీ..
మెదక్ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా కన్పించడం లేదు. ఆర్టీసీ అధికారుల రద్దీగా ఉండే వివిధ ప్రాంతాలకు ఎక్కువగా బస్సులను నడిపిస్తుండటంతో మెదక్ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ కన్పించడంలేదు. దీంతో పాటు ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో సెలవులను పొడిగంచడంతో బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉంటుంది.

ప్రయాణికుల వద్ద టికెట్ ఇవ్వకుండా..చార్జీలు వసూలు చేస్తే క్రిమినల్ చర్యలు తప్పవు..
ఆర్టీసీ బస్సులలో ప్రయాణికుల వద్ద తాత్కాలిక కండక్టర్లు టికెట్ చార్జీల కంటే ఎక్కువగా వసూలు చేస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని మెదక్ బస్ డిపో డీఎం జాకీర్ హుస్సేన్ తెలిపారు. ఆర్టీసీ అధికారులు వివిధ రూట్లలో చూపించిన పట్టిక ఆధారంగా ప్రయాణికల వద్ద నుంచి చార్జీలు వసులు చేయాలని అంత కంటే ఎక్కువగా చార్జీలు తీసుకోవద్దన్నారు.

జిల్లాలో పాక్షికంగా ఆర్టీసీ సమ్మె ప్రభావం..
పదకోండు రోజులుగా జిల్లాలో బస్సులు యథావిధిగా వివిధ రూట్లలో తిరుగడంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం పాక్షికంగా కనపడుతున్నది. ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరవయడం కోసం మెదక్ బస్సు డిపో అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలుగడం లేదు.

రోడ్డుపై ఆర్టీసీ కార్మికుల రాస్తారోకో..
జిల్లా కేంద్రమైన మెదక్‌లో మెదక్ డిపో ఆర్టీసీ కార్మికులు జేఏసీ ఆధ్వర్యంలో బస్సు డిపో రోడ్డుపై 200 మంది ఆర్టీసీ కార్మికులు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...