క్రమబద్ధీకరణకు ఛాన్స్..


Wed,October 16, 2019 12:28 AM

మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల పరిధిలో అనుమతి లేకుండా నిర్మించిన లేఅవుట్‌లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ఆదేశాలు జారీ చేస్తూ ఈ నెల 15 నుంచే అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించవచ్చని స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకునేందుకు 90 రోజులు గడువు ఇచ్చింది. మరోసారి క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా వేలాది సంఖ్యలో ప్రజల నుంచి అర్జీలు అందిన నేపథ్యంలో వారి విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. దీంతో జిల్లాలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట ప్రజలకు గొప్ప అవకాశం ఏర్పడింది. ఇందులో తూప్రాన్, నర్సాపూర్‌లు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండడం గమనార్హం. అయితే 2018 మార్చి 30, అంతకుముందు అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ప్లాట్లు, లే అవుట్‌లు, భూ యజమానులు, ప్రైవేటు డెవెలాపర్లు, ఫిలిం, కంపనీ, ప్రాపర్టీ డెవెలాపర్లు, సొసైటీల వెంచర్లు రిజిస్ట్రర్ సేల్ డీడ్ ద్వారా అమ్మబడిన వాటికి మాత్రమే వర్తించనున్నది. జిల్లాలో ఏర్పడిన ఆయా నూతన మున్సిపల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించుకోవచ్చు. ముఖ్యంగా రాష్ట్ర రాజధానికి చేరువలో ఉన్న జిల్లాగా రియల్ దందా జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే అనేక అక్రమ వెంచర్లు, లే అవుట్‌లు వెలిసాయి. 2018 మార్చి 30 కంటే ముందు ఏర్పాటు చేసిన వెంచర్లు, లేఅవుట్‌లకు ఈ అవకాశం కల్పతరువుగా మారిందనడంలో అతిశయోక్తి కాదు. ఆయా అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించుకునే అవకాశాన్ని ప్రభుత్వం వారికి కల్పించింది. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడి అక్రమ నిర్మాణాలు, అనుమతులు లేని ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవచ్చును. అయితే సంబంధిత పత్రాలను సమర్పించి తమ నిర్మాణాలను క్రమ బద్ధీకరించుకునేందుకు వీలు కల్పించారు. ఈ అవకాశాన్ని ఆయా నూతన మున్సిపాలిటీల పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొంటున్నది.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...