సంగాయిపేటలో ప్రగతి వెలుగులు


Tue,September 17, 2019 11:37 PM

కొల్చారం : సకల సంపదలకు నిలయం సంగాయిపేట.. మెదక్ జిల్లా జీవధార మంజీరానది ఒడ్డున నెలవైన సంగాయిపేటలో పల్లెప్రగతి కాంతులు వెదజల్లుతున్నాయి. గ్రామ అభివృద్ధికి ప్రజలంతా భాగస్వాములు అయ్యేలా అధికారుల చైతన్యంతో మరో మల్కాపూర్‌ను తలపించేలా ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు పని చేస్తున్నారు. గ్రామ నడిబొడ్డున సుమారుగా రెండు ఎకరాల మేర వేంకటేశ్వర గుట్ట ఉన్నది. ఈ గుట్ట చుట్టూ వృత్తాకారంలోని ప్రధాన రహదారికిరువైపులా ఇండ్లు ఉంటాయి. ఇక్కడ 1971లోనే గ్రామ కూడలిలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే రాజ్యాంగ నిర్మాత డా.బీ.ఆర్.అంబేడ్కర్ విగ్రహాన్ని బస్టాండు సమీపంలో ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడి ప్రజా చైతన్యానికి నిదర్శనం. విద్యుత్ సౌకర్యం, తాగునీటి సరఫరా, పాఠశాల భవనం చాలా ఏండ్ల క్రిందటనే సమకూర్చబడ్డాయి.

పనిచేసిన సర్పంచులు వీరే...
గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు నుంచే సంగాయిపేటలో గ్రామ పంచాయతీ ఉన్నది. ఇప్పటి వరకు ఎనిమిది మంది సర్పంచులు ఎన్నుకోబడగా, ముగ్గురు సర్పంచులు ఏకగ్రీవంగా ప్రజలందరి ఏకాభిప్రాయంతో గెలుపొందారంటే గ్రామస్తుల ఐక్యతకు నిదర్శనం. మొట్టమొదటి సర్పంచ్‌గా రంగారెడ్డి (ఏకగ్రీవం), లకా్ష్మరెడ్డి (ఏకగ్రీవం), నవాజ్‌రెడ్డి, రాజిరెడ్డి, రుకమ్మ, రామాగౌడ్, పద్మయ్య, లక్ష్మీభద్యా (ఏకగ్రీవం)లు సర్పంచులుగా పనిచేయగా, ప్రస్తుత సర్పంచ్‌గా మానస శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.

హరితహారంలో ముందంజ..
ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మంగా నిర్వహిస్తూ విరివిగా మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టగా, ఇక్కడ మరో అడుగు ముందుకు వేసి శ్రీగంధం, ఎర్ర చందనం మొక్కలను దేవాలయాలు, చర్చి, మసీదుల ఆవరణలో నాటారు. అలాగే పండ్ల మొక్కలను బయట నర్సరీల నుంచి తెప్పించి ఇండ్ల దగ్గర నాటారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణ, రోడ్డుకు ఇరుపక్కల విరివిగా మొక్కలు నాటి సంరక్షణ కోసం ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు.

పల్లెప్రగతి కాంతులు..
ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి 30 రోజుల ప్రణాళికను అమలు చేస్తుండగా, సంగాయిపేటలో సర్పంచ్ మానస శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డితో పాటు గ్రామస్తులంతా వీధులను శుభ్రం చేశారు. గ్రామంలోని శిథిలావస్థకు చేరిన ఇండ్లు పూడ్చివేసి నందనవనంగా తీర్చిదిద్దారు. ఇంటింటికీ మరుగుదొడ్డిని నిర్మించి ఉపయోగించుకునేలా చైతన్యం చేశారు. వృథా నీటిని బయటకు పోకుండా బోర్లలోకి రీచార్జి చేసే ఏర్పాట్లు చేశారు. ఇంటింటికీ ఇంకుడు గుంతను తవ్వారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సహకారంతో గ్రామంలో ఉన్న వేంకటేశ్వర గుట్టను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నదే ఆశయం..: మాసన శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్
గ్రామంలో అన్ని సమస్యలపై అవగాహన ఉన్నది. ఇప్పటికే అన్ని వీధుల్లో సీసీరోడ్లు, మురికి కాల్వల నిర్మాణం పూర్తయింది. గ్రామంలో ఆహ్లాదకర వాతావరణంతో మండలంలోనే సంగాయిపేటను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే ఆశయంతో పనిచేస్తున్నా. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...