పల్లెప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలి


Tue,September 17, 2019 11:36 PM

తూప్రాన్ రూరల్ : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 30రోజుల పల్లెప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలని, మారుమూల గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత అందరిదని గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి అన్నారు. తూప్రాన్ ఆర్డీవో శ్యామ్ ప్రకాశ్, ఎంపీడీవో అరుంధతితో కలిసి మండలంలోని నర్సంపల్లిలో మంగళవారం ఆయన పర్యటించారు. పాఠశాల ఆవరణలో హరితహారం మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలోని పలు వీధుల్లో పర్యటించి పల్లెప్రగతిలో జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామస్తులతో కలిసి వారు పిచ్చిమొక్కలు, గడ్డిని తొలిగించారు. అంతకుముందు డక్కన్‌రైడర్ యువజన సంఘం, అసోసియేషన్ అధ్యక్షుడు ఏసుదాసులు తమ సొంత ఖర్చులతో కొనుగోలు చేసిన చెత్తడబ్బాలను తూప్రాన్ ఆర్డీవో శ్యామ్ ప్రకాశ్, ఎంపీడీవో అరుంధతి, సర్పంచ్ కత్తుల సత్యనారాయణ, ఈజీఎస్ ఏపీవో కృష్ణారెడ్డిలు గ్రామంలోని పలు వీధుల్లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముత్యంరెడ్డి మాట్లాడుతూ నా ఇల్ల్లు, నా ఊరు.. నా రాష్ట్రం.. అనే నినాదంతో ముందుకు సాగితేనే మారుమూల పల్లె సీమలు ప్రగతి పథంలో పయనిస్తాయన్నారు. పల్లెప్రగతిలో మహిళలు, యువకులు భాగస్వాములై కృషి చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి స్వాతి, ఉప సర్పంచ్ జింకనవీన్, నల్లఅశోక్, చింతలరాజుతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరిస్తా.. : గడ ప్రత్యేకాధికారి
గ్రామంలో నెలకొన్న సమస్యలు దశల వారీగా పరిష్కరిస్తానని గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి అన్నారు. నర్సంపల్లి పాఠశాలలో కొన్ని గదులు శిథిలావస్థలో ఉన్నాయని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా ప్రతిపాదనల కోసం పంచాయతీరాజ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరగా ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్‌తో ఫోన్‌లో మాట్లాడి రెండు రోజుల్లో సర్వే కొనసాగుతుందని ఆయన చెప్పారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...