30 రోజుల ప్రణాళికను.. విజయవంతం చేయాలి


Tue,September 17, 2019 02:10 AM

మెదక్ కలెక్టరేట్ : జిల్లాలోని అన్ని మండలాల్లోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న 30రోజుల ప్రణాళిక కార్యక్రమం విజయవంతం కోసం అన్ని మండలాల ప్రత్యేక అధికారులు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ నగేశ్ అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాలులో జిల్లా అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. జిల్లాలో 30 రోజుల ప్రణాళికలో భాగాంగా గ్రామాల్లో హరితహారం, జలశక్తి అభియాన్, సంపూర్ణ పారిశుధ్య కార్యక్రమాల విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రత్యేక అధికారులు మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి కార్యక్రమాలను వేగవంతం చేసేలా ఆయా మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్, ఇతర అధికారులతో సమన్వయంతో పనిచేయాలన్నారు. గ్రామాల్లో ప్లాస్టిక్ కవర్ల వినియోగం విపరీతంగా పెరిగిపోవడం వల్ల అనేక అనర్థాలు కలుగుతున్నాయన్నారు.
జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ధశల వారీగా ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విదించి ప్లాస్టిక్ కవర్ల దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల్లో ప్లాస్టిక్ విక్రయించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేసేలా జిల్లాలోని అన్ని మండలాల ప్రత్యేక అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని పనిచేయాలన్నారు. ప్రతి గ్రామంలోని మహిళా సంఘాలను సంఘటితం చేసి వారికి తడి, పొడి చెత్తను వేరుచేసే విధానాలపై అవగాహన పెంపొందించాలన్నారు. జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ ఇంకుడు గుంతలను నిర్మించాలన్నారు. ఈ సందర్భంగా ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ప్రజలు రెవెన్యూ అంశాలపై 35 దరఖాస్తులు ఇతర అంశాలపై 19 దరఖాస్తులు చేశారు. మొత్తం 54 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టరేట్ ఏవో యాదగిరి తెలిపారు. వీటిని ఆయా శాఖల అధికారులు పరిశీలించి న్యాయమైన వాటిని సత్వరం పరిష్కరించాలని జిల్లా అధికారులకు జేసీ నగేశ్ సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో వెంకటేశ్వర్లు తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

-మెదక్ మండలం అవుసులపల్లి కి చెందిన టి.యాదమ్మ ఏడాది క్రితం వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకున్నానని ఇప్పటి వరకు అధికారులు డబ్బులు ఇవ్వడం లేదని జేసీ నగేశ్‌కు ఫిర్యాదు చేశారు.
-తనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారని గతంలో ప్రభుత్వం బాలికల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన బాలిక సంరక్షణ పథకంలో దరఖాస్తు చేసుకోగా వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారన్నారు. అయినప్పటికీ ఇప్పటి వరకు బాండు రాలేదని
బాండు ఇప్పించాలని నిజాంపేట మండలం నస్కల్‌కి చెందిన స్వామిగౌడ్ జేసీ నగేశ్‌కు వినతిపత్రం సమర్పించాడు.
-చిన్నఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంపుతో భూములు కోల్పోతున్నామని ప్రస్తుతం మార్కెట్టులో ఎకరాకు రూ.30 లక్షల వరకు ధర పలుకుతున్నదని అధికారులు కేవలం ఎకరాకు రూ.8లక్షలు మాత్రమే ఇస్తామని చెబుతున్నారని తమకు
మార్కెట్టు ధర ప్రకారం డబ్బులు చెల్లించాలని చిన్నఘనపూర్ గ్రామానికి చెందిన రైతులు సంఘమేశ్వర్, మధుసూదన్‌రెడ్డి, సందీప్‌లు జేసీకి వినతిపత్రం సమర్పించారు.
-అవుసులపల్లి శివారులోని సర్వే.నం 142/15లో తమకు పూర్వికుల నుంచి సంక్రమించిన 0-15 గుంటల భూమి ఉన్నదని రెవెన్యూ అధికారులు తమ పేరును తొలిగించి ఇతరుల పేర్లు నమోదు చేశారని తమకు న్యాయం చేయాలని అవుసులపల్లి గ్రామానికి చెందిన పుష్ప జేసీకి వినతిపత్రం సమర్పించింది.
-నార్సింగి గ్రామ శివారులోని సర్వే.నం.112లో డి.మల్లయ్య కు 2-05 ఎకరాలు, ఇ.కృష్ణకు 1-04 ఎకరాల భూమి ఉన్నదని ఈ భూమికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పటి వరకు తమకు రాలేదని దీంతో రైతుబంధు, రైతుబీమా
పథకంలో లబ్ధిపొందడం లేదని తమకు న్యాయం చేయాలని జేసీకి వినతిపత్రం సమర్పించారు.
-చేగుంట మండలం బోనాల గ్రామంలో మీ సేవ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గ్రామానికి చెందిన డి.ప్రశాంత్ జేసీ నగేశ్‌కు వినతిపత్రం సమర్పించాడు.

అభివృద్ధి వైపు పరుగులు
మనోహరాబాద్: మనోహరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రణాళిక పనులు జోరుగా సాగుతున్నాయి. మండలంలోని రంగాయిపల్లి, కోనాయిపల్లి పీటీ గ్రామాల్లో జరిగిన పనులను గ్రామ ప్రత్యేకాధికారి సుధాకర్‌రావు సోమవారం పరిశీలించారు. మనోహరాబాద్, కొండాపూర్, రామాయిపల్లి, పాలాట, కూచారం, గౌతోజిగూడెం, కాళ్లకల్ గ్రామాల్లో శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లను తొలగించడంతో పాటు రోడ్ల పక్కన పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగించి వేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్కుల మహిపాల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు నత్తి మల్లేశ్, సర్పంచులు మమతరవి, భాషబోయిన ప్రభావతి, ఉప సర్పంచ్ ధర్మేందర్, నాయకులు చంద్రశేఖర్ ముదిరాజ్ పాల్గొన్నారు.

పల్లె సీమలు ప్రగతి సాధించాలి
రామాయంపేట: పల్లె ప్రగతితో అభివృద్ధి సాధించాలని ఎంపీడీవో యాదగిరిరెడ్డి అన్నారు. సోమవారం తొనిగండ్ల, రాయిలాపూర్, లకా్ష్మపూర్ గ్రామాల్లో సర్పంచులు, పాలకవర్గాలతో అభివృద్ధి పనుల్లో భాగంగా చెత్తాచెదారం తొలిగించి శుభ్రం చేశారు. అక్కన్నపేటలో సర్పంచ్ నర్సమ్మ, ఎంపీటీసీలతో కలిసి పిచ్చి మొక్కలను తరలించారు. ఎంపీడీవో యాదగిరిరెడ్డి కాట్రియాలలో మొక్కలను నాటారు. ఝాన్సీలింగాపూర్‌లో స్వచ్ఛభారత్, తొనిగండ్లలో సర్పంచ్ రాణమ్మ, ఎంపీటీసీ నాగులు ఆధ్వర్యంలో చెత్త కుప్పలను ఎత్తి పోశారు. కిషన్ నాయక్ తండాలో గ్రామసభను ఏర్పాటు చేసి అభివృద్ధి పనులపై పలు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమాల్లో ఆయా సర్పంచులు, ఎంపీటీసీలు, సుభాష్ నాయక్, పంబాల జ్యోతి, నర్సమ్మ, నర్సాగౌడ్, బోయిని దయాలక్ష్మి, ఉప సర్పంచ్‌లు దీపక్‌రెడ్డి పాల్గొన్నారు.

కొనసాగుతున్న శ్రమదానం
వెల్దుర్తి: గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం మండల వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతుంది. మండలంలోని కుకునూర్‌లో సోమవారం జెడ్పీటీసీ రమేశ్‌గౌడ్, నాయకులు మహేందర్‌లు కూలిన పాత ఇండ్ల గోడలను జేసీబీ సహాయంతో తొలగించారు. ఆరెగూడెంలో సర్పంచ్ శేఖర్ ఆధ్వర్యంలో మహిళలు, గ్రామస్తులు రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలు, ముండ్ల పొదలను తొలగించారు.

వెంకటపూర్(కె)లో శ్రమదానం
నిజాంపేట: గ్రామాలు అభివృద్ధి చెందాలని చేపట్టిన 30రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం వెంకటపూర్(కె) గ్రామంలో సర్పంచ్ అనిల్, ప్రత్యేకాధికారి శోభారాణి, కో ఆప్షన్ సభ్యులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, మహిళ గ్రూపు సభ్యులు, గ్రామస్తులు కలిసి గ్రామంలోని చెత్తను, రోడ్డుకీరువైపుల ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సిద్ధిరాములు, ఫీల్డ్ అసిస్టెంట్ కైలాస్, టీఆర్‌ఎస్ నాయకులు దయాకర్, కిష్టయ్య, నాగరాజు గ్రామస్తులు పాల్గొన్నారు.

అభివృద్ధి బాటలో గ్రామాలు
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతి పనులు గ్రామాల్లో జోరుగా కొనసాగుతున్నాయన్ని ఉప సర్పంచుల ఫోరం నిజాంపేట మండల అధ్యక్షుడు కొమ్మాట బాబు అన్నారు. సోమవారం నిజాంపేటలో ముండ్ల పొదలు, కూలిపోయిన ఇండ్లను, పిచ్చి మొక్కలను జేసీబీ, డోజర్ సహాయంతో గ్రామస్తులు తొలగించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని, ఇంటింటికీ ఇంకుడుగుంత, మొక్కలను నాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దరాములు, శ్రీను, గర్గుల శ్రీను, నర్సింహులు, ఇంద్రసేనా, రాములు, రవి పాల్గొన్నారు.

122
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...