సంగారెడ్డికి వైద్య కళాశాల


Sun,September 15, 2019 11:27 PM

-కాళేశ్వరం నీటితో సింగూరు నింపుతాం
-అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన

సంగారెడ్డి టౌన్ : సంగారెడ్డికి మెడికల్ కాలేజీని త్వరలోనే ఇవ్వనున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆదివారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా కేంద్రానికి మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తామన్నారు. మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం కేంద్రానికి మంజూరు కోసం ప్రతిపాదనలు పంపుతామన్నారు. కేంద్రం అనుమతితో త్వరలోనే సంగారెడ్డిలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మెదక్ జిల్లాలో ఉన్న మంజీరా, సింగూరు ప్రాజెక్టులు ఎండిపోయాయని వాటిని జీవనదులుగా మార్చుతామన్నారు. కాళేశ్వరం నిర్మాణం పూర్తి చేసి వ్యవసాయానికి నీటిని అందిస్తున్నామని, మల్లన్న సాగర్ నిర్మాణం పూర్తి చేసి సింగూరు, మంజీరా ప్రాజెక్టులను నింపుతామన్నారు. మల్లన్న సాగర్ నిర్మాణం ఈ సంవత్సరం నెలాఖరు నాటికి పూర్తవుతుందని, సింగూరు, మంజీరా, నిజాంసాగర్ నీటితో కళకళలాడుతయన్నారు.

ఈ సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ సింగూరు, మంజీరా ప్రాజెక్టులను మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా నింపుతామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా సంగారెడ్డిలో మెడికల్ కళాశాలను త్వరలోనే ఏర్పాటు చేయాలని, సంగారెడ్డికి ముఖ్యమంత్రి రావాలని కోరారు. సంగారెడ్డికి వస్తే సన్మానం చేస్తానన్నారు. అదే విధంగా సంగారెడ్డిలోని మహబూబ్‌సాగర్‌లో పూడిక తీసేందుకు నిధులు కేటాయించాలని కోరారు. ఇందుకు స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డికి మెడికల్ కళాశాలను ఇస్తామని గతంలోనే ప్రకటించారని, ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా సంగారెడ్డిలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్‌సాగర్ ప్రక్షాళన కోసం అధికారులకు ఆర్జీ సమర్పించాలని, వారు ప్రతిపాదనలు ఇస్తే తప్పకుండా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు ద్వారా సింగూరు, మంజీరాను నింపేందుకు ఎన్ని నిధులైనా కేటాయిస్తామని, జిల్లాలో సాగుకు, తాగుకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.

118
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...