ఊరూరా.. ప్రగతి పండుగ


Fri,September 13, 2019 03:33 AM

మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 30రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు కోసం ఏడోరోజు గురువారం జిల్లా వ్యాప్తంగా 469 గ్రామ పంచాయతీల్లో సభలు, సమావేశాలు పండుగ వాతావరణంలో జరిగాయి. ఊరూరా పండగ వాతావరణంలో స్టాండింగ్ కమిటీలు, కో-ఆప్షన్ సభ్యులు, సర్పంచులు, మండల జిల్లాస్థాయి అధికారులు గ్రామాల్లోని వీధులు, మురికి కాల్వలను శుభ్రపరిచే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శివ్వంపేట, మనోహరాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డిలు శివ్వంపేట మండల కేంద్రంలో గాంధీజీ విగ్రహానికి పూల మాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా శివ్వంపేటలోని సీసీరోడ్లు ఊడ్చారు. అనంతరం శివ్వంపేట మండలంలోని శభాశ్‌పల్లిలో హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. మనోహరాబాద్ మండలం గౌతోజీగూడెంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటి, గ్రామస్తులకు చెత్తబుట్టలను అందజేశారు. 30రోజుల ప్రత్యేక కార్యాచరణ అమలు కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని మన గ్రామం మనమే అభివృద్ధి చేసుకోవాలని, ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ ఐక్యంగా ఉండి విజయవంతం చేయాలని జెడ్పీ చైర్మన్ హేమలతాశేఖర్‌గౌడ్, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డిలు పిలుపునిచ్చారు. సర్పంచ్, ఉపసర్పంచ్, కో-ఆప్షన్ సభ్యులు, పంచాయతీ వార్డుసభ్యులు, అధికారులు కలిసి కట్టుగా గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

గ్రామసమస్యల గుర్తింపుతో పాటు సమస్యల పరిష్కారానికి పంచాయతీ పాలకవర్గంతో పాటు, స్థాయీసంఘం సభ్యులు, కో-ఆప్షన్ సభ్యులు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా గురువారం గ్రామాగ్రామాన వీధులు, మురికి కాల్వలు శుభ్రపరిచి, పిచ్చిమొక్కలను తొలిగించే కార్యక్రమాలను దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో చేపట్టారు. మెదక్ మండలం ర్యాలమడుగు గ్రామంలో ఎంపీపీ యమునాజయరాంరెడ్డి, సర్పంచ్ రజని, ఎంపీడీవో రాంబాబు తదితరులు వీధులను శుభ్రపరిచారు. అనంతరం వివిధ సమస్యలను గుర్తించారు. మాచవరం, మంబోజిపల్లి,తూఫ్రాన్ మండలం కిష్టాపూర్‌లో గ్రామస్తులంగా ఐక్యంగా ముందుకు కదులుతున్నారు. ముఖ్యంగా తూఫ్రాన్ మండలం కిష్టాపూర్‌లో కో-ఆప్షన్ సభ్యుడు శ్రీశైలంగౌడ్ గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. టేక్మాల్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ సత్యనారాయణ అధ్యక్షతన, పంచాయతీ కార్యదర్శి ధనలక్ష్మితో పాటు స్థాయి సంఘాల సభ్యులు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. పలు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి గ్రామాల్లోని సమస్యలను గుర్తించారు. డీపీవో హనోక్ చేగుంట మండలంలోని పర్యటించగా, ఆర్డీవోలు, డీఎల్‌పీవోలు, జిల్లా స్థాయి అధికారులందరూ పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

పల్లెప్రగతి పనుల్లో అధికారులు
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు..: కలెక్టర్ ధర్మారెడ్డి
పల్లెప్రగతి పనుల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలుంటాయని కలెక్టర్ ధర్మారెడ్డి హెచ్చరించారు. ఆకస్మికంగా ఆయన గ్రామాలను సందర్శిస్తానని కలెక్టర్ ప్రకటించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామస్థాయిలో, స్టాండింగ్ కమిటీ సభ్యులు, కో-ఆప్షన్‌సభ్యులు, వార్డుసభ్యులతో కలిసి గ్రామాల అభివృద్ధ్దికి కృషి చేయాలన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...