నేడు గణేశ్ నిమజ్జనోత్సవం


Wed,September 11, 2019 11:49 PM

-మెదక్‌లో 130కిపైగా వినాయకులు
-నిమజ్జనోత్సవం సందర్భంగా
-ఏర్పాట్లు పూర్తి వందల మంది సిబ్బందితో బందోబస్తు..

మెదక్ మున్సిపాలిటీ : వినాయక చవితి మొదలు 11రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న గణనాథుడి నిమజ్జనానికి అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేయగా, అటు భక్తులు కూడా భారీ ఊరేగింపుగా నిమజ్జనం చేసేందుకు డప్పు చప్పుళ్లును సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని పలు చెరువులు, కుంటల వద్ద ఏర్పాట్లు చేశారు. మెదక్ పట్టణంలోని సుమారు 130 గణనాథులను బంగ్లా చెరువు, గోసంద్రం, పిట్లం, మల్లంచెరువు తదితర ప్రాంతాల్లో నిమజ్జనం చేసేందుకు రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా శోభాయాత్రను సాయంత్రంలోగా పూర్తి చేయాలని భక్తులకు సూచించారు. అదేవిధంగా ముందుగానే మద్యం దుకాణాలను మూసివేయించారు. చెరువుల వద్ద నిమజ్జనానికి అనువుగా భారీ క్రేన్‌లను కూడా చెరువుల వద్ద ఉంచారు. అటు విద్యుత్ అధికారులు చెరువుల వద్ద వెలుగులు ఉండేందుకుగాను విద్యుత్ సౌకర్యం కల్పించారు. ఇలా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.

ఆయా ప్రాంతాల్లో నిమజ్జనోత్సవాలు..
జిల్లాలోని తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట, చేగుంట, వెల్దుర్తితో పాటు జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.

400 మంది సిబ్బందితో భారీ బందోబస్తు..
నిమజ్జనోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎస్పీ చందనదీప్తి ఆధ్వర్యంలో 400 మంది సిబ్బందిని నియమించారు. ఒక అదనపు ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, 8 మంది సీఐలు, 1ఆర్‌ఐ, 30 మంది ఎస్‌ఐలు, 3 ఆర్‌ఎస్‌ఐలతో పాటు 356 మందికి పైగా ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు కాకుండా ఏఆర్ సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ చందనదీప్తి హెచ్చరించారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...