నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు


Wed,September 11, 2019 11:44 PM

మెదక్ మున్సిపాలిటీ: గణేశ్ నిమజ్జన శోభాయాత్ర జిల్లాలో ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని ఎస్పీ చందనదీప్తి పేర్కొన్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. గణేశ్ నిమజ్జన శోభాయాత్ర కొనసాగే ప్రధాన రహదారులు, కాలనీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకోడం జరిగిందన్నారు. మండపాలకు జియోట్యాగింగ్ చేసిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా కేటాయించిన నెంబర్ల ద్వారా శోభాయాత్రను పర్యవేక్షించడం జరుగుతుందని చెప్పారు. అలాగే నిమజ్జనం సమయంలో చెరువుల వద్ద ఫ్లడ్‌లైట్లు, పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరుగకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశామని, అనుకోని పరిస్థితుల్లో ఏదైనా జరిగితే కేవలం ఐదు నుంచి పది నిమిషాల్లో చేరుకునే విధంగా పెట్రోవాహనాలు, బ్లూకోట్స్, సంబంధిత పోలీస్ అధికారులను అప్రమత్తం చేసే విధంగా ఆన్‌లైన్ విధానం ద్వారా భద్రతను పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.

400 మంది సిబ్బందితో నిమజ్జన భద్రత చేపట్టడం జరిగిందని వివరించారు. ఒక ఎస్పీ, ఒక అదనపు ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, ఎనమిది మంది సీఐలు, ఒక ఆర్‌ఐ, 30 మంది ఎస్సైలు, ముగ్గురు ఆర్‌ఎస్సైలతోపాటు 356 మంది ఏఎస్సై, హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుళ్లు, హోంగార్డులు బందోబస్తు నిర్వహించనున్నట్లు చెప్పారు. వీరికి అదనంగా వలంటీర్లను సైతం ఈ సారి నిమజ్జన శోభాయాత్ర బందోబస్తులో భాగస్వామ్యులను చేస్తున్నట్లు పేర్కొన్నారు. కమ్యూనల్ కేసులతో సంబంధం ఉన్నవారిని బైండోవర్ చేశామని, రౌడీషిటర్లు, క్రిమినల్ రికార్డు ఉన్న వారి కదలికలపై నిఘా పెట్టాలమని చెప్పారు. గణేశ్ మండపాల నిర్వాహకులు మంచి కండీషన్‌లో ఉన్న వాహనాలను వినియోగించుకోవాలని తెలిపారు. మద్యం సేవించి శోభాయాత్రలో పాల్గొనకుండా ఆధ్యాత్మిక వాతావరణంలో వేడుకలను నిర్వహించుకోవాలని సూచించారు. నిమజ్జన ప్రదేశాలకు చిన్నారులను తీసుకురావద్దని, నిర్దేశించిన విధంగా క్రమపద్ధతిలో శోభాయాత్రలో పాల్గొనాలని సూచనలు చేశారు. రెవెన్యూ, మున్సిపల్, ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారులు, ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకుండా జిల్లాలో ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనం జరిగేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఊరేగింపులో విద్యుత్ తీగల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. ఇతర మతస్తుల ప్రార్థనా స్థలాల వద్ద ఆగి ఎలాంటి నినాదాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని హెచ్చరించారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించరాదని, రద్దీ ప్రదేశాల్లో చిన్నపిల్లలను ఒంటరిగా వదిలివేయరాదని తెలిపారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...