15నుంచి ఆర్థిక గణన


Fri,September 6, 2019 11:49 PM

-నాలుగు నెలల పాటు నిర్వహణ
-ఇంటింటికీ రానున్న ఎన్యుమరేటర్లు
-పథకాల అమలులో భాగంగానే ఆర్థిక గణన
-పారదర్శకంగా గణన నిర్వహణకు కసరత్తు

మెదక్ కలెక్టరేట్: ప్రజల స్థితిగతులపై ఆర్థిక గణన నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు సిద్ధం అవుతున్నది. జిల్లాలో ఈనెల 15 నుంచి ఈ సర్వే ప్రారంభం కానున్నది. గ్రామ పంచాయతీకి ఒక ఎన్యుమరేటర్‌ను ప్రత్యేకంగా ఈ గణన కోసం నియమించనున్నారు. వీరంతా ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు, వారి ఆదాయ వనరులు సేకరించనుండగా నాలుగు నెలల పాటు ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగనున్నది. సంక్షేమ ఫలాలు అర్హులకు అందించడంలో భాగంగా అధికార యంత్రాంగం ఈ సర్వే చేపడుతుండగా పైరవీలతో లబ్ధిపొందాలనుకునే వారికి చెక్ పడనున్నది. జిల్లా వ్యాప్తంగా 469 గ్రామ పంచాయతీల్లోని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిని గుర్తించి ప్రభుత్వ పథకాల అమలులో వారికి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టనున్నది. సర్వే ద్వారా వచ్చే నివేదికల ఆధారంగా పేదలను గుర్తించి సంక్షేమ పథకాలను అమలు చేసే అవకాశం ఉంటుంది.

పకడ్బందిగా సర్వే...
జిల్లాలోని 20 మండలాల్లో 469 గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రతి గ్రామంలో సర్వే నిర్వహించనున్నారు. ప్రతి కుటుంబంలోని వ్యక్తులు వారు చేసే పనులు, ఆదాయాలు, భూముల వివరాలు ఇలా పూర్తి వివరాలు సేకరిస్తారు. కుటుంబంలోని వ్యక్తులు చేసే పనుల వలన వారికి వచ్చే ఆదాయం అయ్యే ఖర్చులు, ఇతర ఆదాయ మార్గాలు, అన్నింటిని లెక్కిస్తారు. గ్రామాల్లో సాధారణ చిన్న దుకాణం నిర్వహించే వ్యక్తి నుంచి పట్టణాల్లో నిర్వహించే పెద్ద వ్యాపార సంస్థల వరకు అన్నింటినీ సర్వే చేసి ఆర్థిక స్థితిగతులను అంచనా వేస్తారు. దీని కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఎన్యుమరేటర్లు సర్వేలు చేపట్టనున్నారు.

పంచాయతీకో ఎన్యుమరేటర్
జిల్లాలో ఇప్పటికే దాదాపు 197 మంది ఎన్యుమరేటర్లు ఉండగా మిగతా పంచాయతీలలో నియమించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామాల్లో పూర్తి వివరాలు సేకరించిన అనంతరం వెంటనే ఆడ్రాయిడ్ ఫోన్ ద్వారా ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. దీని కోసం ఒక కుటుంబాన్ని సర్వే చేస్తే రూ.10 , షాపు ఇల్లు కలిసి ఉన్న కుటుంబాన్ని సర్వే చేస్తే రూ.16, వాణిజ్య సముదాయాలు చేస్తే రూ.20ని ప్రభుత్వం చెల్లిస్తున్నది. సూపర్‌వైజర్ ఒక ఇంటి సర్వేకు రూ.3, ఇంటి-వాణిజ్య సర్వే కోసం రూ.4-50, వాణిజ్య సముదాయాల సర్వే కోసం రూ.6చొప్పున చెల్లించనున్నది. జిల్లాలో దాదాపు లక్షా 20 వేల వరకు కుటుంబాలు ఉన్నాయి. నాలుగు నెలల పాటు చేపట్టనున్న ఈ సర్వే ద్వారా ప్రతి కుటుంబం ఆర్థిక స్థితిగతులను అంచనా వేయనున్నారు. దీంతో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిని గుర్తించనున్నారు. వీరికి అనుగుణంగా జిల్లాలో సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించే వీలుంటుంది.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...