పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లోనే నివాసం ఉండాలి


Sat,August 24, 2019 02:02 AM

మెదక్ అర్బన్: గతంలో ఐదు ,ఆరు గ్రామాలకు ఒక పంచాయతీ కార్యదర్శి ఉండేవారని అలా ఉండడంతో గ్రామాల అభివృద్ధి జరుగలేదనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు గ్రామపంచాయతీ పరిధిలోనే నివాసం ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ధర్మారెడి పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులతో జిల్లా కేంద్రంలోని మాయ గార్డెన్స్‌లో సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై కలెక్టర్ పంచాయతీ కార్యదర్శులకు అవగహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...గ్రామాల్లో ఉన్న సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారం దిశగా పనిచేయాలన్నారు. వారం రోజుల్లోగా ఏయే గ్రామాల్లో పంచాయతీల్లో కార్యదర్శులు నివాసం ఉంటున్నారనే పూర్తి సమాచారం తనకు అందజేయాలని డీపీవోను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకరావడం జరిగిందన్నారు. ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత పంచా యతీ కార్యదర్శులపై ఉందన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే కార్యదర్శులను తక్షణం విధుల్లో నుంచి తొలిగిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ రెగ్యులరైజ్ చేయడానికి మూడు సంవత్సరాల పనితీరును ప్రామాణికంగా తీసుకుంటుందన్నారు.
ప్రభుత్వం గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు సెప్టెంబర్ నెలలో 60 రోజుల ప్రణాళిక అమలుకు చర్యలు తీసుకోవడం జరగుతుందన్నారు. ఈ ప్రణాళికలో ప్రతి గామంలో అన్ని సమస్యలను పరిష్కరించేందుకు పంచాయతీ కార్యదర్శి ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. పంచాయతీ పరిధిలో సంవత్సరం , ఐదు సంవత్సరాల్లో చేపట్టాల్సిన పనుల ప్రణాళికను సిద్ధ్దం చేసుకోవాలని సూచించారు. ప్రతి పంచాయతీ కార్యదర్శి తమ గ్రామంలో ఉన్న విద్యుత్ సమస్యలను గుర్తించాలని సూచించారు. వీటితో పాటు గ్రామంలో నిరుపయోగంగా ఉన్న బావులు , బోరు బావులను గుర్తించాలని , ఎలాంటి ప్రమాదాలు జరుగక ముందే వాటిని పూడ్చివేయాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో వైకుంఠదామం , తడి, పొడి చెత్త సేకరణ కేంద్రం ఏర్పాటు చేసుకోవాలని అందుకు గాను తమ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమి వివరాలను రెవెన్యూ అధికారులకు తెలియజేయాలన్నారు. దానిని పంచాయతీకి అప్పగించే ప్రయత్నం జిల్లా అధికార యంత్రాంగం చేస్తుందన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో నాలుగు రకాల స్థాయి సంఘాలను త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి కమిటీలో 15 మంది సభ్యులకు తగ్గకుండా ఉండేలా చూడాలన్నారు. ప్రతి నెల పంచాయతీ జనరల్ బాడీ సమావేశం , రెండు నెలలకోసారి గ్రామ సభలను తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. అలా నిర్వహించకపోతే గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని రద్దు చేయడం జరుగుతుందన్నారు. హరితహార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ పంపిణీ చేసిన మొక్కలకు సంబంధించిన వివరాలను ప్రత్యేక రిజిష్టరులో నమోదు చేసుకోవాలన్నారు.ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో లక్ష్మీబాయి, జిల్లా పంచాయతీ అధికారి హనోక్, జిల్లా గ్రామీణాభివృద్ధ్ది అధికారి సీతారామరావు, ఏపీడీ ఉమాదేవితోపాటు ఎంపీడీవోలు , ఈవోఆర్డీలు, పంచాయతీకార్యదర్శులు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...