భూ కొలతల సమస్యకు చెక్


Fri,August 23, 2019 04:52 AM

-జిల్లాకు రెండు అధునాతన పరికరాలు
-జిల్లాలోని సర్వేయర్లకు డీజీపీఎస్ పరికరాలతో భూముల సర్వేపై శిక్షణ
-కలెక్టర్ ప్రత్యేక నిధులు రూ.32లక్షలతో పరికరాల కొనుగోలు
-ఇక భూముల సర్వే, భూసేకరణ పనులు వేగవంతం

మెదక్ కలెక్టరేట్: ఏండ్ల కాలం నుంచి భూమి కొలతలు వేయాలంటే పది మీటర్లు, ఇరవై మీటర్ల గొలుసులతో భూమిని కొలిచేవారు. దీంతో సర్వేయర్లు రోజుకు రెండు మూడు ఎకరాలకు మించి భూమిని కొలతలు వేయలేకపోయేవారు. దీంతో తరచూ భూమి కొలతల సమస్యలు తలెత్తేవి. ఇటీవల కాలంలో భూముల విలువలు పెరుగడంతో రైతులు తమ భూములను సర్వే జరిపి హద్దులు ఏర్పాటు చేయించాలని జిల్లాలోని పలు మండలాల రైతులు దరఖాస్తు చేసుకుని నెలల తరబడి సర్వే కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసేవారు. సిబ్బంది కొరత ఒక వైపు రికార్డులు దొరకక మరోక వైపు ప్రభుత్వ కార్యక్రమాలకు భూసేకరణ పనులు ఒక వైపు దీంతో సర్వే పనుల్లో జాప్యం జరిగేది. సర్వే పనుల్లో జాప్యం నివారించడంతో పాటు కచ్చితత్వం కోసం ఇటీవలి కాలంలో డీజీపీఎస్ పరికాలు అందుబాటులోకి వచ్చాయి.

దీంతో సర్వే పనులు వేగవంతం అవుతాయని జిల్లాలో నిర్మిస్తున్న జాతీయ రహదారుల నిర్మాణం, ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపు, మల్లన్నసాగర్ కాల్వల నిర్మాణానికి కావలసిన భూసేకరణ పనులు వేగవంతం కోసం జిల్లాకు డీజీపీఎస్ పరికరాలు అవసరం ఉన్నాయని భావించిన కలెక్టర్ ధర్మారెడ్డి తన ప్రత్యేక నిధుల నుంచి రూ.32 లక్షలను కేటాయించి ఒక్కో పరికరం రూ.16 లక్షలు వెచ్చించి డీజీపీఎస్ పరికరాలు రెండు కొనుగోలు చేశారు. వీటి వినియోగం వల్ల సర్వే పనుల్లో వేగవంతం కావడంతో పాటు భూముల సర్వేలో కచ్చితత్వం ఏర్పడుతుంది. ఈ పరికరాల వినియోగంపై జిల్లాలోని సర్వేయర్‌లకు సాంకేతిక నిపుణుల సమక్షంలో కలెక్టరేట్‌లో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్సు ఏడీ గంగయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

పరికరాల పనితీరు...
డీజీపీఎస్ (డిజిటల్ గ్లోబల్ పొజిషన్ సిస్టం)లో ముఖ్యంగా రెండు ప్రధాన భాగాలు ఉంటాయి. ఈ పరికరం సాటిలైట్‌తో అనుసంధానమై పనిచేస్తుంది. ఈ పరికరంలో ప్రధానమైన పరికరం పేరు సీఎస్ 10 కంట్రోలర్ ఈ పరికరాన్ని ముందుగా భూమి కొలతలు వేసే ప్రాంతానికి తీసుకెళ్లి దానిలో అవసరమైన వివరాలు నమోదు చేసి సాటిలైట్‌తో అనుసంధానం చేస్తారు. ఈ పరికరాన్ని ట్రైపానల్ రోవర్‌తో అనుసాంధానం చేసిన తర్వాత కొలతలు వేయాలనుకున్న భూమి నాలుగు వైపులకు రోవర్‌ను తీసుకెళ్లి వివరాలను నమోదు చేస్తారు. అనంతరం ఈ పరికరంలో వివరాలు నమోదు చేసి కంప్యూటర్‌కు అనుసంధానం చేస్తే మనం కొలతలు వేసిన భూమికి సంబంధించిన డిజిటల్ మ్యాప్‌తో పాటు భూమి విస్తీర్ణం కూడా తెలుస్తున్నది. ఈ పరికరాన్ని ఉపయోగించి సుమారు మూడు కిలోమీటర్ల విస్తీర్ణం వరకు ఏకకాలంలో కొలతలు వేయవచ్చు. చెరువులు, కొండలు, గుట్టలు భవనాలు ఉన్న ప్రదేశాలలో కూడా ఈ పరికరంను ఉపయోగించి భూములను కొలతలు వేయవచ్చు. ఈపరికరం వినియోగంపై జిల్లాలోని సర్వేయర్‌లకు విడుతల వారీగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...