గజ్వేల్‌ స్ఫూర్తితో హరిత తెలంగాణ


Thu,August 22, 2019 12:03 AM

-ప్రతిష్ఠాత్మక ‘మిషన్‌భగీరథ’ పథకమే అందుకు నిదర్శనం
-అన్ని ప్రాంతాల్లో ‘మంకీ ఫుడ్‌కోర్టు’లు ఏర్పాటు కావాలి
-రానున్న మూడేండ్లలో హరిత జిల్లాలు రూపుదిద్దుకోవాలి
-నాటిన మొక్కలను సంరక్షించుకోవాలి..
-ఉన్న అడవులను కాపాడుకోవాలి..
-ఫారెస్ట్‌, ఈజీఎస్‌, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరిపడా నిధులు
-మంత్రులు, కలెక్టర్లతో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు
-పునరుజ్జీవ అటవీ ప్రాంతం, కోమటిబండ వద్ద మొక్కల ప్లాంటేషన్‌ పరిశీలన
-హరితహారం, మిషన్‌భగీరథపై కోమటిబండలో సమీక్ష

సంగారెడ్డి , సిద్దిపేట , నమస్తే తెలంగాణ ప్రతినిధులు:‘అడవుల పునరుజ్జీవంతో పాటు నాటిన మొక్కల సంరక్షణలో గజ్వేల్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి.. గజ్వేల్‌ మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా అడవుల పునరుజ్జీవం చేపట్టాలి.. సంకల్పముంటే, ఏదైనా సాధించవచ్చు.. అందుకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇంటింటికీ నల్లా ద్వారా స్వచ్ఛ తాగునీరందిస్తున్న ‘మిషన్‌భగీరథ’ పథకమే నిలువెత్తు నిదర్శనం’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు జిల్లాల కలెక్టర్లకు సూచించారు. బుధవారం ఉదయం గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలోని సింగాయిపల్లి, నెంటూరు, కోమటిబండ తదితర ప్రాంతాల్లో చేపట్టిన అటవీ పునరుద్ధరణ పనులను జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి స్వయంగా చూపించారు. సింగాయిపల్లి వద్ద సీఎం కేసీఆర్‌కు కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి మొక్క అందజేసి, స్వాగతం పలికారు. వర్గల్‌ మండలం సింగాయిపల్లి వద్ద సహజ అడవుల పునరుజ్జీవ పథకం కింద చేపట్టిన సంరక్షణ చర్యలను కలెక్టర్లకు సీఎం కేసీఆర్‌ స్వయంగా వివరించారు. అడవుల సందర్శన అనంతరం కలెక్టర్లు కోమటిబండలో నిర్మించిన మిషన్‌ భగీరథ ప్లాంటును సందర్శించారు. అక్కడే కలెక్టర్లతో కలిసి ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, రానున్న మూడేండ్లలో హరిత జిల్లాలుగా రూపుదిద్దుకోవాలని, హరితహారం కోసం అటవీ, ఈజీఎస్‌, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరిపడా నిధులున్నాయన్నారు.

‘అడవుల పునరుజ్జీవంతో పాటు నాటిన మొక్కల సంరక్షణలో గజ్వేల్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి.. గజ్వేల్‌ మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా అడవుల పునరుజ్జీవం చేపట్టాలి.. రానున్న మూడేండ్లలో హరిత జిల్లాలుగా రూపుదిద్దుకోవాలి.. హరితహారం కోసం అటవీ, ఈజీఎస్‌, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరిపడా నిధులున్నాయి.. సంకల్పముంటే, ఏదైనా సాధించవచ్చు.. అందుకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇంటింటికి నల్లా ద్వారా స్వచ్ఛ తాగునీరందిస్తున్న ‘మిషన్‌భగీరథ’ పథకమే నిలువెత్తు నిదర్శనం.. హరిత జిల్లాల ఏర్పాటు బాధ్యత కలెక్టర్లపై ఉన్నది.. ఆయా జిల్లాలను హరితవనంగా మార్చడంలో శక్తివంచన లేకుండా కృషి చేయాలి.. చాలా గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువైంది.. అటవీ ప్రాంతాల వద్ద ‘మంకీ ఫుడ్‌ కోర్టు’లు ఏర్పాటు చేయాలి.. దీనితో కోతులు ఈ ఫుడ్‌కోర్టు వైపు వెళ్లేలా చూడాలి’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జిల్లాల కలెక్టర్లకు సూచించారు. బుధవారం ఉదయం గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలోని సింగాయిపల్లి, నేంటూరు, కోమటిబండ తదితర ప్రాంతాల్లో చేపట్టిన అటవీ పునరుద్ధరణ పనులను జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి స్వయంగా చూపించారు. సింగాయపల్లి వద్ద సీఎం కేసీఆర్‌కు కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి మొక్కల అందజేసి, స్వాగతం పలికారు. అంతకు ముందు వర్గల్‌ మండలం సింగాయిపల్లి వద్ద సహజ అడవుల పునరుజ్జీవ పథకం కింద చేపట్టిన సంరక్షణ చర్యలను కలెక్టర్లకు స్వయంగా చూపించారు. సీఎం గజ్వేల్‌ పర్యటన, మంత్రులు, కలెక్టర్ల సమీక్షకు సంబంధించిన వివరాలు ఇలా..

‘మంకీ ఫుడ్‌ కోర్టు’లతో సమస్యకు పరిష్కారం..
అడవులు అంతరించుకుపోతున్న క్రమంలో అందులో ఉండే కోతులు గ్రామాల్లోకి వస్తున్నాయని, గ్రామాల్లో ఇప్పుడు కోతుల బెడద తీవ్రమవుతున్నదని, ఈ సమస్య పరిష్కారానికి ‘మంకీ ఫుడ్‌ కోర్టు’లు ఏర్పాటు కావాలని సీఎం కేసీఆర్‌ కలెక్టర్లకు సూచించారు. అటవీ ప్రాంతాల్లో కోతులు తినే మర్రి, అల్లనేరేడు, సీతాఫలాలు వంటి పండ్ల మొక్కలను నాటి, సంరక్షించాలన్నారు. వర్గల్‌ మండలం సింగాయిపల్లి అడవుల పునరుజ్జీవం ఫలితాలు కనిపిస్తున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా అడవుల సంరక్షణ చేపట్టాలని సూచించారు. సామాజిక అడవుల పెంపకం, ఆవాస ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ఉపయోగపడితే, అడవుల పెంపకం వాతావరణంలో మార్పులు తెచ్చి వర్షాలు బాగా కురిసి జీవ వైవిధ్యానికి దోహదపడుతుందన్నారు.

రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలోని అటవీ భూములు చెట్లు లేని ఎడారిలా మారిన దుస్థితి ఉండేదని, అటవీ భూముల్లో అడవిని పునరుద్ధరించాలనే లక్ష్యంతో సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేసినట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. మూడేండ్ల క్రితం ప్రారంభమైన అడవుల పునరుద్ధరణ ఫలితాలు ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయని, ఈ ప్రాంతమంతా పచ్చని చెట్లతో కళకళలాడుతూ వర్షపాతం కూడా పెరిగిందని సీఎం చెప్పారు. 27 రకాల పండ్ల మొక్కలను ఈ అడవుల్లో పెంచడంతో ఇవి కోతులకు మంకి ఫుడ్‌ కోర్టుల్లా తయారవుతున్నాయన్నారు. గజ్వేల్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపట్టిన అటవీ పునరుద్ధరణ కార్యక్రమం స్ఫూర్తిగా తీసుకొని, రాష్ట్రవ్యాప్తంగా అడవుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. అడవి చుట్టూ కందకాలు తీశామని, దీంతో అడవికి రక్షణ ఏర్పడుతుందని, బయట జంతువులు లోపలకు రావడం గానీ, లోపలి జంతువులు బయటకెళ్లడం గానీ సాధ్యం కాదని అధికారులు వివరించారు. కందకాలలో నీరు నిల్వ ఉండడంతో చెట్లకు కావాల్సిన తేమ అందుతుందని, కందకాల కట్టలపై గచ్చకాయ చెట్లు నాటడంతో అడవికి సహజమైన రక్షణ ఏర్పడుతుందని వారు తెలిపారు.

హరితహారం, మిషన్‌భగీరథపై కోమటిబండలో సమావేశం
సింగాయపల్లి, కోమటిబండ అడవుల పునరుద్ధరణను సందర్శించిన అనంతరం కలెక్టర్లతో కోమటిబండ గుట్టపై నిర్మించిన మిషన్‌ భగీరథ ప్లాంట్‌ను సందర్శించారు. అక్కడే కలెక్టర్లతో కలిసి ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం కలెక్టర్లతో సమావేశమై కొత్త పంచాయతీరాజ్‌ చట్టం, మున్సిపల్‌ చట్టం అమలుపైన కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపై కలెక్టర్లతో సీఎం చర్చించారు. పల్లెలు, పట్టణాలు పచ్చదనం.. పరిశుభ్రతతో కళకళలాడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, దీనికి అనుగుణంగా 60 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ కలెక్టర్లకు సూచించారు. రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేని, అవినీతికి ఆస్కారం లేని పారదర్శకమైన రెవెన్యూ చట్టానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తుందని సీఎం కేసీఆర్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటల రాజేందర్‌, జి. జగదీశ్వర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, కొప్పుల ఈశ్వర్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్‌, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...