అన్నదాతకు అండగా..


Wed,August 14, 2019 12:29 AM

-సీఎం కేసీఆర్ చొరవతో గత సంవత్సరం ఆగస్టు 15న ప్రారంభమైన పథకం
-బాధితుల కుటుంబాలను ఆదుకుంటున్న ప్రభుత్వం
-ఇప్పటివరకు జిల్లాలో 611కుటుంబాలకు లబ్ధి
-సీఎం కేసీఆర్‌ను తమ పెద్దకొడుకుగాభావిస్తున్న రైతు కుటుంబాలు
ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న రైతు మరణిస్తే... ఆ కుటుంబం రోడ్డున పడేది.. ఇదంతా గతం... సీఎం కేసీఆర్ గత ఏడాది ప్రారంభించిన రైతు బీమా బాధిత కుటుంబాలకు చేయూతగా నిలుస్తున్నది...ప్రభుత్వమే రైతుల పేరిట ప్రీమియం చెల్లించి, వారికి బీమా పట్టాలను అందజేసింది. అప్పటినుంచి ఏ రైతు మరణించినా వారి కుటుంబానికి రూ.5లక్షల బీమా సొమ్ము అందుతున్నది. ఈ మొత్తం ఆ రైతు కుటుంబ సభ్యులను ఆదుకుంటున్నది. జిల్లాలో ఇప్పటి వరకు వివిధ కారణాలతో 673 మంది రైతులు మరణించగా, అందులో 611మంది కుటుంబాలకు 30కోట్ల55లక్షల పరిహారం అందింది. 62 మంది రైతు కుటుంబాలకు చెల్లింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పుడు ఏ రైతు కుటుంబాన్ని కదిలించినా తమకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్‌ను తమ పెద్ద కొడుకుగా అభివర్ణిస్తున్నారు. తమకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ నిండు నూరేండ్లు వర్ధిల్లాలని ఆశీర్వదిస్తున్నారు.

మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ :సీఎం కేసీఆర్ తీసుకున్న రైతుబీమా నిర్ణయంతో జిల్లాలో 673 రైతు కుటుంబాలకు కొండంత అండగా నిలిచింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మరణించిన రైతు కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం అందించడమే లక్ష్యంగా రైతుబీమా పథకాన్ని రూపొందించారు. గత సంవత్సరం ఆగస్టు 14వ తేదీ అర్థరాత్రి నుంచి ఈ పథకం అమలైంది. గత ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి ఇప్పటి వరకు వివిధ కారణాలతో 673 మంది రైతులు మరణించగా వారి కుటుంబాలకు 611 మంది రైతు కుటుంబాలకు పరిహారం ఎల్‌ఐసీ సంస్థ అందించింది. 62 మంది రైతు కుటుంబాలకు చెల్లింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నది. ఒక్కో రైతుకు రైతుబీమా కోసం రూ.2217.50 ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లించింది. జిల్లాలో అర్హులైన 1,08,886 మంది రైతులకు రూ.24కోట్ల14లక్షలు రాష్ట్ర ప్రభుత్వమే బీమా చెల్లించింది. వ్యవసాయశాఖ అధికారులు ఎప్పటికప్పుడు జిల్లాలో మరణించిన రైతుకుటుంబాల వివరాలు ఏవో నుంచి మొదలుకుని డీవో వరకు ఆన్‌లైన్ చేసి విచారణ జరిపి ప్రభుత్వానికి ఇటు ఎల్‌ఐసీ సంస్థకు నివేదికను అందించారు. వెనువెంటనే మరణించిన రైతు కుటుంబాల నామినీలకు నేరుగా ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేకుండా బ్యాంకు ఖాతాలో ఒక్కో కుటుంబానికి రూ.5లక్షలను జమచేశారు.

స్వయంగా రైతుబిడ్డ సీఎం కేసీఆర్ స్వీయ నియంత్రణలో ఏర్పాటు చేసిన రైతుబీమా పథకం రైతు కుంటుంబాలకు ఎంతో అండగా నిలుస్తున్నది. ఈ పథకంతో లబ్ధిపొందిన కుటుంబాలు సీఎం కేసీఆర్‌ను చల్లగా ఉండాలని దీవిస్తున్నాయి. రైతు మరణించిన వారం రోజుల్లోనే బ్యాంకులో ఈ పథకానికి సంబంధించిన డబ్బులు నామినీ ఖాతాలో జమకావడం జరుగుతుంది. రైతుబీమా పథకంలో 18 సంవత్సరాల నుంచి 59 సంత్సరాల వయస్సు ఉన్న ప్రతి రైతుకు ఈ పథకం వర్తిస్తున్నది. ఈ బీమా పథకాన్ని మరో ఏడాది పాటు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. దీంతో ఒక్కో రైతుకు ప్రీమియం రూ.3,031.50లను చెల్లించనున్నది. ఈ సంవత్సరం జిల్లాలో అర్హులైన 1,08,886 మంది రైతులు ఉన్నారని జిల్లా వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు దాదాపు ఆ విలువ మొత్తం రూ.33కోట్ల వరకు పెరుగనున్నది. ప్రస్తుత సంవత్సరానికి 2019 ఆగస్టు 15 నుంచి వచ్చే సంవత్సరం 2020 ఆగష్టు 15 వరకు బీమా సదుపాయం అర్హులైన వారికి అందనున్నది. పట్టాదారు పాసుపుస్తకం ఉన్న ప్రతి రైతుకు ఈ పథకం వర్తించనున్నది. కలెక్టర్ ధర్మారెడ్డి, వ్యవసాయ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి మరణించిన రైతు కుటుంబాలకు ఆర్థిక పరిహారం అందేలా చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, సోలిపేట రామలింగా రెడ్డి, క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డి తదితరులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

ఏవో నుంచి డీవో వరకు అందరం స్పందిస్తున్నాం
చనిపోయిన రైతు కుటుంబాలకు సంబంధించి పంచనామ నిర్వహించి ప్రభుత్వానికి ఇటు ఎల్‌ఐసీ సంస్థకు వెనువెంటనే సమాచారం ఇస్తున్నాం. మా సిబ్బందికి రైతు మరణించిన సమాచారం అందగానే ఆ గ్రామానికి వెళ్లి విచారణ జరిపి రైతుబీమాకు అర్హులైన వారి పేర్లను వెంటనే ఆన్‌లైన్‌లో ఎల్‌ఐసీ సంస్థకు సమాచారం అందిస్తున్నాం. నామినీలకు సంబంధించి బ్యాంకు అకౌంట్‌లను ఇతర సమాచారం జిల్లా అధికారులకు తెలియపరుస్తూ చనిపోయిన రైతు కుటుంబాలకు వీలైనంత త్వరలో చెక్కులు అందేలా కృషి చేస్తున్నాం. ఒక్కో రైతు కుటుంబానికి రూ.5లక్షలు పరిహారం అందేలా ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని అమలు చేస్తున్నది. జిల్లాలో 673 మంది రైతులు వివిధ కారణాలతో మరణించారు. ఇప్పటి వరకు 611 మంది రైతు కుటుంబాల నామినీలకు రూ.30కోట్ల55లక్షలు ఎల్‌ఐసీ బీమా సంస్థ చెల్లించింది. 62 మంది రైతు కుటుంబాలకు త్వరలో రైతుబీమా పథకానికి సంబంధించిన డబ్బులు నామినీల ఖాతాలకు బీమా సంస్థ డబ్బులు చెల్లించనున్నది. ఈ రైతుబీమా పథకాన్ని మరో ఏడాది పాటు పొడిగించడంతో ఒక లక్షకు పైగా రైతులు ఈ పథకానికి అర్హులుగా గుర్తించాం.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...