కాళేశ్వరం నీటితో నర్సాపూర్ సస్యశ్యామలం


Wed,August 14, 2019 12:25 AM

నర్సాపూర్, నమస్తే తెలంగాణ : కాళేశ్వరం నీటితో నర్సాపూర్ నియోజకవర్గం సస్యశ్యామలమవుతుందని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. మంగళవారం శివ్వంపేట మండలంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ హేమలత, మాజీ మంత్రి సునీతారెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. మండలంలోని గోమారం గ్రామపంచాయతీ భవనం వద్ద, పాలిటెక్నిక్ కళాశాల వద్ద, ఎస్సీ భవనం వద్ద, సికింద్లాపూర్, బిజిలీపూర్, లచ్చిరెడ్డిగూడెం, నవాపేటలలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ సికింద్లాపూర్‌గ్రామానికి సీసీ రోడ్లతో పాటు మహిళా సమాక్య భవనాన్ని మంజూరు చేయిస్తానని తెలిపారు. గ్రామంలో 33 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. ఇక్కడ నెలకొన్న భూ సమస్యల పరిష్కారం కోసం తహసీల్దార్‌కు గ్రామాన్ని దత్తత ఇస్తున్నట్లు తెలిపారు. నవాపేట గ్రామంలో ప్రత్యేక రెవెన్యూ సదస్సు పెట్టించి భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సాంబయ్య చెరువును 1.5 టీఎంసీ రాజర్వాయర్‌గా నిర్మిస్తామని పేర్కొన్నారు. గోమారం గ్రామాన్ని అద్దంలా తయారు చేయడానికి శక్తి వంచనలేకుండా కృషి చేస్తానన్నారు. పిల్లికొట్టాల నుంచి అనంతారం చౌరస్తా వరకు డబుల్‌లైన్ రోడ్డు, జీడిపల్లి నుంచి చిన్నగొట్టిముక్ల వరకు రెండు వైపుల డబుల్‌లైన్ రోడ్డు నిర్మాణం పూర్తయితే కొత్తకళ వస్తుందన్నారు. గ్రామంలో రెండు వైపుల స్ట్రీట్‌లైట్ల ఏర్పాటు, మార్కెట్‌షెడ్డు నిర్మాణం, రూ.15 లక్షలతో కోఆపరేటీవ్ భవనం, రూ.50 లక్షలతో శ్మశాన వాటిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మొదటి విడుతలో 50 డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేయిస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. అనంతరం కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అంతకుముందు జెడ్పీ చైర్ పర్సన్ హేమలతా శేఖర్‌గౌడ్ ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జెడ్పీటీసీ పబ్బా మహేష్‌గుప్త, ఎంపీపీ హరికృష్ణ, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, డీపీవో హనోక్, ఏడీ నర్సయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...