నాణ్య తేది


Sun,August 11, 2019 11:51 PM

-నిర్మాణ దశలోనే పగుళ్లు !
-మట్టికొట్టుకుపోయిన ప్ల్లాట్‌ఫాం
-కౌంటర్ గదికి బీటలు
-అధికారుల అలసత్వం.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం..
-ఇటీవల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
-నాసిరకం పనులను చూసి రైల్వే శాఖ అధికారులపై ఆగ్రహం

మెదక్ మున్సిపాలిటీ :మెదక్ ప్రజల చిరకాల ఆకాంక్ష.. ఏండ్ల నాటి కల.. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఎదరుచూపులు ఎట్టకేలకు నెరవేరాయి... కానీ అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పనులు అప్పుడే బీటలు వారుతున్నాయి. నిర్మాణ దశలోనే మట్టికొట్టుకుపోతున్నాయి.

రైల్వేలైన్ కోసం మెదక్ ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్నారు. వారి ఆకాంక్షలను నెరవేరుస్తూ అప్పట్లో కేంద్ర ప్రభుత్వం మెదక్ రైల్వేలైన్‌ను మంజూరు చేసింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇందుకోసం నిధులు మంజూరు చేసింది. అక్కన్నపేట నుంచి మెదక్ వరకు ఉన్న 17 కిలోమీటర్ల నూతన లైన్ కోసం రూ.1200 కోట్లను విడుదల చేసింది. అయిన ఆ పనులు ఆగుతూ.. సాగుతూ వచ్చాయి. ఒక్కడుగు ముందుకు సాగితే ఏడడుగులు వెనక్కు అన్న చందంగా ఈ పనులు నడుస్తున్నాయి. గత ఏడాది నుంచి రైల్వే పనులు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ నాణ్యత లోపాలు మాత్రం కొట్టచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఏ ఒక్క పనిలో కూడా ప్రమాణాలు పాటించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మట్టికొట్టుకుపోయిన ప్లాట్‌ఫాం..
ప్లాట్‌ఫాం కోసం చుట్టు పక్కల ఉన్న మట్టిని చదునుచేసి దానిపైనే కొత్తగా ప్లాట్‌ఫాం ఏర్పాటు చేశారు. అయితే దీని కింద నుంచి మట్టి అప్పుడే పక్కకు జరిగిపోయింది. అలాగే ఈ మధ్యకాలంలో కురుస్తున్న చిన్న పాటి వానలకే రైల్వేట్రాక్ కింద ఉన్న మట్టి చాలా కొట్టుకుపోయింది. నిబంధనల ప్రకారం ట్రాక్ కింద ముందుగా గట్టి మట్టిని నింపి ఆ తర్వాత కాంక్రీట్‌ను వేయాల్సి ఉంటుంది. కానీ సదరు కాంట్రాక్టర్ మాత్రం స్థానికంగా ఉన్న మట్టినే ట్రాక్ కోసం వినియోగించినట్లు, అదేవిధంగా ట్రాక్ కోసం వినియోగించిన కాంక్రీట్‌ను కూడా సరిగ్గా నింపలేదని, దీన్ని డోజర్‌తో చదును చేయాల్సి ఉన్నా నామ మాత్రంగానే పైపై పనులు చేయడంతో వదులుగా ఉండి, చిన్న పాటి వానలకే కొట్టుకుపోయింది.

కౌంటర్ గదికి బీటలు..
మెదక్‌లో ఏర్పాటు చేస్తున్న రైల్వేలైన్ ప్లాట్‌ఫాంకే కాదు, రైల్వే స్టేషన్‌లో ఉన్న కౌంటర్ గది నిర్మాణంలోనూ కనీస ప్రమాణాలు పాటించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కౌంటర్ గదికి అప్పుడే పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ మధ్య కురిసిన వానలకు గది మొత్తం వాననీటితో తడిసిముద్ధయింది. నిర్మాణ దశలోనే పగుళ్లు వస్తే తర్వాత వీటి పరిస్థితి ఏమిటన్నదానిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలావుంటే రైల్వేలైన్ సర్వే విషయంలోనూ అనేక పొరపాట్లు జరిగినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గంగాపూర్ నుంచి శమ్నాపూర్ మధ్య మలుపులు మరీ దగ్గరగా ఉన్నట్లు ఆ ట్రాక్‌ను పరిశీలిస్తే అర్థమవుతుంది. దీనిపై గతంలో సెంట్రల్ రైల్వే అధికారులు సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మార్గంలో ప్రస్తుతం ఏర్పాటు చేసిన బ్రిడ్జిని తొలిగించి వంకర్లు లేకుండా మరో లైన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఆ దిశగా కాంట్రాక్టర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, పాతదానికే మరమ్మతులు చేసి ఊరుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి లోపాలు చాలానే ఉన్నట్లు నిపుణుల కమిటీ చాలా సార్లు హెచ్చరించింది. అయినా సంబంధిత అధికారులు కానీ, కాంట్రాక్టర్ కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తుంది.

రైల్వే శాఖ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం...
ఇటీవలే జిల్లా కేంద్రానికి వచ్చిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అకస్మాత్తుగా మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్లాట్‌ఫాం పూర్తిగా పగుళ్లు ఏర్పడంతో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి రైల్వేశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత లేకుండా పనులు ఎలా చేపడుతున్నారని అక్కడే ఉన్న ఏఈపై మండిపడ్డారు. అంతేకాకుండా అక్కన్నపేట-మెదక్ ప్రాజెక్టు హెడ్ సుబ్రమణ్యంతో ఫోన్‌లో మాట్లాడి రైల్వేట్రాక్‌పై నాణ్యత లేకుండా పనులు ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ నెల 13న రైల్వే శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని, తప్పకుండా రైల్వేశాఖ, ఇతర సంబంధిత అధికారులందరూ హాజరుకావాలని ఆదేశించారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...