ప్రతి బస్తాకి పక్కాగా లెక్క


Fri,August 9, 2019 11:38 PM

-ఈ-పాస్‌తో అక్రమాలకు అడ్డుకట్ట..!
-ఫర్టిలైజర్ల దుకాణాల్లో యంత్రాలు
-ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న వ్యవసాయ శాఖ
మెదక్ మున్సిపాలిటీ: జిల్లా వ్యాప్తంగా ఫర్టిలైజర్ దుకాణాలను ఈ-పాస్ యంత్రాలు (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) పంపిణీ చేసి ఫర్టిలైజర్ మానిటరింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీంతో ఫర్టిలైజర్ డీలర్లు విక్రయించే ఎరువుల బస్తాలపై పక్కాగా లెక్క ఉంటుంది. ఈ-పాస్‌తో అక్రమాలకు అడ్డుకట్ట వేయనున్నది. ప్రస్తుతం యంత్రాలు అందుబాటులోకి రావడంతో ఎరువుల విక్రయాలు పకడ్బందీగా సాగుతున్నాయి.

జిల్లాలో 187 ఫర్టిలైజర్ దుకాణాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 20 మండలాల పరిధిలో 2 లక్షల 15వేల మంది రైతులు ఉన్నారు. వారికి దాదాపు 35,900 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉంటుంది. అయితే ఇందులో రైతులకు కావాల్సిన ఎరువులు, పొటాష్, డీఏపీ ఆయా కంపెనీల నుంచి నేరుగా జిల్లా కేంద్రానికి చేరుకునేవి. జిల్లా కేంద్రంలో నిలువ చేసి అక్కడి నుంచి ఆయా మండల కేంద్రాల ఎరువుల దుకాణాలకు తరలించేవారు. ప్రభుత్వం ఇస్తున్న రాయితీ నేరుగా ఆయా కంపెనీలకు చేరేది. దీని వల్ల ఎరువులు ఎవరికి అమ్ముతున్నారో సమాచారం తెలియక రాయితీ పక్కదారి పట్టేది. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం డీబీటీ విధానాన్ని తీసుకొచ్చింది. అయితే ఎరువులను కొనుగోలు చేసే రైతులు పట్టా పాసుపుస్తకాలతో పాటు ఆధార్ కార్డును తీసుకెళ్లి వేలిముద్ర వేసిన తర్వాత ఎరువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న ఈ-పాస్ యంత్రం ద్వారా రైతుల భూముల వివరాలను ఆప్‌లోడ్ చేసిన అనంతరం వేలిముద్ర తీసుకోవడం జరుగుతుంది. రైతుల పంటలకు ఎంత మేర ఎరువులు అవసరమవుతాయో అనే దానిని బట్టి అమ్మకాలను కొనసాగిస్తారు. ఇదిలావుండగా ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు రైతుల అవసరాల మేరకు ఎరువులను ఇచ్చి వాటి వివరాలను నమోదు చేసి కొనుగోలుకు సంబంధించిన రసీదులను వెంటనే రైతులకు ఇస్తారు. బిల్లులు బస్తా ధర, ప్రభుత్వం ఇచ్చే రాయితీ, రైతులకు చెల్లించాల్సిన ధర కూడా అందులో ఉంటుంది.

వేలిముద్ర పెడితేనే ఎరువులు...
రైతు ఎరువులను కొనుగోలు చేసే సమయంలో వేలిముద్ర వేస్తేనే ఎరువులను కొనుగోలు చేయడానికి అవకాశం ఉన్నది. వేలిముద్ర వేయకుండా ఎరువులను తీసుకోవడానికి అవకాశం లేదు. గత ఏడాది నుంచి ఈ-పాస్ యంత్రాలు అందుబాటులోకి రావడంతో ఎరువుల విక్రయాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఎరువులు కొనుగోలు చేసే రైతులు పట్టా పాసుపుస్తకాలతో పాటు ఆధార్ కార్డును తీసుకెళ్లి వేలిముద్ర వేసిన తర్వాతే వారు ఎరువులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

గ్రామాలల్లో రైతులకు అవగాహన..
జిల్లాలోని అన్ని మండలాల్లోని గ్రామాల్లో ఈ-పాస్ యంత్రాల విధానంతో ఎరువుల కొనుగోలుపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది. గ్రామాల్లో రైతులకు అవగాహన లేక ఎరువుల దుకాణాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారు. ఎరువులను తీసుకునేటప్పుడు రైతు ఆధార్ కార్డుతో పాటు పాస్ పుస్తకాలు అవసరం ఉంటుంది. కానీ రైతులు ఎరువుల దుకాణాలకు వెళ్లేటప్పుడు సంబంధిత రైతు ఆధార్ కార్డు, పాసుపుస్తకాలను తీసుకెళ్లడం లేదు. దీంతో మళ్లీ గ్రామాలకు వెళ్లి తీసుకుని రావడం జరుగుతుంది. అలా జరుగకుండా సంబంధిత వ్యవసాయ అధికారులు ఆయా గ్రామాల్లోకి వెళ్లి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...