లెక్క తేలింది


Wed,July 17, 2019 12:47 AM

మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ :జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు ఓటర్ల ముసాయిదా తుది జాబితాను మంగళవారం విడుదల చేశారు. ఆయా మున్సిపాలిటీల్లో జాబితాను ప్రదర్శించారు. మెదక్ మున్సిపాలిటీలో ఓటర్ల ముసాయిదా తుది జాబితా పూర్తి కాగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్లతో పాటు మున్సిపల్ ఓటర్ల లెక్క తేలింది. మెదక్ మున్సిపాలిటీతో పాటు మూడు విలీన గ్రామాలకు సంబంధించిన ఓటర్లతో కూడిన జాబితాను కూడా విడుదల చేశారు. ఈ నెల 11న మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితాను విడుదల చేసి ఆయా పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేసి వారికి ఒక్కో సెట్ జాబితాను అందజేశారు. ఈ నెల 12వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించి, 13న క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పరిష్కరించారు. అయితే ఈ నెల 14న ఓటర్ల ముసాయిదా తుది జాబితాను విడుదల చేయాల్సి ఉండగా, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 16వ తేదీకి వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు ఆగస్టు రెండో వారంలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుండటంతో ఎన్నికల ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. మెదక్ మున్సిపల్‌లో గతంలో 27 వార్డులు ఉండగా, గ్రామాల విలీనంతో వార్డుల పునర్విభజన అనంతరం ఆ సంఖ్య 32కు పెరిగింది. మున్సిపల్ పరిధిలో 51వేల జనాభా ఉండగా ఇందులో 32,649 మంది ఓటర్లు ఉన్నారు. ఒక్కో వార్డులో కనీసం 935 నుంచి 1175 మంది ఓటర్ల వరకు ఉన్నట్లు ముసాయిదా జాబితా ద్వారా తెలుస్తున్నది. మొత్తం 32 వార్డులకు ఎన్నికలు నిర్వహించేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటరు జాబితాను సైతం విడుదల చేశారు. మరో వైపు 64 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో సుమారు 800 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని తూప్రాన్ మున్సిపాలిటీలో 23,673 మంది ఓటర్లు ఉండగా, 16 వార్డులకు గాను 17,173 మంది ఓటర్లు ఉన్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో 18,816 మంది ఓటర్లు ఉండగా, 15 వార్డులకు 13,772 మంది ఓటర్లు ఉన్నారు. రామాయంపేట మున్సిపాలిటీలో 17,860 మంది ఓటర్లు ఉండగా, 12 వార్డులకు గాను 11,596 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 75,190 మంది ఓటర్లు ఉన్నారు.

క్యాబినెట్ సమావేశం తర్వాతనే రిజర్వేషన్లు...కొత్త చట్టం ప్రకారమే ఎన్నికలు..
18, 19 తేదీల్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. క్యాబినెట్‌లో నూతన మున్సిపల్ చట్టాన్ని ఆమోదించి ఆ తర్వాతనే రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

20 తర్వాతే రిజర్వేషన్లు ఖరారు..?
ఈ నెల 20 తర్వాత ఎప్పుడైనా కొత్త చట్టంలో రూపొందించిన నిబంధనల ప్రకారంగా రిజర్వేషన్లను ఖరారు చేస్తారనే ప్రచారం జరుగుతున్నది. అయితే కొత్త చట్టం తెరపైకి రావడంతో ఆశావహుల్లో సందిగ్ధం నెలకొన్నది. జిల్లాలోని మెదక్ మున్సిపాలిటీతో పాటు నూతనంగా ఏర్పడిన తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఏ వార్డు నుంచి ఎవరో..
మెదక్ మున్సిపాలిటీలో గతంలో 27 వార్డులు ఉండగా, నూతనంగా విలీనమైన గ్రామాలతో కలిపి 32 వార్డులకు పెరిగింది. వార్డుల పునర్విభజనతో పాటు ఓటర్ల గణన పూర్తి చేసిన ఓటర్ల జాబితాను ఫైనల్ చేశారు. దీంతో రిజర్వేషన్లపై టెన్షన్ మొదలైంది. పాత వార్డుల్లో గతంలో ప్రాతినిధ్యం వహించిన నేతల భవిష్యత్ మార్చే విధంగా పునర్విభజన జరిగింది.

అయితే కొన్ని ప్రాంతాల్లో బీసీ ఓట్లు, మరికొన్ని ప్రాంతాల్లో ఎస్సీ ఓట్లు ప్రభావం చూపే పరిస్థితి నెలకొన్నది. దీంతో ఏ వార్డు ఏ రిజర్వేషన్‌గా మారుతుందోననే ఆందోళన ఆశావహుల్లో మొదలైంది. వార్డుల పునర్విభజన సమయంలో ఓట్లు గల్లంతై ఒక వార్డు నుంచి మరో వార్డుకు వెళ్లడంతో ఏ వార్డులో పోటీ చేయాలనే సందిగ్ధం తాజా మాజీల్లో నెలకొన్నది. దీనికి తోడు రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో ప్రచారం చేసుకునేందుకు అడ్డంకిగా మారింది. ఇదిలావుండగా జిల్లాలో నూతనంగా ఏర్పడిన తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట మున్సిపాలిటీల్లో కూడా రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ మొదలైంది. కొత్తగా మున్సిపాలిటీలు ఏర్పడటంతో ఎవరు చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటారో వేచి చూడాల్సిందే.

నేడు ఆయా పార్టీల నేతలతో సమావేశం..
మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా ప్రకటన చేయడంతో 17న ఆయా పార్టీల నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఆయా వార్డుల్లో పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన మార్పులు ఉంటే సమావేశంలో చర్చించనున్నారు. పోలింగ్ కేంద్రాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే 17 నుంచి 19వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. 19న పోలింగ్ కేంద్రాల జాబితా సిద్ధం చేసి కలెక్టర్‌కు పంపనున్నారు. 21న పోలింగ్ కేంద్రాల తుది జాబితాను విడుదల చేస్తారు.

129
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...