అటవీ భూముల్లో అర్బన్‌ పార్కులు


Mon,July 15, 2019 12:26 AM

తూప్రాన్‌, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్రంలో అటవీ భూములకు కొత్త రూపు తెచ్చేందుకు సీఎం కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నం నేడు నర్సాపూర్‌, చేగుంట, మనోహరాబాద్‌ మండలాల ప్రజలకు అర్బన్‌ పార్కుల నిర్మాణ రూపంలో ఆహ్లాదం అందనున్నది. బీడు భూములను తలపించే అటవీ భూముల్లో మార్పులు చేసి పర్యాటక కేంద్రాలను తలపించేలా పచ్చటి వాతావరణం కల్పించి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నర్సాపూర్‌లో అటవీశాఖ, మనోహరాబాద్‌, చేగుంట మండలాల్లో హెచ్‌ఎండీఏ అధికారుల పర్యవేక్షణలో పనులు ముందుకు సాగుతున్నాయి. బీడు భూములుగా దర్శనమిచ్చే అటవీ భూములకు కొత్త కళ తెచ్చేందుకు ప్రభుత్వ చొరవతో అధికారులు వినూత్న తరహాలో ప్రయత్నాలు చేస్తున్నారు. నర్సాపూర్‌ పట్టణానికి సమీపంలో ఉన్న భూములతో పాటు తూప్రాన్‌ జాతీయరహదారికి ఆనుకుని ఉన్న మనోహరాబాద్‌ మండలంలోని అటవీ భూములు, మనోహరాబాద్‌ రైల్వే స్టేషన్‌కు అతి సమీపంలో ఉన్న అటవీ భూముల్లో అర్బన్‌ పార్కులను ఏర్పాటు చేసి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలనే నిశ్చయంతో ప్రభుత్వం ముందుకు సాగుతుండటంతో అధికారులు చేస్తున్న ప్రయత్నం త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్నది.

నర్సాపూర్‌, మనోహరాబాద్‌, చేగుంట
మండలాల్లో 2180 హెక్టార్లలో
రూ.16.29 కోట్లతో అర్బన్‌ పార్కులు..
నర్సాపూర్‌ పట్టణంలో 757 హెక్టార్లు , మనోహరాబాద్‌ మండలంలో 129 హెక్టార్లు మనోహరాబాద్‌ మండలం పర్కిబండ శివారులో 880 హెక్టార్లు, చేగుంట మండలం వడియారంలో 404 హెక్టార్లు మొత్తం కలిపి 2180 హెక్టార్ల అటవీ భూముల్లో రూ.16.29 కోట్లతో అర్బన్‌ పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి దశలో ఈ భూముల చుట్టు కంచె ఏర్పాటు చేస్తున్నారు. నర్సాపూర్‌లో సుమారు రూ. 1 కోటీ 50 లక్షలు, మనోహరాబాద్‌లో రూ.3 కోట్ల 78 లక్షలు, పర్కిబండలో రూ.6 కోట్ల 25 లక్షలు, వడియారంలో రూ.4 కోట్ల 76 లక్షలతో పనులు కొనసాగుతున్నాయి. నర్సాపూర్‌లో నిధులు మంజూరై పనులు చివరి దశకు చేరగా. మనోహరాబాద్‌, పర్కిబండ, చేగుంట మండలం వడియారంలో పనులు కొనసాగుతున్నాయి. మనోహరాబాద్‌, చేగుంట మండలాల్లో జరుగుతున్న పనులకు గాను మొదటి దశ నిధులుగా రూ.2.5 కోట్లు మంజూరుయ్యాయి. కొంత మేర ప్రహరీ, మిగిలిన దానిలో కంచె నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పనులు పూర్తయిన తర్వాత సాధారణ పార్కులను తలపించేలా ఏర్పాటు చేసే యోచనలో అధికారులున్నారు.

ఆక్రమణకు తావు లేకుండా..
అటవీ, ప్రభుత్వ భూములకు నేటి కాలంలో రక్షణ లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వ భూములకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచించి పార్కులుగా తీర్చి దిద్దాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే మొదటి దశగా అటవీ భూముల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. అనంతరం ప్రత్యేక నిదులు మంజూరు చేసి భూముల చుట్టూ కంచె ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే గతేడాది నాటిన మొక్కలు ఈ సారికి కొంత పెద్దగా పెరిగాయి. మిగిలిన ఖాళీ స్థలాల్లో ఈ సారి హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పార్కుల ఏర్పాటుకు కూడా అనుకూలత ఏర్పడింది. మొక్కలు నాటిన భూముల చుట్టూ కంచె ఏర్పాటు చేయడంతో పార్కులుగా మారిపోనున్నాయి.

ఆహ్లాద పార్కులుగా ఏర్పాటు..
అటవీ భూములను పార్కులుగా మార్చి వాటిలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. పార్కుల్లో వాకింగ్‌ చేసేవారితో పాటు వ్యాయామం చేసే వారికి కూడా అనుకూలంగా ఏర్పాట్లు చేయనున్నారు. వాకింట్‌ ట్రాక్‌లు, సైక్లింగ్‌ ట్రాక్‌లు, చిన్న పిల్లలు ఆడుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు దశల వారీగా ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

141
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...