కొమురవెల్లి ఆలయంలో భక్తుల రద్దీ


Mon,July 15, 2019 12:22 AM

చేర్యాల, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒక్కటైన కొమురవెల్లి మల్లన్న ఆలయం ఆదివారం భక్తులతో నిండిపోయింది. మల్లన్న నామస్మరణలతో క్షేత్రం మార్మోగింది. శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు, ఆదివారం స్వామి వారిని దర్శించుకున్నారు. అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకొని, మట్టి పాత్రలతో అత్యంత భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించారు. మరికొందరు రాతిగీరలు వద్ద ప్రదక్షిణలు, కోడెల స్తంభం వద్ద కోడెలు కట్టి పూజలు చేశారు. మల్లన్నను రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి తన కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాలలో ఆలయ ఈవో టి.వెంకటేశ్‌, ఏఈవో రావుల సుదర్శన్‌, పర్యవేక్షకులు నీల శేఖర్‌, సిబ్బంది బత్తిని పోచయ్య, మేకల పోచయ్య, ఏఈ బ్రహ్మాండ్లపల్లి అంజయ్య, సార్ల విజయ్‌కుమార్‌, వెంకటచారి, వైరాగ్యం జగదీశ్వర్‌, కొత్త శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహులు, సార్ల కనకయ్య, మాధవి, అర్చకులు, ఒగ్గు పూజారులు పాల్గొన్నారు.
రేపు మల్లన్న ఆలయ ద్వారబంధనం
చంద్రగ్రహణం సందర్భంగా ఈ నెల 16వ తేదీన మల్లన్న ఆలయాన్ని ద్వారబంధనం చేయనున్నట్లు ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్‌ తెలిపారు. మంగళవారం చంద్రగ్రహణం ఉన్నందున్న సాయంత్రం 6 నుంచి ఉదయం 6గంటల వరకు ఆలయ ద్వార బంధనం చేస్తామన్నారు. బుధవారం సంప్రోక్షణ తదితర ప్రత్యేక పూజల అనంతరం ఆలయంలో స్వామి వారి దర్శనాలు ప్రారంభం అవుతాయన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన భక్తులు ద్వార బంధనం సందర్భంగా తమకు సహకరించాలని కోరారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...