ఓటర్ల ముసాయిదా తుది జాబితా విడుదల వాయిదా


Mon,July 15, 2019 12:21 AM

-ఈ నెల 16న ఓటర్ల ముసాయిదా తుది జాబితా విడుదల
-ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
-ఈ నెల 20 తర్వాతే రిజర్వేషన్లు ఖరారు..?
-కొత్త చట్టంతోనే మున్సిపల్‌ రిజర్వేషన్లు..!
మెదక్‌ మున్సిపాలిటీ : జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల ఓటర్ల ముసాయిదా తుది జాబితాను ఈ నెల 16వ తేదీ వరకు విడుదల చేయనున్నారు. ఇందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆదివారం ఓటర్ల ముసాయిదా తుది జాబితాను విడుదల చేస్తామని మున్సిపల్‌ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం మరో రెండు రోజులు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మెదక్‌ మున్సిపాలిటీలో ఓటర్ల ముసాయిదా తుది జాబితా పూర్తి కాగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్లతో పాటు మున్సిపల్‌ ఓటర్ల లెక్క తేలనున్నది. మెదక్‌ మున్సిపాలిటీతో పాటు మూడు విలీన గ్రామాలకు సంబంధించిన ఓటర్లతో కూడిన జాబితాను విడుదల చేశారు. ఈ నెల 11న మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితాను విడుదల చేసి ఆయా రాజకీయ పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేసి ఒక్కో సెట్‌ జాబితాను అందజేశారు. ఈ నెల 12వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించి, 13న క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి పరిష్కరించారు. ఆదివారం రోజున ఓటర్ల ముసాయిదా తుది జాబితాను విడుదల చేయనున్నట్టు మున్సిపల్‌ అధికారులు ప్రకటించారు. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 16న ఓటర్ల ముసాయిదా తుది జాబితాను ప్రదర్శించనున్నట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు ఆగస్టు రెండో వారంలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుండడంతో ఎన్నికల ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. మెదక్‌ మున్సిపాలిటీలో గతంలో 27 వార్డులు ఉండగా, ఆయా గ్రామాల విలీనంతో వార్డుల సంఖ్య 32కు పెరిగింది.
20 తర్వాతే రిజర్వేషన్లు ఖరారు..?
ఈ నెల 20 తర్వాత ఎప్పుడైనా కొత్త చట్టంలో రూపొందించిన నిబంధనల ప్రకారంగా రిజర్వేషన్లు ఖరారు చేస్తారనే ప్రచారం జరుగుతున్నది. అయితే కొత్త చట్టం తెరపైకి రావడంతో ఆశావహుల్లో సందిగ్ధం నెలకొంది. కొత్త చట్టం ఎట్లుంటదో రిజర్వేషన్లు ఎలా కేటాయిస్తారోననే ఆందోళన మొదలైంది. జిల్లాలోని మెదక్‌ మున్సిపాలిటీతో పాటు నూతనంగా ఏర్పడిన తూప్రాన్‌, నర్సాపూర్‌, రామాయంపేట మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఏ వార్డు నుంచి ఎవరో..
మెదక్‌ మున్సిపాలిటీలో గతంలో 27 వార్డులు ఉండగా, నూతనంగా విలీనమైన గ్రామాలతో కలిపి 32 వార్డులకు పెరిగింది. వార్డుల పునర్విభజనతో పాటు ఓటర్ల గణన పూర్తి చేసిన ఓటర్ల జాబితా ఫైనల్‌ చేశారు. దీంతో రిజర్వేషన్లపై టెన్షన్‌ మొదలైంది. పాత వార్డుల్లో గతంలో ప్రాతినిథ్యం వహించిన నేతల భవిష్యత్‌ మార్చే విధంగా పునిర్వభజన జరిగింది. అయితే కొన్ని ప్రాంతాల్లో బీసీ ఓట్లు, మరికొన్ని ప్రాంతాల్లో ఎస్సీ ఓట్లు ప్రభావం చూపే పరిస్థితి నెలకొంది. దీంతో ఏ వార్డు ఏ రిజర్వేషన్‌గా మారుతుందోననే ఆందోళన ఆశావహుల్లో మొదలైంది. వార్డుల పునర్విభజన సమయంలో ఓట్లు గల్లంతై ఒక వార్డు నుంచి మరో వార్డుకు వెళ్లడంతో ఏ వార్డులో పోటీ చేయాలనే సందిగ్ధం తాజా మాజీల్లో నెలకొంది. దీనికి తోడు రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో ప్రచారం చేసుకునేందుకు అడ్డంకిగా మారింది. ఇదిలావుండగా జిల్లాలో నూతనంగా ఏర్పడిన తూప్రాన్‌, నర్సాపూర్‌, రామాయంపేట మున్సిపాలిటీల్లో కూడా రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ మొదలైంది. కొత్తగా మున్సిపాలిటీలు ఏర్పడడంతో ఎవరు చైర్మన్‌ పీఠాన్ని అధిరోహిస్తారో వేచి చూడాల్సిందే.

మెదక్‌లో 64 పోలింగ్‌ కేంద్రాలు..
మెదక్‌ మున్సిపాలిటీలో గతంలో 32పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, వీటిని 64 పోలింగ్‌ కేంద్రాలకు పెంచారు. ఒక్కో వార్డుకు రెండు పోలింగ్‌ కేంద్రాలను కేటాయించనున్నారు. మెదక్‌ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 32 వార్డులు ఉండగా ఇందులో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కింద 16 వార్డులు మహిళలకు కేటాయించనున్నారు. ఇదిలావుండగా తూప్రాన్‌ మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా, ఒక్కో వార్డులో రెండు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో 32 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. నర్సాపూర్‌ మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా, 30 పోలింగ్‌ కేంద్రాలు, రామాయంపేట మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా, 24 పోలింగ్‌ కేంద్రాలు కేటాయించనున్నారు.

ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమాలు..
జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలకు 19 మంది జోనల్‌ అధికారులను నియమించనున్నారు. ఎన్నికల అధికారులు 29 మంది, అసిస్టెంట్‌ ఎన్నికల అధికారులు 29 మంది, పోలింగ్‌ స్టేషన్లు 150, ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు 150, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు 150, ఇతర పోలింగ్‌ అధికారులు 300 మంది మున్సిపల్‌ ఎన్నికల్లో విధులు నిర్వహించనున్నారు. అయితే గత నాలుగు రోజుల క్రితం కలెక్టరేట్‌లో ఈవోలు, అసిస్టెంట్‌ ఈవోలకు ఎన్నికలపై జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. 17న పీవోలకు, ఏపీవోలకు మెదక్‌, రామాయంపేటలలో శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. 18న తూప్రాన్‌, నర్సాపూర్‌లకు సంబంధించిన పీవోలు, ఏపీవోలకు తూప్రాన్‌లో శిక్షణ కార్యక్రమం ఉంటుంది.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...