నోటిఫికేషన్ వరకు ఓటరు నమోదు


Sat,July 13, 2019 11:14 PM

మెదక్, నమస్తే తెలంగాణ : మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతున్నది. మరో వైపు రాజకీయ పార్టీలు సైతం కసరత్తును ప్రారంభించాయి. పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాలో మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఎన్నికల వాతవారణం వేడెక్కింది. ఎన్నికల నిర్వహణకు అధికారులు ఇప్పటికే బిజీ అయ్యారు. అయితే ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ నాటికి ఓటరు నమోదుకు అవకాశం ఇవ్వడంతో పోటీ చేసే అభ్యర్థులు ఓటరు నమోదుపై నజర్ పెట్టారు. జనవరి 1, 2019 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటు హక్కును నమోదు చేసుకుంటే త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. అంతేకాకుండా ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ, చేర్పులు, మార్పులు అభ్యంతరాల స్వీకరణకు అవకాశం ఉంది. ఎన్నికల కంటే ముందు ఆదివారం తుది ఓటర్ల జాబితాను మున్సిపాలిటీల వారీగా ప్రకటించనున్నారు. కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లకు సంబంధించిన జాబితా మున్సిపల్ ఎన్నికల్లోపు తయారవుతున్నది. ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాకు ఆదనంగా కొత్త ఓటర్లను చేర్చుకునే వీలు కల్పిస్తారు. దీని కోసం ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలివ్వడంతో తహసీల్దార్ కార్యాలయాల్లో కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునే వీలుంది.
నూతన ఓటర్లపై ఆశావహుల నజర్
కొత్త ఓటర్ల నమోదుపై ఆయా పార్టీలు దృష్టి కేంద్రీకరించాయి. సాధ్యమైనంత వరకు నూతన కొత్త ఓటర్లను నమోదు చేయించి కౌన్సిలర్లను దక్కించుకుని చైర్మన్ పీఠాలు దక్కించుకోవాలని ఆయా పార్టీలు దృష్టి పెట్టాయి. తమకు అనుకూలమైన వారిని ఓటరు నమోదు చేయించే పనిలో పడ్డారు.
జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఓటర్లు 75,717
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో ఇటీవల ఓటరు జాబితా ప్రకారం 75,717 మంది ఓటర్లు ఉన్నారు. మెదక్ మున్సిపాలిటీలో 34,465 మంది ఓటర్లు, నర్సాపూర్ మున్సిపాలిటీలో 13,493 మంది, తూప్రాన్ మున్సిపాలిటీలో 17,163 మంది, రామాయంపేట మున్సిపాలిటీలో 11,596 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ నాటికి కొత్తగా నమోదు చేసుకున్న ఓటరు జాబితా అదనంగా వచ్చే అవకాశం ఉన్నందున మరికొన్ని ఓట్లు పెరుగనున్నాయి.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...